Saturday, July 27, 2024

మార్పు తధ్యమా..?

తప్పక చదవండి
  • హుటాహుటిన హస్థినకు తరలిన బీజీపీ నేత ఈటల రాజేందర్..
  • బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం
  • ఈటల కోసమే కొత్త పదవి క్రియేట్ చేస్తున్న అధిష్టానం
  • రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన
  • అధినాయకత్వం అర్జెంటుగా పిలవడంపై అనుమానాలు
  • కర్ణాటక ఎన్నికల తర్వాత డైలమాలో టీబీజేపీ
  • కోవర్టులే కొంపముంచుతున్నారానంటున్న శ్రేణులు
  • టీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్న తేల్చిన సర్వేలు
  • గ్రూపులను రూపుమాపి.. అధికారంలోకి వచ్చేలా కృషి

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఖమ్మం, మహబూబ్ నగర్ లో అమిత్ షా, నడ్డాలతో భారీ బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించిన బీజేపీ.. ఈలోపు పార్టీలో బాధ్యతల అప్పగింతపై హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
పైగా కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు పచ్చగడ్డి వెయ్యకున్నా భగ్గుమంటూనే ఉన్నాయి. ఈటలకు వ్యతిరేకంగా బండి టీమ్ పని చేస్తుందనే విమర్శలు ఓవైపు. పార్టీలో ఉండాలా పొంగులేటి చెప్పినట్లు గోడ దూకేద్దామా అనే సందేహంలో ఈటల ఉన్నట్లు తెలుస్తోంది. మరీ అధినాయకత్వం అర్జెంటుగా ఆయన్ని పిలిచి మాట్లాడుతోందని వాదన గట్టిగా వినిపిస్తోన్న.. ఆయన అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డట్లు తెలుస్తుంది. ఇప్పట్లో బండి సంజయ్‌ను మార్చే ఉద్దేశం లేదని అధినాయకత్వం చెప్పడంతో ఆయన అప్పటి నుంచి కాస్త సైలెంట్ అయ్యారు. అయితే ఉన్నట్టుండి ఈటెల హస్తినకు వెళ్లడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన ఈటలకు హైకమాండ్ ఏం చెప్పింది? ఈసారి మళ్ళీ ఎందుకు పిలిచారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటలకు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు ప్రచారం ఊపందుకుంది..

హైదరాబాద్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ధీటుగా ఢీకొట్టేందుకు.. అవసరమైన అస్త్రాలను బయటకు తీస్తోంది బీజేపీ అధిష్టానం . పార్టీలో లుకలుకలకు బ్రేక్ చెప్పడం, అధికార పార్టీ వైఫల్యాలను హైలైట్ చేయడం, కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించడం.. ఇలా రకరకాల వ్యూహాలతో అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతూ తెలంగాణపై దృష్టి సారిస్తోంది.. కర్ణాటక ఎన్నికల తర్వాత డైలమాలో ఉన్న తెలంగాణ బీజేపీపై అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ హుటాహుటిన ఢిల్లీకి పిలిచిన అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించబోతుందని సమాచారం. ప్రచార కమిటీని ఏర్పాటు చేసి, దానికి బాధ్యతలు అప్పగించనున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీరుతో రాష్ట్రంలోని బీజేపీలో రెండు వర్గాలు విడిపోయిందని అధిష్టానం గుర్తించిందని.. త్వరలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఇది పార్టీకి చేటు తెస్తుందని అధిష్టానం భావించింది. దీంతో గ్రూపులను రూపుమాపి అందరు పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ఢిల్లీ పెద్దలు పదే పదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందే ఆశావహులను పార్టీలో చేరేలా బీజేపీ యత్నాలు చేస్తోంది. ఈ బాధ్యతను ఈటలపై పెట్టింది అధిష్టానం. ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే మరి ముఖ్యంగా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలపై కన్నేసింది తెలంగాణ బీజేపీ. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లిలను బీజేపీలో చేరాలని ఈటల పలు యత్నాలు చేశారు. వారిద్దరిని స్వయంగా కలిసి మరీ బీజేపీలో చేరాలని చర్చలు జరిపారు ఈటల. కానీ అవేవీ ఫలించలేదు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరటానికి మొగ్గు చూపారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. మెజార్టీ అనుచరుల నిర్ణయం మేరకు కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరికపై జూన్ 12న ప్రకటన చేయనున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఒక్క అభ్యర్థిని కూడా గెలవనివ్వనని.. అసెంబ్లీ గేటు దాటనివ్వనని శీనన్న ఇప్పటికే ప్రకటించారు.

- Advertisement -

కోవర్టులు కొంప ముంచుతున్నారా?
ఉన్న వాళ్లు బయటకు రావడానికైనా… వేరే పార్టీ వాళ్లు బీజేపీలోకి వెళ్లకపోవడానికైనా చెప్పే ఒకే ఒక కారణం కోవర్ట్. అదే కేసీఆర్‌ మనుషులు బీజేపీలో ఉన్నారని అక్కడ జరిగే పరిణామాలు, చేరికలు, ఇతర సమాచారాన్ని బీఆర్‌ఎస్‌కు లీకులు ఇస్తున్నారని ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నమాట. అయితే తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే కారణంగా కనిపిస్తున్నాయి. అసలే పార్టీ సమస్యల్లో ఉంటే ఇప్పుడు నేతల మధ్య విభేదాలు పుండు మీద కారం చల్లినట్టు ఉంటోంది. ముఖ్యంగా వేరే పార్టీల నుంచి చేరిన వారు పక్కచూపులు చూస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరికొందరు ఆపార్టీలో చేరుదామా అన్ని కొన్ని రోజులుగా ఆలోచించిన వాళ్లు ఇప్పుడు బీజేపీ వైపు చూడటానికే ఇష్టం పడటం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు