Monday, September 25, 2023

ఐఏఎస్ అధికారిపై33 కోర్టు ధిక్కరణ కేసులు..

తప్పక చదవండి
  • హైకోర్టు ఆదేశాలను లెక్కచేయని నవీన్ మిట్టల్
  • 2017 నుండి నేటి వరకు 33 కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న సీనియర్ బ్యూరోక్రాట్
  • 179 మంది బాధితులు, 33 కోర్టు ధిక్కరణ కేసులు..బహుమానంగా అదనపు శాఖలు అప్పగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • ఉన్నత విద్యాశాఖలో ఈయనకు ఎదురు తిరిగితే.. సస్పెండ్ లేదా సర్వీస్ రిమూవల్.!
  • ఐఏఎస్ యొక్క భరించలేని వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్న వందలాది మంది బాధిత ఉద్యోగులు..

( హైకోర్టు తీర్పులను శిరసావహించి అమలు జరపాల్సిన ఐఏఎస్ లే ఉన్నత న్యాయస్థానాల జడ్జిమెంట్లకు ఎదురు వెళ్లి పోరాటం చేయడం అనేది శోచనీయం, గర్హనీయం కూడ.)

పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి..

- Advertisement -

హైదరాబాద్, ప్రభుత్వ రంగ వ్యవస్థలో ఐఏఎస్ ల పాత్ర కీలకమైన భూమిక. ప్రభుత్వానికి వచ్చే మంచి, చెడులు వీరి పని విధానాలపైనే ఆధారపడి ఉంటుంది. అన్నింటికి మించి పబ్లిక్ సర్వీస్ లోకి వస్తున్న తరుణంలో వీరు గౌరవ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఈ దేశ న్యాయ వ్యవస్థలను, చట్టాలను పరిరక్షించి ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని ప్రమాణం చేసి ఈ వృత్తిలోకి వస్తారు. అలాంటి ఉన్నతాధికారులే న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులను గౌరవించకుండా, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తూ, చివరికి కోర్టు ధిక్కరణ కేసులు సైతం ఎదుర్కొనే స్థాయికి వెళుతున్నారంటే వారి వెనుక ఉన్న ఆ ధైర్యం ఎవరు? ప్రభుత్వ పాలకులే కదా!

ఇలాంటి కేసుల విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనేకసార్లు మండిపడిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే గడిచిన సంవత్సరం మార్చిలో ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు కోర్టు ధిక్కరణ నేరం క్రింద జైలు శిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే కొంతమంది అధికారుల ఒంటెద్దు పోకడల వలన ప్రభుత్వం బదనాం కాక తప్పదు. ప్రస్తుతం తెలంగాణ సి.సి.ఎల్.ఎ. కు చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ బ్యూరో క్రాట్ అయిన నవీన్ మిట్టల్ గత 2017 నుండి తెలంగాణ ఉన్నత విద్యా మండలికి కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గడిచిన 2017 నుండి మొదలు 2023 వరకు పలు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లాంటి కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ చాలామందిని అకారణంగా తన కలం పోటుతో సస్పెండ్ చేయడం లేదా సర్వీస్ నుండీ రిమూవల్ చేస్తున్నారంటూ అనేకమంది ఉద్యోగులు హైకోర్టులో కేసులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ శాఖలో నేనే రాజు.. నేనే మంత్రి..! హైకోర్టు ఆదేశాలు ఇక్కడ జాంతానై.! అన్నట్లు ఇక్కడ వ్యవహారం నడుస్తోందని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. నవీన్ మిట్టల్ ఆదేశాలతో సస్పెండ్ అయిన వారు అకారణంగా సర్వీస్ నుండి రిమూవల్ అయిన ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు బాధితుల తరఫున ఎన్నో తీర్పులు ఇచ్చినా సదరు హైకోర్టు తీర్పులను సకాలంలో అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబించడంతో 179 మంది బాధిత ఉద్యోగులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ధిక్కరణ నేరం క్రింద ఉన్నత విద్యా మండలి కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ విషయంలో సుమారు 33 కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ( 2017 లో కోర్టు ధిక్కరణ కేసు నెంబర్లు: సి.సి. నెం.1326, 1199, 1672, 915, 2783, 1441, 2160, 1147, 1152, 819, 2388, 1041, 397, 1423, 1228, 1577, 1553, 2043, 1985, 1622, 1588/2017. కాగా, ప్రస్తుతం 2023లో కోర్టు ధిక్కరణ కేసు నెంబర్లు: సి.సి నెం.277, 430, 796, 611, 681, 573, 971, 671, 1020, 670/2023). ఏ శాఖలో లేనంత నిర్లక్ష్య వైఖరి ఇక్కడ మాత్రమే ఎందుకు ఇలా ఉంటుందనేది ఎవరికి అంతుబట్టని ప్రశ్న. నవీన్ మిట్టల్ నిర్లక్ష్య వైఖరి ఇందుకు కారణం అనుకోవాలా! లేదా న్యాయస్థానాలంటే ఈ అధికారికి గౌరవం లేదని భావించాలా.? అనే ప్రశ్న బాధిత ఉద్యోగుల్లో ఉత్పన్నం అవుతోంది.

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పులను అమలు చేయకుండా, కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవడం వల్ల ఇలాంటి ఐఏఎస్ అధికారులు ఈ సమాజానికి ఎలాంటి సంకేతాలు పంపదల్చుకున్నారో అర్థం కాని దుస్థితి. ప్రజా సంపదను దుర్వినియోగం చేయడం, కాలాన్ని వృధా చేసి, చివరికి ఇలాంటి ఐఏఎస్ అధికారులు న్యాయస్థానాల ముందు తలదించుకోవడం తప్ప వీరు చేసేది ఏమీలేదు. నెలసరి జీతం తీసుకునే ఒక ప్రభుత్వ జీతగాడు అయ్యుండి.. గౌరవ హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటే దీనికి పరిష్కారం ఏంటి..! ఇలాంటి అధికారుల పరాకాష్టకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. పాలకులు అది మరిచిపోయి అదనంగా ఇలాంటి అధికారులకే బహుమానంగా అదనపు శాఖలు అప్పగిస్తున్నారంటే పాలకుల్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి.?

నవీన్ మిట్టల్ పై ఓ సాధారణ దళిత లెక్చరర్ హైకోర్టు లో సాధించిన విజయం ఏంటి.? త్వరలో… మీ “ఆదాబ్” లో

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు