అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ తొలిసారి స్పందించాడు. రిటైర్మెంట్ నిర్ణయం పట్ల బాధ పడడం లేదని అన్నాడు. తనకెంతో ఇష్టమైన ఆట నుంచి తప్పుకునేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నానని బ్రాడ్ తెలిపాడు. ‘బెన్ స్టోక్స్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే నా రిటైర్మెంట్ నిర్ణయం చెప్పాను.

వీడ్కోలు గురించి నాకు ఒక్క సందేహం, ఇసుమంత బాధ కూడా లేదు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆఖరి మ్యాచ్ ఆడడం సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాదు.. నేను రిటైర్మెంట్ పలికిన తీరు ప్రత్యేకంగా అనిపించింది. మరో విషయం ఏంటంటే..? నేను ఎంతో ఇష్టపడిన ఆట నుంచి వైదొలగడానికి ఎప్పటి నుంచో సిద్దంగా ఉన్నా’ అని 37 ఏళ్ల బ్రాడ్ తెలిపాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో ఓవల్‌లో జరిగిన యాషెస్ ఐదో టెస్టుతో అతను ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. 41 ఏళ్లున్న జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ చెప్తాడనుకుంటే.. బ్రాడ్ ఆటకు అల్విదా చెప్పి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. తన కెరీర్ చివరి మ్యాచ్‌లో ఈ స్టార్ పేసర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆఖరి మ్యాచ్‌లో సిక్స్, వికెట్ తీసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టెస్టుల్లో భారత జట్టుపై హ్యాట్రిక్ తీసిన మొదటి బౌలర్‌గా బ్రాడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మరో విషయం ఏంటంటే..? టీ20 వరల్డ్ కప్‌లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు సమర్పించుకున్న మొదటి బౌలర్ తనే. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన పొట్టి ప్రపంచ కప్‌లో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ధాటికి బ్రాడ్ ఒకే ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియాపై 150 వికెట్ల ఫీట్ సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా బ్రాడ్ మరో రికార్డు నెలకొల్పాడు. అలాగే.. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అత్యధికంగా 18 సార్లు ఔట్ చేసి ఈ స్టార్ పేసర్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. కీలకమైన చివరి యాషెస్ టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ 2-2తో సిరీస్ పంచుకున్న విషయం తెలిసిందే.