Thursday, June 13, 2024

అధ్యక్ష పదవికి నేనూ అర్హుడినే..( సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్.. )

తప్పక చదవండి
  • రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడి మార్పు వార్తలు వాస్తవమే..
  • పదేళ్లుగా పార్టీకోసం కృషి చేస్తున్నాని వెల్లడి..
  • వందకోట్లు ఉంటే పార్టీని దున్నేస్తానని ప్రకటన..
  • నన్ను చూసే ఈటల పార్టీలోకి వచ్చాడన్న రఘునందన్..
  • రఘునందన్‌, ఈటల బొమ్మలు ఉంటేనే బీజేపీ గెలుస్తుంది..
  • బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘునందన్‌ పేల్చిన బాంబ్..

న్యూ ఢిల్లీ, తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి మార్పు వ్యవహారంతో క్షణ క్షణానికి అగ్గి రాజుకుంటోంది. తాను పదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతుంటే తనను పట్టించుకోవడం లేదంటూ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు స్వరం పెంచి దుమారం రేపారు.. అంతేకాదు ఏకంగా ప్రస్తుత తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విూడియాతో జరిగిన ఇష్టాగోష్ఠిలో రఘునందన్‌ చేసిన సంచలన ఆరోపణలు తెలంగాణ బీజేపీలో అగ్ని పర్వతం బద్దలైనట్లుగా ఒక్కసారిగా అంతర్గత కుమ్ములాటలను తెరపైకి తెచ్చాయి. త్వరలో బీజేపీ అద్యక్షుడు మారిపోతున్నాడంటూ విూడియాలో వస్తున్న వార్తలు నిజమేనన్నారు. వంద కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో బీజేపీ గెలవలేదని, అదే వందకోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాడినని అన్నారు. ఎన్నికల్లో పుస్తెల తాడు అమ్మి గెలిచిన బండి సంజయ్‌ కు ఓ పేపర్‌ యాడ్‌ ఇచ్చేందుకు వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయంటూ ప్రశ్నించారు. సొంత పార్టీలో అధ్యక్షుడే టార్గెట్‌ గా రఘనందన్‌ అసమ్మతి గొంతెత్తారు. దుబ్బాక నుండి తాను గెలిచాను కాబట్టే పార్టీలోకి ఈటల రాజేందర్‌ వచ్చారని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నేను పనికిరానా.. అంటూ ఆవేదన వెళ్లగక్కారు. ఇన్నాళ్లు పార్టీ కోసం నిరంతరం పడ్డ కష్టాన్ని ఎందుకు గుర్తించడం లేదంటూ ప్రశ్నించారు. తన కులమే తనకు శాపంగా మారిందని, తాను వెలమ కులం కాబట్టే తనకు అద్యక్ష పదవి దక్కడంలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో అడుగు ముందుకేసి రాబోయే ఎన్నికల్లో ఈటల బొమ్మ, తన బొమ్మ లేకుండా తెలంగాణలో బీజేపీ గెలవడం కష్టమని అన్నారు.

తనకు అధ్యక్ష పదవి, ప్లోర్‌ లీడర్‌ లేదా జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇవ్వాల్సిందేని ఎమ్మెల్యే రఘనందన్‌ రావు డిమాండ్‌ చేశారు. దుబ్బాక నుండి మళ్లీ గెలుస్తానని అన్నారు. అయితే తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కానని అన్నారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చునని, రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు. మునుగొడులో రూ. 100 కోట్లు పెట్టిన బీజేపీ గెలవలేదని… సొంతంగానే తాను దుబ్బాక ఎన్నికల్లో గెలిచానని రఘునందన్‌ రావు అన్నారు. అదే రూ. 100 కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు. దుబ్బాకలో నన్ను చూసే ప్రజలు గెలిపించారు.. బీజేపీని చూసి కాదని అన్నారు. తనకంటే ముందు బీజేపీ పోటీచేస్తే 3500 ఓట్లు వచ్చాయన్నారు. బండి సంజయ్‌ ది స్వయం కృతాపరాధమని, పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్‌కు వంద కోట్లు పెట్టి యాడ్స్‌ ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. పార్టీ డబ్బులో తనకూ వాటా ఉందన్నారు. పేపర్‌ ప్రకటనలలో తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బాన్సల్‌ బొమ్మలు కాదు.. రఘునందన్‌, ఈటెల రాజేందర్‌ బొమ్మలుంటే ఓట్లు వేస్తారని రఘునందన్‌ రావు అన్నారు. పార్టీకి శాశనసభపక్ష నేత లేడనే విషయం జేపీ నడ్డాకు తెలియదని.. ఆ విషయమై ప్రశ్నిస్తే అదేంటి అంటూ నన్నే నడ్డా అడిగారన్నారు. తాను గెలిచినందుకే ఈటెల పార్టీలోకి వచ్చారన్నారు. బండి సంజయ్‌ మార్పుపై విూడియా ప్రశ్నించగా.. విూడియాలో వస్తున్నవన్నీ నిజాలేనని అన్నారు. పది ఏళ్లలో పార్టీ కోసం తనకంటే ఎక్కువ ఎవరు కష్టపడలేదని రఘునందన్‌ రావు అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు