Friday, October 11, 2024
spot_img

ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబావుటా..

తప్పక చదవండి
  • 9 మంది ఎమ్మెల్యేలతో షిండేకు మద్దతు
  • ద్రోహులకు బుద్ధిచెబుతామని పవార్ శపథం
  • మహారాష్ట్ర ఎన్సీపీకి కొత్త చీఫ్‌ను ప్రకటించిన పార్టీ
  • జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ కొనసాగుతారని వెల్లడి

న్యూ ఢిల్లీ, రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్‌ను అజిత్ పవార్ అదునుచూసి దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకున్న శరద్ పవార్.. తన గురువు, మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్‌కు గురుపూర్ణిమ సందర్బంగా సతారా జిల్లాలోని కరాడ్‌లో అతని స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను బీజేపీ ‘నాశనం’ చేయడానికి ప్రయత్నిస్తోందని, ఎన్‌సీపీని పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

కాగా, పార్టీని చీల్చి అధికార పార్టీకి మద్దతు ప్రకటించిన అజిత్ పవార్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడిని మార్చింది. ఇప్పటి వరకు మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్‌గా జయంత్ పాటిల్ ఉండగా.. అతడ్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానంలో సునిల్ తట్కార్‌ను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా మాత్రం శరద్ పవార్ ఉంటారని స్పష్టం చేశారు. మరోవైపు.. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్సీపీ తిరుగుబాటు వర్గంలోని నేతలు వెల్లడించారు. దీంతో ఎన్సీపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.

- Advertisement -

మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు ఉన్న జయంత్ పాటిల్‌ను అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తిరుగుబాటు వర్గం తొలగించింది. ఆ స్థానంలో కొత్తగా లోక్‌సభ ఎంపీ సునిల్ తట్కారేను నియమిస్తున్నట్లు ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. అయితే ఎన్సీపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు శరద్ పవార్‌పైనే ఉంటాయని వెల్లడించడం గమనార్హం. మహారాష్ట్రలో ఎన్సీపీని బలోపేతం చేసేందుకే చీఫ్ బాధ్యతలు స్వీకరించినట్లు సునీల్‌ తట్కారే తెలిపారు. ఎన్సీపీలోని నాయకులందరి మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అందరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ నాయకులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. దీంతో ఎన్సీపీలో ఏం జరుగుతుందోనని రాజకీయ విశ్లేషకులతోపాటు సాధారణ ప్రజలు గందర గోళానికి గురవుతున్నారు.

కాగా గత కొంత కాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత, అధినేత శరద్ పవార్ సోదరుని కుమారుడు అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మహా వికాస్ ఆఘాఢీ నుంచి బయటకు వచ్చి అధికారంలో ఉన్న ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీంతో అజిత్ పవార్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయన వర్గానికి చెందిన మరో 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలోనే తమదే అసలైన ఎన్సీపీ అని తిరుగుబాటు వర్గం వాదిస్తోంది. తమకు 43 మంది ఎమ్మెల్యేల బలం ఉందని అజిత్ పవార్ వెల్లడించారు. మరోవైపు.. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్ పవార్‌ను ఎన్నుకున్నారు. అయితే ఇటీవల ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లను శరద్ పవార్ నియమించారు. అప్పట్నుంచి అజిత్ పవార్ అంసతృప్తి తార స్థాయికి చేరింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు