- కూల్చివేతలు కాలయాపన చేస్తున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు..
- అక్రమార్కులకు ఓ బడానేత అండ..
నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
“ఆదాబ్” ప్రచురించిన కథనాలకు స్పందించిన మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లను రద్దు చేశారు.. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, నార్సింగి మున్సిపాలిటీలో 6 వార్డు సర్వే నెంబర్ 205/1లో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు 1 ఎకరం 33 గుంటల ప్రభుత్వం భూమిని 2001 నాటి ప్రభుత్వం కేటాయించింది.. అయితే ఎవరికైతే భూమిని కేటాయిస్తారో ఆ భూమి ఏలుబడిలో వారే ఉండాలి.. కానీ కొందరు రిటైర్డ్ ఆర్మీ సైనికులు విక్రయాలు జరిపారు. అలా జరపటం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ (పీ.ఓ.టి.) ఆస్థి బదలాయింపు నిషేధ చట్టం కింద స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.. అది అలా ఉంటే అధికార పార్టీకి చెందిన ఓ భారీ తిమింగలం ఆ భూమిని కొనుగోలు చేసి సుమారు 45 రేకుల షెడ్లను రాత్రికి రాత్రే నిర్మించి ఇంటి నెంబర్లు పొందింది.. ఆ మేరకు ‘ఆదాబ్’ ప్రతినిధి దృష్టికి రావడంతో వరుస కథనాలు ప్రచురించింది.. దీంతో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలకు కేటాయించిన ఇంటి నెంబర్లను రద్దు చేసింది.. ఇంటి నెంబర్ల రద్దు చేసినట్లు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసికెళ్ళి 10 రోజులు గడుస్తున్నా నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.. అధికార పార్టీకి చెందిన ఓ బడానేత ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతలకు వెనుకాడుతున్నట్లు ఆ పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే పేర్కొనటం గమనార్హం.. బ్రతుకు దెరువు కోసం రోడ్ పక్కన 10 గజాల జాగాలో పాన్ డబ్బా పెట్టుకుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ లో పాల్గొని కూల్చి వేస్తారు.. 1 ఎకరం 33 గుంటల స్థలం విలువ సుమారు రూ. 80 కోట్ల పైమాటే ఉంటుంది.. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ గంప గుత్తగా కొనుగోలు చేసి బినామీ పేర్లతో ఇంటి నెంబర్లు పొందితే.. ” ఆదాబ్ హైదరాబాద్ ” అడ్డుకొని ఇంటినెంబర్లను రద్దు చేయించింది.. కానీ అన్ని అధికారాలున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడాలంటేనే భయ భ్రాంతులకు గురౌతున్నారని స్థానికులు సైతం విమర్శిస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ పాల్గొని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..