Monday, June 17, 2024

లచ్చ కోసం లైన్..( కుల, ఆదాయ సర్టిఫికేట్ల కోసం పడిగాపులు.. )

తప్పక చదవండి
  • మీ సేవ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షణ…
  • బారులు తీరి కనిపిస్తున్న ప్రజలు.
  • కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు..

ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష సాయం జనాలకు లేని తిప్పలు తెచ్చిపెడుతోంది.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మండుటెండలో మల మల మాడిపోతున్నారు.. లక్ష రూపాయలు వస్తుందని ఒకవైపు ఆశ.. మీ సేవా కేంద్రాల వద్ద నిరీక్షించడానికి ఓపిక లేక ఓ వైపు.. పడరాని పాట్లు పడుతున్నారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇవే దృష్యాలు దర్శనం ఇస్తున్నాయి.. లక్ష మాట దేవుడెరుగు.. బ్రతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అనుకుంటూ కొందరు తిరిగి వెళ్లిపోతున్నారు.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వం పంచుతున్న తాయిలం కోసం ఎగబడుతున్న జనాలను చూసి విశ్లేషకులు ముక్కుమీద వేలేసుకుంటున్నారు.. అధికారంలో ఉన్న బీ.ఆర్.ఎస్. గవర్నమెంట్.. రూ. లక్ష పేరుతో ఓపెన్ గానే ఓట్లు కొనుగోలు చేస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం ఎంత మందికి అందుతుందో తెలీదు కానీ.. దరఖాస్తుదారుల జేబులకు మాత్రం భారీగా చిల్లులు పడుతున్నాయి.. సర్టిఫికెట్లు, జిరాక్సుల కోసం చేతిచమురు వదులుతోంది. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందాలనే ఆలోచనతో ఉన్న వారి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ, వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోంది.. చేతి, కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బీసీలలోని 15 కులాలకు తొలివిడతలో ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆయా కులాలకు చెందిన వారు కుల ధ్రువీకరణ పత్రాల కోసం కొత్తూరు మీసేవ కేంద్రాలవద్ద తహసీల్దార్‌ కార్యాలయంల ఎదుట బారులు దీరుతున్నారు.

- Advertisement -

దరఖాస్తు చేసుకునే విధానం :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు లక్ష రూపాయల సాయం పొందడానికి దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం ఇలా ఉంటుంది.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పకుండా ఉండాలి. ప్రభుత్వం నుంచి రూ,50 వేలు అంతకు మించి సహాయం పొందిన వారు అర్హులు కారు. అదేవిధంగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద సహాయం పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు.18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వారు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో కులానికి 10 మంది చొప్పున ఎంపిక చేసి వచ్చే నెల 9న సంక్షేమ దినోత్సవం సందర్భంగా చెక్కులు అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.. కాగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని అధికారులు తెలిపారు..

మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరిన జనాలు :
ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రూ.లక్ష సాయం పథకం కింద ముందుగా దరఖాస్తు చేసుకుంటే మనకే వస్తుందంటూ కొందరు ప్రచారం చేయడంతో ఆశావహులంతా ఒక్కసారిగా దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొచ్చారు. దీంతో మీసేవ కేంద్రాలన్నీ దరఖాస్తు దారులతో కిటకిటలాడాయి.

అమాయకులను మోసం చేస్తున్న ఈ సేవా నిర్వాహకులు :
పల్లె ప్రాంతాలనుంచి వస్తున్న నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మీసేవ కేంద్రాల నిర్వాహకులు కొందరు ఒక్కో సర్టిఫికెట్‌ నమోదుకు రూ. 45 తీసుకోవాల్సి ఉండగా ఎక్కువ వసూలు చేస్తున్నట్లు సమాచారం. పాత సర్టిఫికెట్‌ లేని వారి నుంచి ఇంకా ఎక్కువ మొత్తంలోనే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులు అడిగినంత ఇవ్వకపోతే సర్టిఫికెట్‌ సకాలంలో రాదన్న భయంతో అడిగినంత ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది..

దరఖాస్తులకు ఈనెల 20 ఆఖరు తేదీ :
రూ.లక్ష సాయం పథకం కోసం బీసీ సంక్షేమ శాఖ ప్రకటించిన 15 కులాలకు తొలివిడతలో అవకాశం కల్పించింది. దరఖాస్తులను సమర్పించేందుకు ఈనెల 20 తేదీ ఆఖరు గడువుగా ప్రకటించింది. అందులో సగర ఉప్పర, నాయీబ్రాహ్మణ, రజక, కుమ్మరి శాలివాహన, అవుసుల, కంసాలి, వడ్రంగి శిల్పులు, వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణబలిజపూస, మేర టైలర్స్‌, ఆరె కటిక, ఎంబీసీ కులాల వారికి తొలివిడతలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

జాప్యం లేకుండా జారీ చేయాలి :
షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ శాతం బిసి కులాల వారు కలిగి ఉన్నారు.. ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఎక్కువే. దరఖాస్తుకు సంబంధించిన సర్టిఫికెట్లను జాప్యం లేకుండా జారీ చేయాలని వారు కోరుతున్నారు. రూ.లక్ష సాయం పథకం కోసం లబ్దిదారులు సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి సకాలంలో అందించాలని లబ్ధిదారులు కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు