Friday, May 17, 2024

హైదరాబాద్ భూములకు మాంచి గిరాకీ..

తప్పక చదవండి
  • మరో మూడు జిల్లాల్లో వేలానికి నోటిఫికేషన్..
  • హెచ్ఎండీఏ పరిధిలోని భూములకు ఈ-వేలం..
  • రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో సైతం..
  • చదరపు గజం కనీస ధర రూ.12 వేలు, గరిష్ఠ ధర రూ.65 వేలు
  • ఈ వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 16..
  • పూర్తి వివరాలు హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో లభ్యం..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. నగర శివారుల్లోని భూములకు కూడా డిమాండ్ అమాంతం పెరిగిపోతూ.. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూములకు ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహించగా.. 100 కోట్లకు పైగా పలికి.. దేశంలోనే రికార్డు ధరతో కోకాపేట భూములు కాసుల వర్షం కురిపించాయి. దీంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ భూములవైపు చూసింది. దాని తర్వాత నిర్వహించిన మోకిలా వెంచర్, షాబాద్ వెంచర్లలోని భూములు కూడా రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఇక ఈ వెంచర్లు ఇచ్చిన బూస్ట్‌తో.. హెచ్ఎండీఏ పరిధిలోని మరిన్ని భూములకు ఈ- వేలం నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మరోమారు భూముల వేలానికి సిద్ధమైంది. మూడు జిల్లాల్లోని ప్రభుత్వ భూములను అమ్మేందుకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాల్లోని భూములను వేలం వేయనున్నట్లు తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోని బైరాగిగూడ, మంచిరేవుల, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్, పీరంచెరువులోని భూములను అమ్మకానికి పెట్టింది. సంగారెడ్డిలో వెలిమల, అమీన్ పూర్, నందిగామ, పతిఘనపూర్, కిష్టారెడ్డిపేటలతో పాటు మేడ్చల్ – మల్కాజ్ గిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం ప్రాంతాల్లోని భూములను విక్రయించనుంది.
నోటిఫికేషన్ లో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భూములకు చదరపు గజానికి కనీస ధర రూ.12 వేలు, గరిష్ఠ ధర రూ.65 వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఆన్ లైన్ లో జరగనున్న ఈ వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 16 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 18 నుంచి ఈ-వేలం ద్వారా భూముల విక్రయం జరగనుందని తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్ఎండీఏ వెబ్ సైట్ సందర్శించాల్సిందిగా అధికారులు సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు