Sunday, April 21, 2024

లోక ఆకలికి తృణ ధాన్యాలు‌ సరైన ఔషధాలు…!

తప్పక చదవండి

ఐక్యరాజ్యసమితితో పాటు “ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, ఎఫ్‌ఏఓ)” 2023ను “అంతర్జాతీయ మిలెట్స్‌ సంవత్సరం(ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ మిలెట్స్‌)-2023”గా ప్రకటించడంలో భారత్ ప్రభుత్వం‌ తీసుకున్న చొరవ ప్రశంసనీయం. మిలెట్స్‌ లేదా చిరుధాన్యాలు/సిరి ధాన్యాలు/తృణధాన్యాల వినియోగంతో ఆరోగ్య పరిరక్షణతో పాటు అధిక పోషకాలు సమపాళ్లలో శరీరానికి అందించబడతాయని ప్రజలకు అవగాహన పరచడానికి 2023 ఏడాదిని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారతం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. భారత ప్రభుత్వం 2018 ఏడాదిని “నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ మిలెట్స్‌ (జాతీయ మిలెట్స్‌ సంవత్సరం)”గా పాటించి పలు అవగాహన కార్యక్రమాలతో పాటు వాటి ఉత్పత్తి/వినియోగం/పంపిణీ అంశాల్లో అవగాహన కలిపించిన విషయం మనకు తెలుసు. మిలెట్స్‌ పండించడానికి అతి తక్కువ సాగు నీరు అవసరం అవడమే కాకుండా తక్కువ కాలంలో పంట రైతు చేతుల్లోకి వస్తుంది.

భారత్‌ – గ్లోబల్‌ హబ్‌ ఆఫ్‌ మిలెట్స్‌:
మిలెట్స్‌ను ఆహారంగా‌ వాడకానికి ప్రజా ఉద్యమం (పీపుల్స్‌ మూవ్‌మెంట్‌) రావాలని, భారత దేశం “గ్లోబల్‌ హబ్‌ ఆఫ్‌ మిలెట్స్‌”గా సుస్థిర స్థానం పొందిందని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను మనం ఇంకా మరిచి పోలేదు. ఆసియా దేశాల అవసరాలకు 80 శాతం, ప్రపంచ దేశాల జనాభా అవసరాలకు 20 శాతం మిలెట్స్‌ను భారత్‌ అందిస్తున్నది. 2023-24 ఏడాదిలో మిలెట్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కు భారత ప్రభుత్వం భారీ నిధులను కూడా కేటాయించింది. భారత దేశంలో ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థల ద్వారా మిలెట్స్‌ను పేదలకు తక్కువ ధరకు/ఉచితంగా అందజేస్తున్నది. సుస్థిరాభివృద్ధి, రైతుల సాధికారత, ఆకలిని తరమడం, ప్రతికూల వాతావరణ మార్పుల కట్టడి, జీవవైవిధ్య పరిరక్షణ, వ్యవసాయ ఆహార వ్యవస్థలను బలోపేతం చేయడంలో మిలెట్స్‌ ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి.

- Advertisement -

చిరుధాన్యాలతో ప్రజారోగ్య పరిరక్షణ:
ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్ మిలెట్స్‌-2023 నినాదంగా “ఆరోగ్య చిరుధాన్యాలు, ఆరోగ్య ప్రజలు (హెల్దీ మిలెట్స్‌, హెల్దీ పీపుల్‌)” అనబడే అంశాన్ని తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణకు మిలెట్స్‌ ఉపయోగపడడంతో వాటి ఉత్పత్తి, వినియోగం, వాటి విలువను పెంచడం కోసం పలు చర్యలను తీసుకోవడం జరుగుతున్నది. అధిక పోషక విలువలు కలిగిన తృణ ధాన్యాలను అనారోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రమే అధికంగా వినియోగిస్తున్నారు. ఆరోగ్యవంతులు సిరి ధాన్యాలను వాడిన వారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని గమనించాలి. ప్రతి రోజు మన ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా జాగ్రత్త పడాలి.

ముఖ్యమైన మిలెట్స్‌లో రాగులు, కొర్రలు, ఎండు కొర్రలు, అరికెలు, సామలు, ఉధలు వంటివి సిరి ధాన్యాల వర్గంలోకి వస్తాయని మనకు తెలుసు. సన్నని గడ్డి లాంటి మొక్కల ద్వారా లభించే చిరుధాన్యాల్లో తక్కువ కెలరీలు, అధిక మాంసకృత్తులు/పీచు పదార్థాలు ఉంటాయి. మిలెట్స్‌ ఆహారంతో జీర్ణశక్తి మెరుగుపడడం, కండరాల పని తీరు పెరగడం, గాయాలు తొందరగా మానడం, మలబద్దక సమస్య దూరం కావడం, బరువు తగ్గడం, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం జరుగుతుంది. ఈ ప్రయోజనాలతో పాటు నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, మూర్ఛ రోగం, మధుమేహం, బిపీ, రక్తహీనత, మలబద్దకం, కామెర్లు, వీర్యకణాలా సమస్యలు, కంటి సమస్యలు లాంటి అనారోగ్యాలకు ఔషధాలుగా తృణ ధాన్యాలు దోహదపడతాయి. గ్లూటిన్‌ రహిత శాకాహార మిలెట్స్‌లో ఫాస్ఫరస్‌తో పాటు కాల్షియం, ఐరన్, ఖనిజ లవణాలు లాంటి పోషకాలనేకం అధిక పరిమాణంలో ఉంటాయి.

సిరి ధాన్యాలు పోషకశక్తి కేంద్రాలు:
చిరు ధాన్యాలు ఆరోగ్య హేతువులని అధిక పరిమాణంలో తినరాదు. సేంద్రియ పద్దతిలో పండించని, పాలిష్‌ చేయని మిలెట్స్‌ను నానబెట్టిన తర్వాత పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం. హైపోథైరాయిడిజంతో బాధ పడే వారు, సున్నిత జీర్ణక్రియ ఉన్న బలహీనులు చిరు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవద్దు. భారత ప్రభుత్వం మిలెట్స్‌ అమ్మకాలకు జిఎస్‌టీ పన్నులను రద్దు చేయడంతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. “పోషకశక్తి కేంద్రం”గా పని చేస్తున్న తృణ ధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకుంటూ ఆరోగ్య భారత నిర్మాణంలో మన కర్తవ్యాలను నిర్వహిద్దాం.

  • మధుపాళీ, 9949700037
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు