- ప్రజల సంపదను పందికొక్కుల్లా మేస్తున్నారు..
- నాలుగు కోట్ల ప్రజలను తాకట్టుపెట్టి 5 లక్షల కోట్లు అప్పు చేశారు..
- నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో భట్టి పాదయాత్ర..
హైదరాబాద్, తరుగు పేరిట క్వింటాకు 12 కిలోల కోతను విధిస్తున్న ఈ దళారీ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్‌మార్చ్ పాదయాత్రలో భాగంగా 96వ రోజైన సోమవారం ఆయన తిప్పర్తి మండలం చిన్నసూరారం నుంచి గ్రామం మొదలై నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తాటికల్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో విక్రమార్క మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పాలకులు పందికొక్కుల్లా ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారని, దొరల ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ప్రజలను తాకట్టు పెట్టి రూ.5లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దివాళా తీయించారని అన్నారు. ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్‌గా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా దగా చేశారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొలువులు రాక విద్యార్థులు, నిరుద్యోగులు గడ్డాలు పెంచుకుని రోడ్లమీద తిరుగుతుంటే ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు నిరాశకు గురయ్యాయని అన్నారు. ప్రజల సంపదను విచ్చలవిడిగా పంపిణీచేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దొర చేస్తున్న దోపిడీతో సాధించుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేరడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని విక్రమార్క హామీ ఇచ్చారు