Thursday, May 16, 2024

తొమ్మిది ఏళ్ళు గడిచినా ఆర్టీసీ కార్మికుల కష్టాలు పోలేదు..

తప్పక చదవండి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన పొన్నం ప్రభాకర్..

హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
2019 డిసెంబర్ లో తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఉద్యమం, ఆ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సహా పలు రాజకీయ పార్టీల మద్దతు నేపథ్యంలో హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా ఆర్టీసీ కార్మిక ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి బిర్యానీ భోజనం పెట్టించి, ఉద్యమంలా సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెను శాంతింప జేయడానికి మహిళా ఉద్యోగులకు డిపోలో ప్రత్యేక ఏర్పాట్లు, ఆర్టీసీ కార్మికులకు ఫీజు రీయింబర్స్మెంట్, గృహ నిర్మాణ, తల్లిదండ్రులకు ఉచిత వైద్యం, లక్ష రూపాయల బోనస్, పదివేల కొలువులు అంటూ హామీల వరాలు కురిపించి, నెలలో ఒకసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఇలా మాటలు కోటలు దాటి ప్రసంగాలు ఉపన్యాసాలలా మారి ఆర్టీసీ ప్రతినిధులు కార్మికులతో జేజేలు కొట్టించుకొని, పాలాభిషేకాలు చేయించుకుని ఇప్పటివరకు ఆర్టీసీని, ఆర్టీసీ ఉద్యోగులను, ఆర్టీసీ వ్యవస్థను పట్టించుకోలేదు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను, కష్టాలను, గోడును మాతో చెప్పుకొని కన్నీటి పర్యంతమైన పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ అంశంపై స్పందిస్తూ, ఈ ఎన్నికల ఏడాదిలో కేవలం హామీల పేరుతో మరొకసారి ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేయకుండా ప్రగతి భవన్ వేదికగా మరియు గతంలో హైదరాబాద్ వైశ్రాయ్ హోటల్ లో ఆర్.టి.సి. ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సామావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని, అఖిలపక్షం ఆధ్వర్యంలో మరొకసారి ఆర్టీసీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సాధక బాధకాల గురించి తెలుసుకొని వారిని కష్టాల కడలి నుండి గట్టెక్కించే ప్రయత్నాలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు బస్ కా పయ్యా నహీ ఛలేగా నహీ ఛలేగా అని రాష్ట్ర రవాణా వ్యవస్థను స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడితే, స్వరాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి గా ఉంటూ ఆర్టీసీ వాలా జిందగీ నహి ఛలేగా నహీ ఛలేగా అని వారి జీవితాలను పెనం మీద నుండి పొయ్యిలో పడేట్టు
చేయడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే, ఏరు దాటేదాక ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే ఈ వైఖరి సరైంది కాదు కేసీఆర్ గారు. ఇప్పటికైనా ఆసియాలోనే మొదటి స్థానంలో ఉన్న ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం కాకుండా చూడడంతోపాటు, ఆర్టీసీని, తమ జీవితాలను బాగు చేయాలని కోరుతున్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ ల మేరకు మీరు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని కోరడంతో పాటు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైల్వే శాఖలో ఉద్యోగ నియామకాలు చేయకపోవడం వల్ల ఉద్యోగస్తుల కొరతతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యల ఆధారంగా గడచిన తొమ్మిది ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలలో ఎన్ని నియామకాలు చేపట్టినారో, ఆర్టీసీలో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ ఎందుకు నియామకాలు చేపట్టలేదో తెలపాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ, ఆర్టీసీ ఉద్యోగులకు 2019లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇచ్చిన హామీలను, వాటి స్థితిగతులను మరొకసారి గుర్తు చేస్తున్నాం.

ఏడాదికి 1000 కోట్ల నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీలో 50 శాతం ఉంచలేదు.

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్టీసీని నేరుగా పర్యవేక్షిస్తానని చెప్పిన మీరు ఇప్పటివరకు ఆ విషయంలో ప్రక్రియ ప్రారంభించలేదు.. నాలుగేళ్లు గడిచినా నాలుగు నెలలకు ఒకసారి ఉద్యోగులతో సమావేశం అవుతామని అన్న విషయంలో హామీ నిలుపుకోలేదు. డిపోల్లో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్న విషయం మరుగున పడి, పై అధికారుల ద్వారా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులకు లక్ష రూపాయల బోనస్ ఇస్తామన్న సంగతి దేవుడెరుగు, 2017 నుంచి 2021 పి.ఆర్.సి, సి.ఎస్.కె చెల్లించడంలో దిక్కేలేదు. మాట ఇచ్చి నాలుగేళ్లు గడిచినా యూనిఫామ్ ఊసే లేదు.. డిపో మేనేజర్లతో ఎమ్మెల్యేల నెలవారి సమీక్ష సమావేశాల గురించి పట్టించుకున్న వారే లేరు.. నెలలో ఒకసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని స్వయంగా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఆదేశించినా ఆర్టీసీ బస్సులను కనీసం వారు గుర్తించనే లేదు.. నాలుగు నెలల్లో ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తానని ప్రకటించి నాలుగు ఏళ్లు గడిచినా పురోగతి కానరాలేదు.. పిఎఫ్, సిసిఎస్ బకాయిలు పేరుకుపోతున్నప్పటికీ ఈ నిధులు విడుదల చేయడంలో ముఖ్యమంత్రి గారితో సహా అధికారులు సైతం శ్రద్ధ కనబరచలేదు.. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉచిత బస్సు పాసులు, ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత వైద్య సదుపాయం, ఉద్యోగులకు గృహ నిర్మాణం హామీలు అట్టకెక్కి ఏళ్ళు గడిచిపోతున్నాయి .. ఈ విధమైన సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించే ఉద్యోగ సంఘాల నిర్వీర్యంతో ఎన్నో సమస్యలతో కష్టాలతో తల్లడిల్లుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆర్టిసి కార్మికుల గురించి, తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున దూసుకు వచ్చే సముద్రపు అలల స్ఫూర్తితో పోరాడి, స్వరాష్ట్ర సాధన కోసం యుద్ధంలో తమ వీరత్వాన్ని చూపిన ఆర్టీసీ కార్మికుల త్యాగాలను గుర్తించి వారిని ఆదుకోవాలని, వారి సమస్యలను తీర్చి, డిమాండ్లను నెరవేర్చి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు