Thursday, February 29, 2024

అధోగతి పాలైన మంచినీళ్ల పథకం..

తప్పక చదవండి
 • ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేసిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ..
 • నిస్సిగ్గుగా సంస్థ అక్రమాలకు సహకరించిన అధికారులు..
 • హైడ్రో టెస్ట్ జరగలేదంటున్న ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి..
 • హైడ్రో టెస్ట్ బాజాప్తా జరిగింది అంటున్న నల్గొండ ఈఈ వంశీకృష్ణ, సూర్యాపేట ఈ ఈ వెంకటేశ్వర్లు
 • ఒక్క గ్రామంలో టెస్ట్ చేయించి నల్గొండ మొత్తం చేయించినట్లు కటింగ్..
 • మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1480 కోట్లు..
 • 3 శాతం నిధులు హైడ్రో టెస్టుకు కేటాయించాలి..
 • మూడు శాతం నిధులు మెక్కేసిన పందికొక్కులు..
 • సంస్థ యాజమాన్యం వారికి సహకరించిన
  అధికారులను కఠినంగా శిక్షించాలి..
 • రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకోవాలంటున్న సామాజికవేత్తలు..
 • న్యాయం జరక్కపోతే న్యాయ పోరాటానికి సిద్ధం : ఆదాబ్..

జనాల గొంతు తడిపే మహత్తర కార్యక్రమం.. అందులోనూ అంతులేని అవినీతి.. ధనదాహంతో తహ తహలాడుతున్న సంస్థ.. ఆ సంస్థ ఎంగిలి మెతుకుల కోసం అర్రులు చాస్తున్న కొందరు ప్రభుత్వ అధికారులు.. వెరసి ఎండిపోతున్న ప్రజల గొంతులు.. నల్గొండ జిల్లాలో జరిగిన మంచినీటి ప్రాజెక్ట్ వ్యవహారంలో ప్రవహిస్తున్న దుర్మార్గపు అవినీతి..

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు నాణ్యమైన మంచినీటిని అందించాలనే మహోన్నత ఆశయంతో.. వందల కోట్ల రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య వల్ల త్రాగునీరు లేక ఎన్నో కుటుంబాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని భావించి ముఖ్యమంత్రి కెసిఆర్ నల్గొండ లోని నాలుగు నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి మంచినీటి త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. నల్గొండ లోని నాలుగు నియోజకవర్గాలకు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ను జీ.వి.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థకు కేటాయించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా..? నాణ్యత ఏ విధంగా ఉంది.. అని తెలుసుకోవడానికి హైడ్రో టెస్ట్ తప్పనిసరిగా చేయాలి.. ఇది జివిపిఆర్ఈఎల్ సంస్థకు, ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం. కానీ కొందరు అధికారులు ఆ సంస్థ విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వ ఆశయాన్ని తూట్లు పొడిచి, హైడ్రో టెస్ట్ చేయకుండానే చేసినట్టు రికార్డులో నమోదు చేయడం శోచనీయం. ఇదే విషయంపై ‘ఆదాబ్ హైదరాబాద్’ జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. మిషన్ భగీరథలో చేసిన నాసిరకం పనులపై వరుస కథనాల ద్వారా వెలుగులోకి తేవడం జరిగింది. జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ హైడ్రో టెస్ట్ చేయకుండానే చేసినట్లు చూపించి, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన విషయంపై మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈ ఎన్ సీ) కృపాకర్ రెడ్డిని సంప్రదించి వివరణ కోరగా.. నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ పనులను నిర్వహించిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ ఎలాంటి హైడ్రో టెస్ట్ చేయనందుకు ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లించవలసిన సుమారు 200 కోట్ల రూపాయల బిల్లును ఆపివేయడం జరిగిందని స్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్టు తెలపడం జరిగింది. ఇదే విషయంపై వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్గొండ వారికి, ఫోన్ లో అనేకసార్లు వివరణ కొరకై సంప్రదించగా.. సోమవారం సాయంత్రం పంజాగుట్టలోని కేంద్ర కార్యాలయంలో ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రతినిధిని కార్యాలయానికి పిలిపించి, జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ హైడ్రో టెస్టు నిర్వహించినట్లు తెలిపారు. అదే విధంగా వీరపాలెం ప్రాంతంలో నిర్వహించిన హైడ్రో టెస్టు ఫొటోస్ మాత్రమే చూపించి పూర్తిగా మిర్యాలగూడలో హైడ్రో టెస్ట్ చేసినట్లు తెల్పడేమే కాక, దానికి సంబంధించి మెజర్మెంట్ బుక్ లో రికార్డు చేశామని తెల్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా సూర్యాపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు హైడ్రో టేస్ట్ నిర్వహించకుండానే నిర్వహించామని అవాస్తవం చెప్పడమే కాక ఎలాంటి ఫొటోస్ లేవని స్పష్టం చేయడం జరిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టు హైడ్రో టెస్టు నిర్వహించకుండా రికార్డులో నమోదు చేశారంటే ఈ అధికారుల అవినీతి, బరితెగింపు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రతినిధి అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఆగస్టు 20వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. ఇక్కడకూడా హైడ్రో టెస్టు చేసినట్టు కనీసం ఆనవాళ్లు కనిపించలేదు.. పైగా జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ వారు చేసిన పైప్ లైన్ పనుల్లో అనేక చోట్ల లీకులతో కనిపించడం జరిగింది. హైడ్రో టెస్ట్ విషయంలో పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్ ను విచారించగా హైడ్రో టెస్ట్ చేయించలేదని స్పష్టం చేయడం జరిగింది..

- Advertisement -

అయితే అంతటితో ఆగకుండా మరిన్ని నిజాలు గ్రహించడానికి ఆదాబ్ ప్రతినిధులు స్థానిక ప్రజలను, సామాజికవేత్తలను సంప్రదించడం జరిగింది.. జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ వద్ద ఆయా పైప్ లైన్స్ కు సంబంధించిన డమ్మీలు లేవు.. కావున డమ్మీలు లేకుండా హైడ్రో టెస్ట్ పెట్టడం అసాధ్యం అని తెలిపారు.. మాకు తెలిసినంతవరకు హైడ్రో టెస్ట్ నిర్వహించలేదని వారు కరాఖండిగా తెలిపారు.. కేవలం జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. చేపట్టిన నల్గొండ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎం.ఎస్. పైప్ లైన్ తో ఒకే ఒక్క చోట అంటే వీర్లపాలెం లో మాత్రమే హైడ్రో టెస్ట్ నిర్వహించారని వారు తెలిపారు.. అయితే ఇవే ఫోటోలను చూపిస్తూ నల్గొండ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వంశీ కృష్ణ నాలుగు నియోజక వర్గాల్లో పూర్తిగా హైడ్రో టెస్టులు చేసినట్లు అందరినీ మభ్యపెడుతున్నాడు.. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ సుమారు రూ. 1480 కోట్లు కాగా ఇందులో 3 శాతం పైకాన్ని హైడ్రో టెస్ట్ కోసం వినియోగించాలి.. కానీ కొందరు అధికారులు జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. యాజమాన్యంతో లోపాయికారి ఒప్పొందం చేసుకుని, హైడ్రో టెస్టుకు వినియోగించాల్సిన 3శాతం నిధులను తలా ఇంత అని పందికొక్కుల్లా పంచుకున్నారు.. దాదాపు రూ. 44 కోట్లు అడ్డంగా దిగమింగారని అర్ధం అవుతోంది.. ఇదంతా ప్రజల సొమ్ము.. ప్రజలకు ఉపయోగపడాల్సిన సొమ్ము అక్రమార్కుల బొక్కసం నింపడానికి సరిపోయింది.. మరి ప్రభుత్వం ఏమి చేస్తోంది..? నిఘావ్యవస్థ ఏమి చేస్తోంది..? ఈ అమానుషం వెనుక ఎవరైనా పెద్దలు ఉన్నారా..? వారికి కూడా వాటాలు అందాయా..? ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి హైడ్రో టెస్ట్ జరుగలేదని అంటున్నారు.. కానీ నల్గొండ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వంశీ కృష్ణ హైడ్రో టెస్ట్ జరిగింది అంటున్నారు..? మరి ఏది నిజం..? హైడ్రో టెస్ట్ చేసినట్లు ఆధారాలు కూడా లేవు.. కానీ ఇంత నీచంగా అబద్దాలు చెప్పడం.. చెప్పిన అబద్దాలను రికార్డుల్లోకి ఎక్కించడం ఏమిటి..? ఇది నేరపూరిత చర్య కాదా..? అని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు..

నల్గొండ జిల్లా, నాలుగు నియోజక వర్గాల్లో మిషన్ భగీరథ పథకం క్రింద తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ లో భాగంగా జరిగిన మంచినీటి సరఫరా ప్రాజెక్ట్ లో జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ, కొందరు అధికారులు కలిసి చేసిన దారుణ మోసాలను ఆధారాలతో సహా ఆదాబ్ బయటపెడితే ఇప్పటివరకూ ఉన్నతాధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు కానీ స్పందించకపోవడం శోచనీయం.. ప్రజలకోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు, అధికారులు సైతం అడ్డదారులు తొక్కుతుంటే ఇక సమాజాన్ని రక్షించేవారు ఎవరు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి స్పందించి.. జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థపై, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని, దోషులైనవారిని శిక్షించాలని, అదేవిధంగా వృధా చేసిన సొమ్మును, వారినుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వసూలు చేయాలని, లేని యెడల న్యాయపోరాటానికి సైతం వెనుకాడబోమని ‘ఆదాబ్ హైదరాబాద్’ హెచ్చరిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు