Saturday, July 27, 2024

ప్రజావాణి చుట్టూ ప్రదక్షిణలు

తప్పక చదవండి
  • సమస్యలు తీరక రైతుల సతమతం
  • కలెక్టర్‌ ఆదేశాలిచ్చిన నిర్లక్ష్యం వీడని తాసిల్దార్లు
  • మండల స్థాయిలో సమస్యలు తీరక ప్రజావాణికి క్యూ కడుతున్న ప్రజలు
  • సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రైతుల నుండి 262 ఫిర్యాదులు..

వికారాబాద్‌ జిల్లా; తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ లో ఉన్న కొన్ని లోపాల కారణంగా నిత్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలం లో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. మండల తహసిల్దార్‌ కార్యాలయాలలో సమస్యలు పరిష్కరించకపోవడంతో జిల్లా కలెక్టర్‌ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే పరిష్కారమవుతాయని భావించిన రైతులు అధిక సంఖ్యలో ప్రజావాణిలో ఫిర్యాదులు అందజేస్తున్నారు. అయితే ఫిర్యాదులు అందుకున్న జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు సత్వరమే సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు, తహసీల్దార్లకు ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికా రులు నిర్లక్ష్యం వీడడం లేదని రైతులు వాపోతున్నారు. తాసిల్దార్‌ కార్యాలయాలలో అధికారులను వెళ్లి అడిగితే కలెక్టర్‌ ఆఫీసుకి రిపోర్టు పంపామని చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా చెప్పేసరికి ఇచ్చిన దరఖాస్తు మళ్లీమళ్లీ ప్రజావాణిలో ఇవ్వాల్సి వస్తుందని వాపోతున్నారు.
భూ సమస్యలతో ప్రజావాణికి పోటెత్తిన రైతులు..జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రైతులు పోటెత్తారు. మొత్తం 262 ఫిర్యాదులు జిల్లా కలెక్టర్‌ స్వీకరించారు. గత వారం ఫిర్యాదులు అందజేసిన రైతులు వారి భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మళ్లీ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి రావడం గమనార్హం.ఈ సమయంలో పొలాల్లో బిజీగా ఉండే రైతన్నలు పనులు మానుకొని ప్రజావాణి కి ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.ప్రతి సోమవారం అదే తరహాలో ఫిర్యాదులు రావడం చూస్తుంటే భూ సమస్యలకు సత్వర పరిష్కారం దొరకలేదని స్పష్టంగా తెలుస్తుంది..
కలెక్టర్‌ ఆదేశాలిస్తున్న నిర్లక్ష్యం వీడని తాసిల్దార్లు….భూ సమస్యల పరిష్కారం కొరకు రైతుల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎప్పటికప్పుడు తాసిల్దారులకు ఆదేశాలు ఇస్తున్న నిర్లక్ష్యం వీడడం లేదని రైతులు వాపోతున్నారు. నిజానికి తాసిల్దార్లు ఫిర్యాదులను పరిశీలించి ఎప్పటికప్పుడు కలెక్టర్‌ కార్యాలయానికి నివేదిక సమర్పిస్తే భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కానీ నివేదిక అందజేయడంలో కాలయాపన జరుగుతుందని తాసిల్దార్‌ ల వ్యవహార శైలిపై ఆరోపణలు గుప్పుమం టున్నాయి. అన్నం పెట్టే రైతన్నల సమస్యల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు