Sunday, May 5, 2024

గుప్పెడు గుండెను కాస్త పదిలంగా ఉంచుకోండి..

తప్పక చదవండి

డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్‌నగర్‌ లోని ఎం పి షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు. హృద్రోగ నిపుణుడిగా దాదాపు 16000 శస్త్ర చికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది. అయితేనేం అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన కేవలం 41 సంవత్సరాల వయసులో సాధారణ ఈసీజీ నివేదిక ఉన్నప్పటికీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి హఠాత్సంఘటనల గురించి మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. డాక్టర్ గాంధీ గత సంవత్సర కాలంగా ఎం పి షా ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు కార్డియాలజీ బోధించడంతో పాటు ఔట్ పేషంట్ విభాగం, క్లిష్టమైన రోగులకు చికిత్సనందించేవారు. ఇది కాకుండా ఆయన జామ్‌నగర్‌లోని శారదా ఆసుపత్రిలో కూడా పనిచేస్తున్నారు.

డాక్టర్ గౌరవ్ గాంధీ మరణం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి?

- Advertisement -

సాధారణంగా ఈసీజీ రీడింగ్ ఉన్నప్పటికీ మృత్యువు ఆయనను ఎలా కబళించింది అన్న సందేహం కలగవచ్చు మనకు. దాదాపు 20-30 శాతం కేసులలో, గుండెపోటు వచ్చినప్పటికీ మొదటి ఈసీజీ రీడింగ్ సాధారణంగానే ఉంటుంది. అందుకే గుండెపోటు ప్రారంభమైన 12 నుండి 24 గంటల పాటు కొన్ని గంటల వ్యవధిలో పలు మార్లు ఈసీజీ లు, కార్డియాక్ ఎంజైమ్‌లను (గుండె నష్టాన్ని సూచించే ట్రోపోనిన్, క్రియాటినిన్ ల స్థాయిలను) పరీక్షించడం అత్యంతావశ్యకమని జామ్‌నగర్ లోని గురు గోవింద్ సింగ్ జనరల్ హాస్పిటల్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ మరియు ఎం పి షా మెడికల్ కళాశాలలో మెడిసిన్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సౌగతా ఛటర్జీ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డాక్టర్ గౌరవ్ గాంధీ జూన్ 6, 2023 న ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ సంఘటన మరోసారి భారతీయ యువతరానికి గుండెపోటుకు సంబంధించి ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సంఘటనకు ముందు ఆయనలో ఎలాంటి ప్రమాద లక్షణాలు కనిపించకపోవడం, వయసులో చిన్నవాడు కావడం, శారీరకంగా చాలా చురుకుగా ఉండడంతో పాటు రోజూ దాదాపు 14 గంటలు పనిచేసే ఆయనకు ధూమపానం లేదా మద్యపానం అలవాటు లేకపోవడం, గుండె సంబంధిత వ్యాధులను సూచించే వైద్య చరిత్ర లేక పోవడం, కోవిడ్-19 సంక్రమించిన చరిత్ర లేనప్పటికీ డా గౌరవ గాంధీ హఠాన్మరణం పొందడం ఒకింత విస్మయానికి గురిచేసింది అంటారు డా సౌగతా ఛటర్జీ. గురు గోవింద్ సింగ్ జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నందిని దేశాయ్ మాట్లాడుతూ “6వ తేదీ తెల్లవారుఝామున 2 గంటలకు ఛాతీలో అసౌకర్యంతో డా గౌరవ్ గాంధీ, శారదా ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఈసీజీ చేయించుకోగా, రీడింగ్ సాధారణంగా రావడంతో, అసిడిటీ అని భావించి అందుకు ఇంజక్షన్ తీసుకున్నాడు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉత్పన్నమవుతుందేమో అన్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఒక గంట పాటు అక్కడే గడిపి తరువాత ఇంటికి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యకరంగా ఉదయం 6 గంటల సమయంలో ఆయన బాత్రూమ్ లో కుప్పకూలి ఉండడాన్ని ఆయన భార్య గమనించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అతడిని గురు గోవింద్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి కార్డియోగ్రామ్ చేయగా గుండె చాలా బలహీనంగా కొట్టుకోవడం గమనించి దాదాపు 45 నిమిషాల పాటు కార్డియో పల్మొనరీ రెససిటేషన్ – సీపీఆర్ (ఛాతీని అరచేత్తో నొక్కడం ద్వారా గుండె సాధారణ స్థితికి చేర్చే విధానం) చేసినప్పటికీ గుండె పునరుద్ధరించబడలేదు. వైద్యపరంగా, ఇది ఆకస్మిక గుండె స్థంబన అని భావించి మేము పోస్ట్ మార్టం నిర్వహించినప్పటికీ నివేదికలో గుండె ఆకస్మిక స్థంబనకు గురయినట్లు నిర్ధారించే ఎటువంటి ఆధారాలు చూపలేదు. సాధారణంగా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలను సూచించే సమయం మరియు మరణం మధ్య వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది” అన్నారు.

సాధారణ ఈసీజీ రీడింగ్ ఉన్నా గుండెపోటు వచ్చే అవకాశం ఉందా?
సాధారణ ఈసీజీ రీడింగ్ ఉన్నప్పటికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా అంటే “అవును” అనే సమాధానం చెప్పాల్సివస్తుంది. సాధారణ ఈసీజీ రీడింగ్ లో ధమనులలో ఏర్పడిన లక్షణరహిత అడ్డంకులు బహిర్గతం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో అవి గుండెపోటుకు దారి తీయవచ్చు. సుమారు 20 నుండి 30 శాతం హృద్రోగులలో ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పటికీ మొదటి ఈసీజీ లో రీడింగ్ సాధారణంగా నమోదవుతుందని వైద్య నివేదికలలో కూడా పేర్కొనబడింది. అయితే డాక్టర్ గాంధీది మాత్రం అత్యంత విలక్షణమైన కేసు అని డా సౌగతా ఛటర్జీ అభిప్రాయపడ్డారు.

అధిక రక్తపోటు, ఒత్తిడిని తేలికగా తీసుకుంటున్నామా?
“సుదీర్ఘమైన పని గంటలు, ఒత్తిడి డాక్టర్ గాంధీని దెబ్బతీశాయా?” అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ అంశాలు ఖచ్చితంగా హానికారకాలని పేర్కొననప్పటికీ, గత కొద్ది సంవత్సరాల నుండి 25 – 30 సంవత్సరాల వయసు గల వారు కార్డియాక్ అరెస్ట్ బారిన పడుతున్న సందర్భాలు వృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు డా సౌగతా ఛటర్జీ. అంబాలా లోని మెడిట్రినా హాస్పిటల్‌ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ్ శర్మ మాట్లాడుతూ, “భారతదేశంలో సాధారణంగా 40 సంవత్సరాల నుండే అధిక రక్తపోటు ప్రారంభమవుతుండగా పాశ్చాత్య దేశాలలో ఈ పరిస్థితి 60 – 70ల సంవత్సరాల మధ్య ఏర్పడుతుంది. మన దేశ జనాభాలో 40 ఏళ్లు పైబడిన వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తే, దాదాపు 60 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అలాగే మన దేశంలో పక్షవాతం కారణంగా సంభవించే 57 శాతం మరణాలు మరియు గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి కారణంగా సంభవించే 24 శాతం మరణాలు అధిక రక్తపోటుకు వలన కావడం గమనార్హం” అని ఆయన అన్నారు.

తీవ్ర వృత్తిపరమైన పోటీ కారణంగా వృత్తి, జీవితం మధ్య సమతుల్యతను సాధించడంలో సతమతమవుతున్నారు నేటి యువతరం. అధిక సంఖ్యాకులు సుదీర్ఘ పని గంటలతో జిహ్వచాపల్యాన్ని సంతృప్తి పరిచే తక్కువ పోషక విలువలు గల ఆహారం (జంక్ ఫుడ్) కు అలవాటు పడి శారీరక వ్యాయామానికి, నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అంతే కాక నేటి యువతలో చాలా మంది ధూమపానం వ్యసనంతో అధిక రక్తపోటును కొని తెచ్చుకుంటున్నారు. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో తీవ్ర మానసిక వత్తిడికి గురవడంతో పాటు దానిని బలవంతంగా అదిమి పెట్టడం అధిక రక్తపోటుకు దారి తీస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అధిక స్థాయి ఒత్తిడి మరియు ఆదుర్దా రక్తపోటును పెంచి శరీరంలో భారీ మాత్రలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను విడుదల చేసి శక్తిని క్షీణింప చేస్తుంది. అధిక రక్తపోటును సాధారణంగా మందుల ద్వారా నియంత్రించాలి. కానీ పరిస్థితి క్షీణిస్తే, అది పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) లేదా గుండె పోటుకు కారణమై రోగి ఆసుపత్రిలో చేరవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది” అని డాక్టర్ శర్మ పేర్కొన్నారు.

సాంప్రదాయ ప్రమాద కారకాలకు మించి పరీక్షలు చేయించుకోవాలా?
దేశంలో నానాటికీ పెరుగిపోతున్న గుండె జబ్బులతో ఇప్పటికే చాలా మంది భారతీయులు తమ బిపి, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్, మరియు బ్లడ్ షుగర్‌ స్థాయిలను నిర్ధారిత సమయానుసారం పరీక్ష చేయించుకుంటున్నారు. అయితే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న హృద్రోగుల సంఖ్య నేపథ్యంలో పై పరీక్షలతో పాటు గుండె జబ్బులకు దారి తీసే ఇతర కారణాలను కూడా సత్వరంగా కనిపెట్టి వాటి నుండి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

ఎలా జాగ్రత్త పడాలి:
40 లేదా 50 సంవత్సరాల వరకు వేచి ఉండకుండా 25 సంవత్సరాల నుండే రక్తపోటును నిర్ధారిత సమయానుసారం పరీక్ష చేయించుకోవాలి. తరచూ తలనొప్పి రావడం, తక్కువ దూరం నడిచినా, సాధారణ పరిస్థితులలో కూడా ఊపిరి ఆడకపోవడం లాంటి లక్షణాలుగా రక్తపోటు ప్రారంభ దశగా గుర్తించి, వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో మందులు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పును తగ్గించడంతో పాటు బరువును నిర్దేశిత స్థాయిలో ఉండేలా సాధారణ వ్యాయామం చేయడం, వత్తిడి-రహిత జీవితం గడపడం ద్వారా రక్తపోటును 5-6 మి మి వరకు తగ్గించుకోవచ్చు. కుటుంబపరమైన హైపర్ కొలెస్టెరోలేమియా అనే జన్యుపరమైన సమస్య పరిస్థితి కారణంగా ఎల్.డీ.ఎల్. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి పిన్న వయస్కులలో గుండె జబ్బులకు దారి తీయడమే కాకుండా మరణాంతకంగా మారే ప్రమాదం ఉంది. కుటుంబంలో హృద్రోగ నేపథ్యం ఉన్నవారు తప్పనిసరిగా హైపర్ కొలెస్టెరోలేమియా పరీక్ష చేయించుకోవాలి. సాధారణంగా భారతీయులలో హెచ్.డీ.ఎల్. (మంచి) కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుచేత మొత్తం కొలెస్ట్రాల్ ను పరిగణన లోకి తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎల్.డీ.ఎల్. (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను అత్యంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఆకస్మిక గుండె స్ధంబన రక్తనాళాలలో అడ్డంకి వల్ల సంభవించదు. గుండె లయ సక్రమంగా లేని కారణంగా అది నిర్వహించాల్సిన కార్యకలాపాలు ఒక్కసారి స్థంబించిపోవడాన్ని వైద్య పరిభాషలో ఆకస్మిక గుండె స్ధంబనగా వర్ణిస్తారు. ఈ పరిస్థితిలో గుండె శరీరానికి సరిపడినంత పరిమాణంలో ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని సరఫరా చేయదు. తత్ఫలితంగా మొదటి కొన్ని నిమిషాల్లో మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడంతో రోగి సహజంగా స్పృహ కోల్పోతాడు. ఏకబిగిన ఎనిమిది నిమిషాల పాటు రక్త ప్రసరణ జరగనప్పుడు, అన్ని ప్రధాన అవయవాలు స్థంబించిపోయి మరణం సంభవిస్తుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇది చాలా మంది గుండె జబ్బు లక్షణాలు లేని వ్యక్తులలో కూడా సంభవించే అవకాశం ఉంది.

45 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు కాల్షియం పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. సీటీ స్కాన్ పరికరంతో నిర్వహించే ఈ సాధారణ పరీక్ష ద్వారా ధమనులలో ఏర్పడ్డ కాల్సిఫైడ్ ఫలకం మొత్తాన్ని గణిస్తారు. ఇది అధిక పరిమాణంలో ఉన్నప్పుడు వెంటనే కాక పోయినా భవిష్యత్తులో గుండెపోటు మరియు స్ట్రోక్‌లకు దారితీసే అవకాశం ఉంటుంది కనుక సరైన మందులు తీసుకోవడం మరియు జీవనశైలిలో మార్పులు చేపట్టడం ద్వారా అటువంటి ప్రమాదాల నుండి బయట పడవచ్చు.

  • యేచన్ చంద్ర శేఖర్
    మాజీ రాష్ట్ర కార్యదర్శి
    ది భారత్ స్కౌట్స్, గైడ్స్, తెలంగాణ
    మొబైల్: 8885050822
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు