Monday, November 4, 2024
spot_img

మాకు ఒక గూడు కల్పించండి..

తప్పక చదవండి
  • నిరసన ప్రదర్శన నిర్వహించిన ఎల్.బీ. నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ..
  • ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం తగదు : పగడాల దేవయ్య, జేఎసి వైస్ చైర్మన్..
  • నిజాలను నిగ్గు తేల్చడానికి లైవ్ డిబేట్ కు సిద్ధమా? : సవాల్ విసిరిన బాలు, ప్రధాన కార్యదర్శి..

ఒంట్లో ఓపిక నశిస్తున్నా.. రక్తం కరిగి ఆవిరైపోతున్నా.. తమ కలంలో ఇంకు ఇంకిపోనంతకాలం ప్రజల తరఫున పోరాడతాడు.. కడుపులో ఆకలి నకనక లాడుతున్నా.. కన్నీళ్లతో కడుపు నింపుకుని, పెదాలపై చిరునవ్వుతో ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకుని, అనుక్షణం సమస్యలపై పోరాటం సాగిస్తాడు.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ.. ఫోర్త్ ఎస్టేట్ గా సమాజసేవలో తమ జీవితాలను అంకితం చేస్తూ.. సేవే పరమావధిగా భావిస్తూ సాగిపోతుంటాడు.. అతడే జర్నలిస్ట్.. అక్షరాలని ఆలవాలంగా చేసుకుంటూ అందులోనే తృప్తిని వేడుకుంటాడు.. అలాంటి జర్నలిస్టులు తమకు ఒక గూడు కావాలని ఆశిస్తూ.. నిరసన తెలపడం బాధాకరమైన విషయం..

హైదరాబాద్, ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టు జెఎసి ఆధ్వర్యంలో.. ఎల్బీనగర్ శ్రీకాంతాచారి కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరోసారి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు… ఈ సందర్భంగా జేఏసీ వైస్ చైర్మన్ పగడాల దేవయ్య మాట్లాడుతూ…
ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నప్పటికి రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో జాప్యం జరుగుతుందని వాపోయారు. జర్నలిస్టులను ఇప్పటికైనా గుర్తించి వారికి ఇళ్ల స్థలాల పంపిణిలో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి బాలు మాట్లాడుతూ…ఎల్బీనగర్ నియోజకవర్గంలో వర్కింగ్ జర్నలిస్టులు , జేఏసీగా ఏర్పడి గత రెండు నెలలుగా పోరాటం చేస్తున్నామని, ఈ పోరాటంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో దేవుడు వరమిచ్చిన పూజారి కరునిస్తలేడన్న చందంగా , ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం పై అనేక అనుమానాలకు తావు ఇస్తుందని ఆవేదనను వ్యక్తం చేశారు… ఈ మధ్యకాలంలో జేఏసీ నుంచి కొంత మంది విడిపోయి జేఏసీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారని ఆ ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. వారు కూడా మా సోదరులే అని గుర్తు చేశారు. వారికి కూడా ఇళ్ల స్థలాలు కావాలని, రావాలని కోరుకుంటున్నామని అన్నారు. కొంతమంది జర్నలిస్టులు జేఏసీ మీద కుట్ర పన్ని విచ్చిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, వారికి త్వరలోనే తగిన మూల్యం వారికీ వారే చెల్లించుకోక తప్పదని అన్నారు. ఈ విషయంలో నిజాలను నిగ్గు తేల్చడానికి లైవ్ డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీరు సిద్ధంగా ఉన్నారా..? అని సవాలు విసిరారు. ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డినే కాకుండా అధికార పార్టీ నాయకులను కూడా కలిశామని, అలాగే ప్రతిపక్షాల నాయకులను కలిశామని గుర్తు చేశారు. ఈ విషయంలో ఎవరి వలన జాప్యం జరుగుతుందో తెలియదు కానీ, ఈ జాప్యాన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించి, వారి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కొనసాగించామని, లేనిపోని అబండాలేసి, వారికి వారే ముప్పు తెచ్చుకుంటున్నారని, ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు