- నిబంధనలకు నీళ్లొదులుతున్న మహిళా అధికారి..
- ఆదాయ మార్గాల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనం..
- చట్టాలు, ప్రభుత్వాలు అంటే లెక్కలేని తనంగా ప్రవర్తిసున్న దారుణం..
- ఇష్టా రీతిన బదిలీలు చేయడం, డిప్యుటేషన్ మీద పంపడం,
అదనపు బాధ్యతలు అప్పగించడం ఆమెకు అలవాటుగా మారింది..
బీబీ నగర్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు.. అదనపు బాధ్యతలు అప్పగించే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది.. జిల్లా పంచాయితీ అధికారిణి సునంద కనుసన్నలలోనే ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.. తనకి అనుకూలంగా ఉన్నవారిని, ఆదాయం బాగా వచ్చే ప్రాంతాలకు బదిలీలు చేస్తూ.. రెండుచేతులతో భారీగా అక్రమ సంపాదన కొనసాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఒక మహిళా అధికారి అయ్యుండి. అవినీతికి కేరాఫ్ గా మారడం శోచనీయం.. ఆ కథా కమామీషు ఒకసారి చూద్దాం..
హైదరాబాద్, బీబీ నగర్ మండలం లోనే సుమారు 25 మందిని నిబంధనలకు విరుద్ధంగా ఒక గ్రామపంచాయతీ నుండి మరో గ్రామ పంచాయతీకి బదిలీలు చేయడం జరిగింది.. ఇటీవలే నియమింప బడిన జూనియర్ పంచాయతి కార్యదర్శులను, సీనియర్ పంచాయతీ కార్యదర్శలను కాదని, కొండమడుగు, గూడూర్ లాంటి మేజర్ గ్రామ పంచాయతీలకు వారిని నియమించడం జరిగింది. ఉన్నతమైన స్థానంలో ఉండి జిల్లా పరిషత్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సునంద ప్రభుత్వ ఉత్తర్వులను, నిబంధనలను పాటించవలసినది పోయి.. వాటిని మరిచి స్వార్థ ప్రయోజనాల కోసం.. నియమ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలను చేపట్టడం శోచనీయం.
కాగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా, బీబీనగర్ మండల పంచాయతీ అధికారిగా ఒక పంచాయతి కార్యదర్శికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం.. జకీరుద్దీన్ అనే పంచాయతి కార్యదర్శి అక్కడ సుమారు 15 ఏళ్లుగా గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను సీనియర్ కనుక అతనికి అన్ని కంపెనీల మీద, పరిశ్రమల మీద అవగాహన ఉంటుందని, తన ద్వారా జిల్లా పంచాయతీ అధికారి ఫార్మాలిటీస్ చేసుకోవచ్చు అనే స్వార్థం, మిగతా మండలాల్లో ఎంపీఓ, పోస్టులు ఖాళీగా ఏర్పడినప్పుడు బీబీనగర్ లో మాదిరిగానే, అదే మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు అదనపు భాద్యత అప్పగించలేదు. ప్రస్తుతం, యాదగిరి గుట్టలో, రాజపేట ఎంపీఓ అదనపు భాద్యతలు. చౌటుప్పల్ లో, నారాయణపూర్ ఎంపీఓ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంతో స్పష్టంగా జిల్లా పరిషత్ అధికారి తన అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇటీవలే నిబంధనలకు విరుద్ధంగా, బదిలీలు నిషేదం ఉన్నాకూడా.. తుర్కపల్లి ఎంపిఓ ను బొమ్మల రామారానికి, బొమ్మల రామారం ఎంపీఓను తుర్కపల్లికి బదిలీలు చేసి, అధిక మొత్తంలో వారివద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం నిషేధం ఉన్నప్పటికీ అర్జెంటుగా బదిలీ చేసే అవసరం ఏమొచ్చిందని సంబంధిత డిపార్ట్ మెంట్ లో బాహాటంగానే చర్చించుకున్నట్లు తెలుస్తుంది.
నల్గొండ మండల పరిషత్ అధికారిని అకారణంగా సస్పెండ్ చేశారు.. 3 నెలల తర్వాత తిరిగి అతనిని వలిగొండలోనే నియమిస్తూ.. రామన్నపేటకు మండల పరిషత్ అధికారిగా డిప్యుటేషన్ పై కొనసాగిస్తున్నారు. రామన్నపేట మండల పరిషత్ అధికారిగా ఉన్న వ్యక్తిని, నిబంధనలకు విరుద్యంగా, జిల్లా పరిషత్ కార్యాలయమునకు డిప్యూటేషన్ పై తీసుకున్నారు.
చౌటుప్పల్ ఎంపీఓ గా విధులు నిర్వహిస్తూ, 6 నెలల సెలవుపై వెళ్ళి, తిరిగి విధులలో జాయిన్ అయిన అంజి రెడ్డికి, చౌటుప్పల్ ఎం.పీ.ఓ. గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇస్తూనే, వలిగొండ ఎం.పీ.ఓ. గా డిప్యుటేషన్ పై పంపారు. ఈ నిర్ణయం చట్టవిరుద్ధం అని తెలిసి కూడా ఉత్తర్వులు జారీ చేయడం అంటే.. తనకు ఎదురులేదని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు జాంతానై.. అలాంటివి తన డిక్షనరీ లోనే లేవనే విధంగా జిల్లా పరిషత్ అధికారి సునంద వ్యవహారం కొనసాగుతున్నది. నారాయణపూర్ మండల పరిషత్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి సునందకి సన్నిహితంగా ఉండటం తో చౌటుప్పల్ ఎం.పీ.ఓ. గా అదనపు భాద్యతలు అప్పగించారు. ఇక్కడ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ ఉండడంతో వారి అవినీతి జోరుగా కొనసాగుతుంది అనే ఉద్దేశ్యంతోనే అతనికి అదనపు బాధ్యతలు అప్పచెప్పారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సదరు జిల్లా అధికారి సునంద అక్రమ చరిత్రలోని పుటల్లో దాగివున్న మరిన్ని వాస్తవాలను ఆధారాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..
ఇదే విషయమై యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ అధికారి సునందను వివరణ కోరగా, పరిపాలనా సౌలభ్యం కొరకు బదిలీలు చేయడం జరిగిందని, తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, అన్ని కూడా కలెక్టర్ ఆదేశాల ప్రకారమే నిర్వహించడం చెప్పడం జరిగింది. దీనిపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం…