Sunday, October 13, 2024
spot_img

పైన పటారం.. లోన లొటారం..( అధికార పార్టీకి గ్రూపుల రూపంలో గండం రానుందా..! )

తప్పక చదవండి
  • నాలుగు స్తంభాలాటగా మారిన బీఆర్ఎస్‌ రాజకీయం..
  • ఎవరికీ వాళ్ళే స్వంత పార్టీ నేతలపైనే ఎత్తుకు పైఎత్తులు..
  • ఒక్కో నియోజకవర్గం నేతకు ఒక్కో బడా నేత మద్దతు..
  • నాలుగు వర్గాలుగా చీలిపోయిన నాయకులు, కార్యకర్తలు..
  • టికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరు.. తీసుకుని పోటీకి దిగే వారెవరు..?
  • అయోమయంలో అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు..

‘ వాసు ‘ పొలిటికల్ కరెస్పాండంట్

బీఆర్ఎస్‌ పార్టీలో బయటికి కనిపించేది ఒకటి.. లోపల జరిగేది మరొకటిగా కనిపిస్తోంది.. తండ్రిదో దారి.. కొంతమంది నాయకులు ఆయనను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. కొడుకుదో దారి ఆయనను నమ్ముకుని మరికొందరు నాయకులు రాజకీయం చేస్తున్నారు. మంత్రులది మరోదారి వీళ్ళని నమ్ముకుని కొందరు నాయకులు రాజకీయం చేస్తున్నారు. నిజానికి వీరిలో అభ్యర్థులుగా నిలిచేదెవ్వరు.. గెలిచేదెవ్వరు..టిక్కెట్లు ఇచ్చేదెవ్వరు .. తీసుకునే దెవ్వరు. అర్ధంకాని అయోమయ పరిస్థితి నెలకొంది. నిజానికి బీఆర్ఎస్‌ సెల్ఫ్ గోల్ కొట్టుకునే పనిలో పడింది. ఒక్కో నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ముగ్గురుకు మించి ఆశావహులు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీళ్ళని కట్టడి చేసే పరిస్థితిలో బీఆర్ఎస్‌ పార్టీ లేదు.. వారి అధినాయకత్వము లేదు.. ఎందుకంటే వాళ్ళు మరో బడా నేత మద్దత్తు దారులు.. వీళ్లంతా ఒకే కుటుంబానికే చెందినవారే కావడం మరో విశేషం..

- Advertisement -

నాలుగు స్తంభాలాటగా మారిన బీఆర్ఎస్‌ రాజకీయం :
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రాజకీయం నాలుగు స్తంభాలాటగా మారిపోయింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఎమ్మెల్యే పని తీరు బాగాలేదని స్వంతపార్టీ నేతలే పనిగట్టుకుని ప్రచారం చేయడం స్థానిక ప్రజా ప్రతినిధులకు మింగుడుపడని అంశంగా తయారయ్యింది. అధిష్టానం ఈసారి తనకే టికెట్ ఇస్తుందంటూ నేతలంతా
పనిగట్టుకుని నియిజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం, ప్రచారం మొదలుపెట్టడం, కార్యకర్తలను మోహరించడం, ఎమ్మెల్యే పరిధిలోని పనులను పనిగట్టుకుని చేయించడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అస్సలు నచ్చడం లేదట. అయితే ఈ హడావుడి చేస్తున్న నేతలంతా బడా నేతల అనుచరులు కాబట్టి వారిని ఏమనలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చేస్తున్న ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవడం అటుంచితే అసలుకే ఎసరు వచ్చేలా ఉందంటూ జిల్లా నాయకులతో ఎమ్మెల్యేలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారంట..

ఎవరికి వాళ్ళే స్వంత పార్టీ నేతలపైనే ఎత్తుకు పైఎత్తులు :
సిట్టింగ్ ఎమ్మెల్యే ఓ వైపు.. ఆశావహులంతా మరో వైపుగా నియోజకవర్గాల్లో రాజకీయాలు పెనవేసుకుంటున్నాయి. ఆశావహులంతా ఇదే అదనుగా చక్రం తిప్పుతున్నారు.. మేడ్చల్ మల్కజ్ గిరి జిల్లాకు చెందిన ఓ నాయకుడు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఒక గౌరవప్రదమైన బాధ్యతలో కూడా ఆయన కొనసాగుతున్నారు.. ఆయన తనకు ఒక గొరవప్రదమైన పదవి ఉండగానే ఎమ్మెల్యే సీటుపై కన్నేశారు. కన్నేసింది మొదలు తన నియోజకవర్గంలోని లీడర్లందరిని తనవైపు తిప్పుకునే పని మొదలు పెట్టారు. వాళ్ళకు అడిగింది లేదనకుండా ఇవ్వడమే గాక పనిగట్టుకుని వాళ్ళను వాళ్ళ కుటుంబసభ్యులతో కలిసి టూర్లకు కూడా పంపుతున్నారట. ఒక నాయకుడయితే తిరుపతికి, మరో నాయకుడు కాశీకి.. ఇలా చెప్పుకుంటూ పొతే నాయకులు స్థానిక నేతల ఇష్టాలను కోరికలని తీర్చేపనిలో పడ్డారట .. ఇవ్వన్నీ చూస్తూ ఎలా భరించాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అర్ధం కావడం లేదట..

ఒక్కో నియోజకవర్గం నేతకు ఒక్కో బడా నేత మద్దత్తు :
ఒక నేత సీఎం కేసీఆర్ వర్గమని .. కేటీఆర్ మనిషినని చెప్పుకుని తీరుతుంటే.. మరోనేత హరీష్ రావు మనిషినని చెప్పుకుని తిరుగుతున్నారు.. ఇంకో నేతయితే కవిత వర్గమని, సంతోష్ వర్గమని చెప్పుకుని నియోజకవర్గాల్లో ప్రచార రథాలు ఏర్పాటు చేసుకుని మరీ సిట్టింగులకే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వీరిని అదుపు చేసే నియంత్రణ, వ్యవస్థ లేకపోవడంతో నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ నాలుగు వర్గాలుగా చీలిపోయింది.

టికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరు..? తీసుకుని పోటీకి దిగే వాళ్లెవరు..?
నిజానికి బీఆర్ఎస్‌ ఆశావహుల్లో పార్టీ ఎవరికీ టికెట్ ఇస్తుందన్న ప్రశ్నకు ఇప్పటికిప్పుడు సమాధానం దొరకకపోయినా.. భవిష్యత్తులో లక్షలు ఖర్చు పెట్టిన నాయకులు ఊరకే కూర్చుంటారా..? లేక రెబల్స్ గా మారుతారా.. అన్నది తేలాల్సి వుంది. స్వంత పార్టీ నేతలను, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్యెల్యేలను టార్గెట్ చేస్తూ ఆశావాహులు చేస్తున్న హడావుడి అసలుకే ఎసరు పెట్టేలా ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట.. ఇప్పటికయినా అధికార పార్టీ నాయకులు ఈ తంతుకు పులిస్టాప్ పెడతారా.. లేక కామాతో సరిపెడతారా..? అన్నది వేచి చూడాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు