- గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
- నిర్వాహాకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- 23 మంది బిచ్చగాళ్లను రెస్క్యూ హోంలకు తరలింపు..
జీవితంలో ఏపనీ చేయలేని దుస్థిలో ఉన్న వారు అడుక్కుంటూ కాలం గడపడం చూస్తున్నాం.. అలాగే అంగవైకల్యం కలిగినవారు, ఆనాధలు అడుక్కుని జీవనం గడుపుతుంటారు.. పుణ్యతిథులు సమర్పించే పదో పరకో తీసుకుని కాలం వెలిబుచ్చుతుంటారు.. ఇది సహజం.. కానీ బెగ్గింగ్ ను కూడా ఒక వ్యాపారంగా మార్చుకుని మాఫియా స్థాయికి తీసుకెళ్తున్నారు కొందరు దుర్మార్గులు.. ఏ ఆసరా లేని అభాగ్యులను హైజాక్ చేసి బెగ్గింగ్ ప్రక్రియలోకి దించుతున్నారు.. కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు.. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఓ బెగ్గింగ్ మాఫియా గుట్టును రట్టు చేశారు పోలీసులు. వృద్ధులను తీసుకొచ్చి వారితో భిక్షటన చేయిస్తు డబ్బులు సంపాదిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఈ విషయం వెలుగు చూసింది.
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భిక్షమెత్తుతున్న 23 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బెగ్గింగ్ మాఫియా గుట్టు బయటపడింది. వీరంతా సిగ్నళ్ల దగ్గర భిక్షాటన చేస్తున్నారని.. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరికొద్ది రోజులపాటు ఈ డ్రైవ్‌ను కొనసాగిస్తామన్నారు. అదుపులోకి తీసుకున్న బిచ్చగాళ్లను రెస్క్యూ హోంకు తరలించారు పోలీసులు.. బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్‌ను అరెస్ట్ చేశారు. అతడు వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో భిక్షాటన చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు వృద్ధులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.200 చొప్పున ఇచ్చి భిక్షాటన చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనిల్ పవార్‌పై ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌ను బెగ్గర్ ఫ్రీ సిటీగా చేయాలని గతంలోనే ప్రభుత్వం భావించింది. నగరంలోని రోడ్లపై బిచ్చం ఎత్తుకునే 9 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. యాచించకుండా జీవించడం కోసం కొందరికి వృత్తి విద్యల్లోనూ శిక్షణ ఇచ్చింది. కానీ చెడు అలవాట్లు, ఇతర కారణాలతో పునరావాస కేంద్రాల్లో ఉండేందుకు కొందరు యాచకులు ఇష్టపడటం లేదు. దీంతో అక్కడి నుంచి బయటకొస్తున్న వాళ్లు మళ్లీ రోడ్ల మీదకు వచ్చి భిక్షాటన చేస్తున్నారు. దీనికి బెగ్గింగ్ మాఫియా తోడు కావడంతో ఈ సమస్య మరింత జఠిలం అవుతోంది.