- మోకిల రెండో ఫేజ్ భూవేలానికి నోటిఫేకేషన్..
- 300 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించనున్న హెచ్ఎండీఏ..
- అందుబాటులో 300 నుంచి 500 గజాల ప్లాట్లు..
హైదరాబాద్ : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూంని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే నగర శివార్లలో డిమాండ్ ఉన్న భూములను వేలంలో పెట్టి.. వేల కోట్లు ఖాజానాలో వేసుకుంది. ఇందులో భాగంగా.. కోకాపేట భూములు ఒక్క ఎకారానికి వంద కోట్లు కురిపించి.. దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న భూములు జాబితాలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ తర్వాత అదే ఊపులో శంకర్ పల్లి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మోకిల లేఅవుట్‌లోని భూములను కూడా హెచ్ఎండీఏ ఈ వేలం నిర్వహించింది. ఆగస్టు 8వ తేదీని నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోగా.. ఒక్కో గజం అత్యధికంగా లక్ష రూపాయలు పలకటం గమనార్హం. మొన్న మొత్తం 50 ప్లాట్లు అమ్మగా… ఇప్పుడు అదే మోకిలా లేఅవుట్‌లోని మరో 300 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. మోకిలా ఫేజ్-2 భూముల వేలానికి హెచ్ఎండీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. 300 ప్లాట్లలో 98,975 గజాలను హెచ్ఎండీఏ అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం మోకిల లే ఔట్‌లో 300 నుంచి 500 గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. వేలంలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులకు ఆగస్టు 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ. 1,180 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాదు.. లక్ష రూపాయలు కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాగా.. ఈ ప్లాట్లతో గజానికి రూ. 25 వేలుగా కనీస ధర నిర్ణయించింది హెచ్ఎండీఏ. గతంలో కూడా గజానికి 25 వేలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి 98,975 గజాల అమ్మకంతో రూ. 800 కోట్లు వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది.
నార్సింగి- శంకర్‌పల్లి రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకిలలో 165 ఎకరాల్లో 1321 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ను సిద్ధం చేసింది. ఇందులో ఒక్కో ప్లాట్ 300- 500 చదరపు గజాల్లోపు ఉంది. అయితే.. ఫస్ట్ ఫేజ్‌లో 15,800 చదరపు గజాల్లోని 50 ప్లాట్లను విక్రయించింది. గజానికి రూ.25 వేలు నిర్ణయించగా.. కొన్ని ప్లాట్లు మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడవటం విశేషం. మొత్తం 50 ప్లాట్లకు గానూ రూ.40 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేయగా.. అంతకు మూడు రెట్లు అంటే రూ.121.40 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పుడు రెండో విడతలో మరో 300 ప్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే.. భవిష్యత్ అంతా ఔటర్ చుట్టూ కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉండటం.. ట్రాఫిక్ బెడద నుంచి ప్రశాంతత కోసం నగరానికి కాస్త దూరంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి ఇది బెస్ట్ ప్లేస్ అని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు.. కోకాపేట నియో పోలిస్‌కు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు చాలా దగ్గరగా ఉండటంతో.. వెస్ట్ సిటీ హబ్‌గా మోకిల అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్లాట్లకు మాంచి డిమాండ్ ఏర్పడింది. మరోవైపు.. మోకిల లేఅవుట్ పక్కనే ఇప్పుడు 100 ఫీట్ శంకర్‌పల్లి రోడ్ కూడా ఉంది. లే అవుట్‌లోనే రోడ్లు, అండర్ డ్రైనేజీ, తాగునీరు, కరెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. లేఅవుట్ నుంచి 20 నిమిషాల్లో కోకాపేట్ నియోపొలిస్, గండిపేట పార్క్, సీబీఐటీ వంటి చోట్లకు వెళ్లొచ్చు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలన్నా, నగరం లోపలికి వెళ్లాలన్నా.. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గర్లోనే ఉండటం సానుకూలాంశం అని అధికారులు చెబుతున్నారు.