- ఇకపై వీఐపీ వాహనాలపై నో సైరన్స్..
- సంగీత వాయిద్యాల శబ్దాలు వచ్చేలా చర్యలు..
- వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ..
న్యూ ఢిల్లీ : వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మరో అడుగు ముందుకు వేశారు. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో వీఐపీ వాహనాలపై సైరన్‌లకు స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

వాయు కాలుష్యాన్ని అదుపు చేయడం చాలా కీలకమని, ఇందులో భాగంగా వీఐపీ వాహనాలపై ఉండే సైరన్లకు స్వస్తి చెప్పేందుకు కొత్త విధివిధినాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. సైరన్ మోతను వినసొంపుగా ఉండేలా మార్పులు తీసుకు వస్తున్నామని తెలిపారు. సైరన్ స్థానంలో భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, శంఖం వంటి సంగీత వాయిద్యాల ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఆశిస్తున్నామన్నారు నితిన్ గడ్కరి. పుణెలోని చౌందినీచౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈ విషయం వెల్లడించారు.