Saturday, July 27, 2024

“ఘర్ వాపసి “తో స్వధర్మంలోకి ఆహ్వానం

తప్పక చదవండి
  • వి.హెచ్.పీ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి

హైదరాబాద్ : మతం మారిన హిందువులందరినీ స్వధర్మం లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నారు. సృష్టిలో హిందుత్వం అతి పురాతనమైనదని.. అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. శనివారం భాగ్యనగరం లోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సురేందర్ రెడ్డి మాట్లాడారు. రకరకాల ప్రలోభాలు.. అనేక కారణాలు.. మాయ మాటలు.. రాజకీయ ఒత్తిళ్ల వల్ల హిందూ ధర్మం నుంచి ఇతర మతాలను ఆశ్రయించిన హిందువులందరినీ “ఘర్ వాపసి “ద్వారా హిందూ ధర్మం లోకి తీసుకువస్తామన్నారు. వైద్యం, పేదరికం తోపాటు హిందువుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని క్రైస్తవులు, ముస్లింలు మతమార్పిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ పుట్టుకతో హిందువులేనని.. గతంలో పరిపాలించిన మొగలాయిలు క్రైస్తవుల ఒత్తిడి తట్టుకోలేక చాలామంది మతమార్పిడి కి గురయ్యారని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే అంశాన్ని కేంద్ర మాజీ మంత్రి గులాం నబి ఆజాద్ కూడా ఇటీవలే వెల్లడించడం శుభ పరిణామమని కొనియాడారు. 600 సంవత్సరాల క్రితం కాశ్మీరు ప్రాంతం హిందూత్వంతో విరాజిల్లిందని.. మొగలాయిల పాలన కారణంగా ఆ ప్రాంతమంతా మతమార్పిడికి గురై ఇస్లాం స్వీకరించారన్నారు. 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవం పుట్టిందని.. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం ఆవిర్భవించిందని.. లక్షల సంవత్సరాల క్రితమే ఈ సృష్టిలో హిందుత్వం వెలుగొందిందనే వాస్తవం ఆజాద్ వివరించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. “ప్రాచీన భారతీయ చరిత్ర- మతాల ప్రభావం” పరిశీలించినట్లయితే ఈ దేశంలో మతమార్పిడి ఏ విధంగా జరిగిందో తెలుసుకోవచ్చని సురేందర్ రెడ్డి వివరించారు. ఈ దేశంపై దండెత్తి వచ్చిన ఆంగ్లేయులు, ముస్లిం రాజుల కారణంగా ఇక్కడి ధర్మంపై దాడి జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మం కాపాడేందుకు కోసం ఎంతోమంది హిందూ వీరులు ప్రాణతాగం చేశారని గుర్తు చేశారు. నయానో భయానో ఈ దేశంలో మత మార్పిడి జరిగిన ఆనవాళ్లు సాక్షాలతో సహా మనం పరిశీలించవచ్చని చెప్పారు.
ఓటు బ్యాంకు రాజకీయాలతో మతమార్పిడికి వత్తాసు..!
నేటికీ రాజకీయ కారణాల వల్ల మత మార్పిడి వ్యవస్థను ప్రోత్సహిస్తూనే ఉన్నారని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దేశంలో హిందుత్వం పై దాడి జరుగుతోందని.. పలు సందర్భాలలో బాధితులు హిందువులైనప్పటికీ శిక్ష కూడా హిందువులకే పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్యాంగ విరుద్ధంగా మతమార్పిడి సాగుతుందన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి ఇమామ్లకు, పాస్టర్లకు జీతాలు ఇస్తూ మతమార్పిడి ని పెంచి పోషించడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ప్రతి హిందువు ఏకమై ఈ ధర్మాన్ని కాపాడే విషయంలో సంకల్పం తీసుకోవాలని వారు సూచించారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి గుమ్మల్ల సత్యం, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ప్రాంత సంఘటన కార్యదర్శి యాది రెడ్డి, రాష్ట్ర సహకార దర్శి రాజేశ్వర్ రెడ్డి, ధర్మ ప్రసార్ రాష్ట్ర కన్వీనర్ వెంకటేశ్వర జాదవ్, ధర్మ ప్రసార్ రాష్ట్ర కో కన్వీనర్ సుభాష్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు