- ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లడుగుతరు
- చీదరించుకుంటున్న వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు
వికారాబాద్ : నియోజక వర్గంలోనీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను తీర్చే విధంగా కృషి చేసేందుకు ప్రజలంతా కలిసి ప్రజా ప్రతిని ఎన్నుకోవడం జరుగుతుంది. మంచి చేస్తాడని భావించి గెలిపించాక ప్రజా సమస్యలు తీర్చకపోతే ఎన్నుకున్న నాయకుడిని ప్రజలు చీదరించుకుంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గంలో నెలకొంది. వికారాబాద్ నియోజకవర్గంలోని దారులు మండలం దోర్నాల బ్రిడ్జి ఏళ్లు గడుస్తున్న నిర్మాణానికి నోచుకోక ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలం వస్తే నరకయాతన అనుభవిస్తున్నారు.పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు,ప్రజా ప్రతినిధుల తీరుపై ప్రజలు మండి పడుతున్నారు. గత ఏడాది క్రితం స్థానిక మండల నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలికారు. కానీ అవి చేతల్లో కనిపించలేదు. ఇకపోతే వికారాబాద్ నుండి బార్వాద్ వెళ్లే రోడ్డు మార్గం, కోటిపల్లి నుండి తుర్మామిడి వెళ్లే రోడ్డు మార్గాలు అస్తవ్యస్తంగా మారి ప్రజల పాలిట శాపంగా మారాయి. ఇక వికారాబాద్ జిల్లా కేంద్రం విషయానికొస్తే వంకర టింకర రైల్వే బ్రిడ్జితో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ ఇప్పటివరకు బ్రిడ్జి మరమ్మత్తులకు నోచుకోని దుస్థితి నెలకొనగా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని స్థానిక పాలకులు ప్రకటనలు ఇచ్చినప్పటికీ చేతల్లో మాత్రం కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక వికారాబాద్ పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోగా టిఆర్‌ఎస్ గ్రూపు రాజకీయాలతో వికారాబాద్ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ సక్కగ లేక నిత్యం పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పేదలకు పంపిణీ చేస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఆగమ్య గోచరంగా మారింది.నాలుగున్నర ఏళ్ల కాలం గడిచిపోయింది కానీ ప్రధాన సమస్యలకు పరిష్కారం దొరకలేదని అధికార బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ నోటితో బుద్ధి చెప్పేందుకు ఓటరు మహాశయులు సన్నద్ధమయ్యారు.