Saturday, June 15, 2024

వరుణ బీభత్సం

తప్పక చదవండి
  • హిమాచల్‌లో 30 మంది మృత్యువాత
  • వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు
  • విరిగిపడుతున్న కొండచరియలు
  • 3వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా

సిమ్లా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. మృతి చెందిన 30 మందిలో ఇప్పటి వరకు 29 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు భారీ వర్షం కారణంగా సంభవించిన వరదలకు సుమారు రూ.3,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో చందర్తాల్‌, పాగల్‌ నల్లా, లాహౌల్‌, స్పితి సహా పలు ప్రాంతాల్లో సుమారు 500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఇక ఉనా జిల్లాలోని మురికివాడను వరదలు ముంచెత్తాయి. అందులో చిక్కుకుపోయిన 515 మంది కార్మికులను నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సురక్షితంగా రక్షించారు. మరోవైపు రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖ్‌ ప్రజలకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌, నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వరదల కారణంగా చిక్కుకుపోయిన పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని.. ప్రతి జిల్లాలోనూ మంత్రులు ఉంటూ అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సమాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ’రాష్ట్రంలో ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాలు వంటి కారణాల వల్ల 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా ప్రాణనష్టం అంత ఎక్కువగా లేదు. ప్రధాన రహదారులు, లింక్‌ రోడ్లతో సహా 1,300 రోడ్లు దెబ్బతిన్నాయి. రాబోయే రెండు రోజులు అలర్ట్‌గా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్‌ సింగ్‌ నేగి అన్నారు.హిమాచల్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని సోలన్‌ జిల్లాలో ఉన్న టూరిస్టు కేంద్రం పార్వానులో వరద నీరు ముంచెత్తింది. ఎత్తు ప్రదేశాల నుంచి మట్టి బురుద కొట్టుకువస్తోంది. అయితే ఆ బురద ధాటికి రోడ్డుపై పార్కింగ్‌ చేసిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. బిల్డింగ్‌ల మధ్య నుంచి ప్రవహిస్తున్న ఆ బురదలో.. కార్లు, చిన్నపాటి ట్రక్కులు కొట్టుకుపోయాయి. బిల్డింగ్‌ బాల్కనీల నుంచి అరుపులు, కేకలు పెడుతూ జనం బిక్కబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వద్ద ఉన్న మొబైల్స్‌తో ఆ వరద ప్రవాహాన్ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా తీసిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాల వల్ల అక్కడ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. భీకరమైన వరదల వల్ల టూరిస్టు ప్రాంతాలన్నీ అయోమయంగా తయారయ్యాయి. ఆ రాష్ట్రంలోని టూరిస్టు కేంద్రాలు అయిన కులు, మనాలీలో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. అక్కడ స్టూడెంట్స్‌ చిక్కుకున్నట్లు తమకు సమాచారం అందినట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు