Thursday, May 2, 2024

వరద గుప్పిట్లో ఉత్తరాది

తప్పక చదవండి
  • వర్షాల కారణంగా 22 మంది మృతి
  • భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం
  • హిమాచల్‌లో పొంగి ప్రవహిస్తున్న బియాస్‌ నది
  • మనాలిలో వరద భీభత్సంతో పర్యాటకుల ఆందోళన
  • డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నిలిచిపోతున్న నీరు
  • అసాధారణ వర్షాలను తట్టుకునే పరిస్థితి లేదు
  • ప్రజల విమర్శలపై సీఎం కేజ్రీవాల్‌ సమాధానం

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడు తున్నాయి. యమున సహా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో వరద పోటెత్తి పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకశ్మీర్‌ లో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. యూపీ, ఢిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఐదు మరణాలు నమోదయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా గత రెండు రోజులుగా హిమాచల్‌ ప్రదేశ్‌ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కురిసిన వర్షానికి బియాస్‌ నది సహా అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ నీరంతా గ్రామాల్లోకి చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరద ఉద్ధృతికి దుకాణాలు, కార్లు కొట్టుకుపోయాయి. బియాస్‌ నది ఉగ్రరూపం దాల్చడంతో మరో టూరిస్ట్‌ స్పాట్‌ కులూలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మండీ జిల్లాలోనూ పరిస్థితులు బాగోలేవు. అక్కడ వరద ఉద్ధృతికి ఓ ఉక్కు వంతెన కొట్టుకు పోయింది. హిమాచల్‌ ప్రదేశ్‌ లోని 10 జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో 700 రహదారులను మూసివేశారు. మరోవైపు చండీగఢ్‌, హరియాణా రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చండీగఢ్‌ లో ఇప్పటి వరకు 322.2 మి.మీ, హరియాణాలోని అంబాలాలో 224.1 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ హిమాలయ ప్రాంతం, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక పశ్చిమ భారతదేశం, కొంకణ్‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ లోని ఘాట్‌ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది.’రాబోయే ఐదు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయి. జులై 10న జార్ఖండ్‌, జులై 12 మధ్య బీహార్‌ లోని అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తాయి’ అని ఐఎండీ తెలిపింది. మరోవైపు మధ్యప్రదేశ్‌ లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదేవిధంగా దక్షిణ భారతదేశం కోస్తా కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఢిల్లీలోపాటు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు నగరంలో యమునా నదికి వరద పోటెత్తింది. నదిలో వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. అయితే హస్తినకు మరో ముప్పు పొంచిఉన్నది. రెండు రోజుల్లో ఢిల్లీని భారీ వరద తాకనుంది. ఇప్పటికే రాజధానిలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయాయి. వీటికి ఎగువ రాష్ట్రం నుంచి వచ్చే వరద తోడవనుంది. కాగా, దేశ రాజధానిలో 41 ఏండ్ల గరిష్టస్ధాయిలో వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఒకేరోజు 153ఎంఎం వర్షపాతం నమోదవడంతో 1982 తర్వాత ఈ స్ధాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగంపేర్కొంది. ఈ వర్షాకాలం సీజన్‌లో ఢిల్లీలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ఢిల్లీ వాసులు అప్రమ్తతంగా ఉండాలని ఐఎండీ యల్లో అలర్ట్‌ జారీ చేసింది.
ప్రజల విమర్శలపై సీఎం కేజ్రీవాల్‌ సమాధానం
రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధానిలో జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయమై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర డ్రైనేజ్‌ వ్యవస్ధపై ఢిల్లీ వాసులు నిలదీస్తుండటంతో సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పందించారు. అసాధారణ వర్షాలను తట్టుకునేలా ఢిల్లీలో వ్యవస్ధల డిజైన్‌ లేదని వ్యాఖ్యానించారు. కుండపోతతో ప్రధాన రహదారులు, విద్యా సంస్ధలు, వాణిజ్య సంస్ధలు నీట మునగడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్ధితి. ఇది ఒకరిపై ఒకరు నిందలు మోపుకునే సమయం కాదని, ప్రజలకు ఉపశమనం కలిగించేలా వరద ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని వరద పరిస్ధితిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం కేజీవ్రాల్‌ పేర్కొన్నారు.
గత రెండు రోజులుగా ఢిల్లీలో 153ఎంఎం వర్షపాతం నమోదైందని చెబుతూ యమునా నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తుం డటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. యమునా నదికి వరద నీరు ఇంతకు మించి పెద్దగా రాదని, వరద ప్రవాహం పెరిగితే లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఢిల్లీలో వర్షాలకు హర్యానాలో కురుస్తున్న వర్షాలు కూడా రాజధాని నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హర్యానా నుంచి యుమునా నదిలోకి నీటిని వదులుతుండటంతో ఢిల్లీలోకి భారీగా వరద వస్తోంది. హర్యానా నుంచి వస్తున్న వరదలతో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఢిల్లీలో తర్వలోనే యమునా నది నీటిమట్టం 206 మీటర్ల స్థాయికి పెరుగుతుందని ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. అందుకే పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందన్నారు. యమునా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు