Monday, April 29, 2024

యూ.ఎల్.సి. భూములకు రెక్కలొచ్చాయ్..

తప్పక చదవండి
  • నిద్ర మత్తులో జోగుతున్న హెచ్.ఎం.డీ.ఏ. అధికారులు… 
  • అక్రమాల చక్రం తిప్పుతున్న రెవెన్యూ శాఖ… 
  • మాకేం సంబంధం లేదు బాదాప్తా చెబుతున్న కమిషనర్.. 
  • కాసులిస్తే స్మశానలు కూడా  రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్న సబ్ రిజిస్ట్రార్..

పైసామే పరమాత్మ అన్నది నానుడి.. నోట్ల కట్టలు కొట్టండి మీకు నచ్చిన స్థలాన్ని కబ్జా చేసెయ్యండి.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగుతున్న తంతు.. అవినీతి అధికారులు కాసులకు కక్కుర్తి పడుతుండటంతో కబ్జా పర్వాలు నిరాటంకంగా సాగుతున్నాయి.. వీటికి అడ్డుకట్ట వేసే నాధుడు లేకపోవడంతో.. కబ్జా కోరులు తమ పనులు ధైర్యంగా కొనసాగిస్తున్నారు.. స్థానిక రాజకీయ రాబందులు, అవినీతి ముసుగు కప్పుకున్న కొందరు అధికారులు తమవంతుగా కబ్జాదారులకు సహరిస్తుండటం ఆందోళనకరంగా పరిణమించింది..

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నంపూర్ గ్రామ సర్వేనెంబర్ 141/బి, 143/బి, 144/బి లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి.. యూ.ఎల్.సి. భూమిని అడ్డగోలుగా మింగుతున్నారు కబ్జా తిమింగలాలు.. ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన అధికారులు కబ్జాదారులకు మద్దతు తెలుపుతున్నారు. మణికొండ మున్సిపల్ లో కమిషనర్ లేనట్టేనా..? ఉంటే ఈ అక్రమాలకు కల్లెం వేయలేక విఫలం అవుతున్నారా అన్నది ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. 2053 గజాల స్థలం యథేచ్ఛగా కొల్లగొడుతున్న నోరు వెళ్ళబెట్టి చూస్తున్న అధికారులని ఎలా అర్ధం చేసుకోవాలి.. ఇక్కడ ఎలాంటి సంబంధం లేని శేరిలింగంపల్లి ఎస్.ఆర్.ఓ. డాక్యుమెంట్ నెంబర్ ఎలా వచ్చిందో అర్ధం కాదు.. యూ.ఎల్.సి. స్థలాన్ని మాయం చేస్తున్నా.. మణికొండ మున్సిపాలిటీలో అధికారులు, రెవెన్యూ అధికారులు తమ కళ్ళకు గంతలు కట్టినట్లు ప్రవర్తిస్తుండటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మణికొండ మున్సిపాలిటీ శర వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం.. ఇలాటి ప్రాంతాల్లో అవినీతి అధికారులు ఉంటే.. స్మశానాలు కూడా కబ్జాకు గురి అవుతాయేమోనని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.  నెక్నంపూర్ విలేజ్ సర్వేనెంబర్ 141/బి, 143 /బి, 144 /బి లో అసలు ఏం  జరుగుతోంది..? యూ.ఎల్.సి. నుంచి గత 9 సంవత్సరాలుగా ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వలేదని రంగారెడ్డి జిల్లా పట్టణ భూగరిష్ఠ పరిమితి ఎమ్మార్వో వెంకట్ రెడ్డి తెలిపారు. అయినా రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందని, ఎలా నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తున్నారని,  ఇంత అవినీతి జరుగుతున్న ఉన్నత స్థాయి అధికారులకు చలనం ఎందుకు కలగడం లేదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి..  హెచ్.ఎమ్.డి.ఏ. పర్మిషన్ ఉంది అంటే చాలు అమాయక ప్రజలు ఎగిరి గంతేసి ప్లాట్లు కొనుగోలు చేస్తారు.  అలాంటిది హెచ్.ఎమ్.డి.ఏ. అధికారులు కూడా ఈ విధంగా అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేయడం దేనికి సంకేతం అని స్థానికులు ఆవేశానికి లోనవుతున్నారు. మణికొండలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ చుట్టు ప్రక్కల ఐటి కంపెనీలలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సొంతింటి కల కోసం అనేక విధాలుగా కష్టపడి పనిచేస్తున్న వారి జీతంలో కొంత డబ్బులు సమకూర్చుకొని లోన్ తీసుకుని నెలవారీ జీతాలు దారపోస్తుంటే..  దాన్ని క్యాష్ చేసుకొని కొందరు నకిలీ యూ.ఎల్. సి. సృష్టించి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల నుంచి ప్రజలను కాపాడవలసిన అధికారులు కాసుల మత్తులో మునిగిపోయారని స్థానిక ప్రజలు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

యూ.ఎల్.సి.. భూములు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే.. దానికి కొందరు ప్రభుత్వ అధికారులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం సహకరిస్తుంటే.. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు కనుమరుగై.. ముందు తరాల వారికి చీకటి మిగులుతుంది.. ప్రజా ప్రయోజనాలకోసం కనీసం ఒక్క గుంట భూమి కూడా దొరకని దుర్భర పరిస్థితులు నెలకొంటాయి.. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కలుగజేసుకుని కబ్జాల పర్వానికి అడ్డుకట్ట వేయాలని.. అవినీతి అధికారులపై, కబ్జాకోరులపై కఠిన చర్యలు తీసుకుని.. ప్రభుత్వ భూములను రక్షించేందుకు కార్యాచరణ రూపొందించాలని పలువురు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు