Tuesday, September 10, 2024
spot_img

రామ సముద్రం కుంట రాం రాం..

తప్పక చదవండి
  • కుంట మనుగడను ప్రశ్నార్థకం చేసిన వర్టెక్స్ విరాట్…
  • వర్టెక్స్ వర్మ కన్ను పడితే కుంటలు, చెరువులు ఖతం…
  • ప్రభుత్వ పెద్దల సహకారంతోనే రెచ్చిపోతున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థ…
  • స్థానిక కార్పొరేటర్ కనుసన్నాల్లోనే కబ్జాయత్నం కొనసాగుతుందా?
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంటలు చెరువులను సైతం వదలని కబ్జాదారులు
  • స్థానిక రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల సంపూర్ణ సహకారంతోనే
    రామసముద్రం కుంటకు ఎసరు…
  • ప్రభుత్వంలోని కీలక మంత్రి వర్టెక్స్ లో వాటాదారుడంటూ ప్రచారం…
  • మంత్రి అండ ఉంటే కుంటను మాయం చేయొచ్చా?
  • ఈ ప్రభుత్వంలో ప్రజల ఆస్తుల పరిరక్షణకు అధికారులు పనిచేస్తున్నారా?
  • కలెక్టర్ సారూ… జరా దేఖో సారూ..

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. కబ్జాకు సై అంటున్నారు కబ్జాకోరులు.. అది ప్రభుత్వ స్థలమైన, కుంటలు, చెరువులైనా.. డోంట్ కేర్… అది తమ గుప్పిట్లో ఉండాల్సిందే… అమ్ముకొని సొమ్ము చేసుకోవాల్సిందే… అందుకు వారు పక్కా ప్రణాళికతో ముందే సంబంధిత అధికారులను రాజకీయ, ధన బలంతో తమ వైపుకు తిప్పేసుకుంటారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు, రాష్ట్రంలోని కీలక మంత్రుల పేర్లు సైతం వాడుకుంటూ వారు తమ వ్యాపారంలో వాటాదారులంటూ బహిరంగంగానే చెప్పుకుంటూ కబ్జా తతంగాన్ని నిరాటంకంగా నడిపించేస్తారు.. ఇతర స్థలం పత్రాలు చూపిస్తూ.. ఇదే తమ స్థలం అంటూ కలరింగ్ ఇస్తారు. ఇదేదో మారుమూల గ్రామంలో జరుగుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇదంతా హైదరాబాద్ మహానగరం శివారులో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మదీనాగూడలో జరుగుతుండడం విస్మయానికి గురి చేస్తోంది..

అధికార పార్టీ పెద్దల ఆశీస్సులు, రెవెన్యూ అధికారుల సహకారం ఉంటే ఎలాంటి భూమినైనా కబ్జా చేయొచ్చు అని నిరూపించారు వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ యాజమాన్యం. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం పరిధిలోని మియాపూర్ మదీనాగూడలోని రామసముద్రం కుంటను వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ తన కబంధ హస్తాల్లో బంధించి కుంట మనుగడును ప్రశ్నార్ధకం చేసింది. రామసముద్రం కుంటపై రాబందులు విరుచుకుపడ్డ విధంగా విరుచుకుపడ్డ విరాట్ నిర్మాణ సంస్థను అడ్డగించి కుంటను కాపాడే అధికారులే జిల్లాలో కరువయ్యారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.. వర్టెక్స్ వర్మ కన్ను పడితే కుంటలు, చెరువులు తన స్వరూపాన్ని కోల్పోతాయని వినికిడి. ప్రభుత్వంలోని పెద్దల సహకారంతోనే వర్టెక్స్ నిర్మాణ సంస్థ బరితెగించి కుంటను కబ్జా చేసి, నిర్మాణ పనులు చేపట్టిందని స్థానికులు విమర్శనాస్త్రాలను ఎక్కు పెడుతున్నారు. ఇవేమీ పట్టని నిర్మాణ సంస్థ యదేచ్ఛగా కబ్జాకు పాల్పడుతూ.. ప్రభుత్వంలోని కీలక మంత్రికి వర్టెక్స్ లో వాటాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తుండడం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. మరి నిజంగానే మంత్రికి నిర్మాణ సంస్థలో వాటాలు ఉన్నాయా? లేక ఆ మంత్రి పేరును అడ్డుపెట్టుకొని రామ సముద్రం కుంటను కనుమరుగు చేసే కుయుక్తులు పన్నుతున్నారా..? అనేది వారికే తెలియాలి. మంత్రి అండ ఉంటే కుంటను సైతం మాయ చేయవచ్చా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ సంస్థ మంత్రివర్యులదంటూ అధికారులని స్థానిక ప్రజలను మభ్యపెడుతూ.. పని కానిస్తున్నారా అనేది కనీసం ఆ మంత్రి దృష్టి కైనా వెళ్లిందా..? అనేది ప్రశ్నార్థకమే. వర్టెక్స్ కబ్జాలో స్థానిక కార్పొరేటర్ పాత్రపై కూడా స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కనుసన్నలలోనే కబ్జా తతంగం కొనసాగుతుందని ప్రచారం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కుంటలు, చెరువులను సైతం కబ్జాదారులు వదలకపోవడం వారికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తుండడం చూస్తుంటే.. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం భవిష్యత్తుతరాల ప్రయోజనాలు నాశనం అయినా పర్వాలేదు అనే విధంగా ప్రభుత్వ యంత్రాంగం తయారయ్యిందనడానికి మదినగూడలోని రామ సముద్రం కుంట కబ్జా వ్యవహారం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రభుత్వంలో ప్రజల ఆస్తుల పరిరక్షణకు అధికారులు పనిచేస్తున్నారా? చేస్తే రామసముద్రం కుంట పరిరక్షణకు అధికారులు తీసుకున్న చర్యలు ఎక్కడ? జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన అధికారులు వర్టెక్స్ నిర్మాణ సంస్థపై చర్యలకు వెనుకడుగు వేస్తూ ఉండడం దేనికి సంకేతం? స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు వర్టెక్స్ వర్మ కాసులకు అమ్ముడుపోయారని స్థానికులు బహిరంగంగా చర్చించుకోవడం.. అందుకు అనుగుణంగానే అధికారులు వర్టెక్స్ నిర్మాణ సంస్థపై చర్యలకు వెనకడుగు వేస్తుండడం చూస్తుంటే.. బహిరంగ విమర్శలు నిజమేనని తెలుస్తుంది. వర్టెక్స్ నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి పేరుని వాడుతున్నారా..? లేక ఆ మంత్రికి నిజంగానే నిర్మాణ సంస్థలో వాటాలు ఉన్నాయా..? అనేది ఉన్నతాధికారులే తేల్చాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కబ్జా వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించి రామ సముద్రం కుంటను కాపాడి కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రామ సముద్రం కుంట కబ్జాలో నిజంగానే మంత్రి వాటాదారుడా? రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పాత్రపై మరో కథనం ద్వారా ఆదాబ్ హైదరాబాద్ మీ ముందుకు తేనుంది …..’ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు