- తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ అలోక్ అరదే..!
- కేరళ, ఒరిస్సా, మణిపూర్, బొంబాయి, గుజరాత్ హైకోర్టులకు కూడా..
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టీస్‌లు రానున్నారు. తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కొలీజియం ఇద్దరు సీజేల పేర్లను సిఫార్సు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి జస్టీస్ అలోక్ అరదేను.. ఆంధ్రప్రదేశ్‌కు జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను సర్వోన్నత న్యాయస్థానం సిఫార్సు చేసింది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరదే.. 2009లో అక్కడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొనసాగుతున్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం నిన్న సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీజేగా రాబోతున్న జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ జమ్మూకశ్మీర్‌కు చెందినవారు. 2013లో అక్కడి హైకోర్టుకు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ధీరజ్ 2022 జూన్ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్నారు. అయితే ఈఏడాది ఫిబ్రవరిలో జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకుర్‌ను సుప్రీంకోర్టు కొలిజియం మణిపూర్ హైకోర్టు సీజేగా సిఫార్సు చేసింది. కానీ అది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండటం వల్ల దాన్ని కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ జస్టీస్‌గా ఆయన పేరు సిఫార్సు చేసింది.
తెలుగు రాష్ట్రాల హైకోర్టులతోపాటు కేరళ, ఒరిస్సా, మణిపూర్, బొంబాయి, గుజరాత్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సునీతా అగర్వాల్‌ను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సుభాసిస్ తలపాత్ర అదే రాష్ట్ర హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆశిష్ జె దేశాయ్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ పేరును మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను బాంబే హైకోర్టు సీజేగా నియమించేందుకు కొలిజీయం సిపార్సు చేసింది.