Tuesday, May 7, 2024

బాలికపై అత్యాచారయత్నం.. కాపాడిన ట్రాన్స్‌జెండర్‌..

తప్పక చదవండి

ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఓ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారయత్నానికి ప్ర‌య‌త్నించారు. ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి బాలిక‌ను ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కాపాడారు. ఈ ఘటన హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ మేరకు బుధ‌వారం హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్‌ జోనల్‌ డీసీపీ సాయిశ్రీ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, మోతె మండలం, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, పెద్దఅంబర్‌పేటలో నివాసముంటున్నారు. వారి పెద్ద కుమార్తె 2021లో పదో తరగతి పూర్తి చేసింది. అనారోగ్య సమస్యల వల్ల ఆమె చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. తండ్రి అక్కడే వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు భోజనం ముగించుకుని బాలిక ఇంటి బయట ఉన్న మెట్ల కింద టాయిలెట్‌ కోసం వచ్చింది. ఇంతలోనే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి గేటు వద్ద బైక్‌ను ఆపి సెల్‌ఫోన్ చూపిస్తూ అడ్రస్ అడిగారు. అడ్ర‌స్ చెబుతుండ‌గానే ఆమెను బ‌ల‌వంతంగా బైక్‌పై ఎక్కించుకుని పారిపోయారు.

అనంత‌రం ఆమెను స్థానికంగా ఉన్న‌ నాయుడు హోటల్‌ వెనుకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. గేటుతో ఉన్న కంపౌండ్‌ వాల్‌లోకి బాలిక‌ను విసిరేశారు. అరవింద్ అనే వ్య‌క్తి బాలిక మెడపై ఉన్న చున్నీని తొలగించగా మరో యువకుడు కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. అరవింద్‌, మళ్లీ బాలిక టాప్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా బాధితురాలు తప్పించుకుని విజయవాడ జాతీయ రహదారిపైకి పరుగెత్తుకు వచ్చింది.

- Advertisement -

అక్కడ బాధితురాలిని గమనించిన ట్రాన్స్‌జెండర్‌, ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం బాధితురాలిని హయత్‌నగర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఎడమ కాలికి గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు అరవింద్‌, అజయ్‌ల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అర‌వింద్ అనే వ్య‌క్తి బాలిక ఇంటికి స‌మీపంలో ఉన్న శ్రీకృష్ణ కిరాణ దుకాణం వ‌ద్ద‌కు రెగ్యుల‌ర్‌గా వ‌చ్చేవాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు