Tuesday, May 7, 2024

అమీన్ పూర్ మున్సిపాలిటీ మాయాజాలం…

తప్పక చదవండి
  • ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ మంజూరు చేసిన అధికారులు..
  • వాణినగర్ లో వెలుగు చూసిన మున్సిపల్ అధికారుల లీలలు..
  • డబ్బులు ఇస్తే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్న వైనం…
  • అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్…
  • అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై పురపాలక శాఖ
    మంత్రి కేటీఆర్ చర్యలు చేపడతారా?

    కబ్జాదారుల కన్నుపడితే చాలు.. అవసరమైన ఆధారాలు ఇట్టే సృష్టిస్తున్నారు.. నకిలీ పత్రాలు.. దొడ్డిదారిన ఇంటి నెంబర్లను పొందుతున్నారు కొందరు కేటుగాళ్లు.. ఎలాంటి నిర్మాణం లేకుండానే ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ పొంది, మున్సిపల్ చట్టానికి సవాలు విసిరారు.. ఇదంతా ఎంతో చిత్రమైన విషయం అయినా ఇది నిజమే.. ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్ కావాలంటే.. మీరు అమీన్ పూర్ మున్సిపాలిటీకి రావాల్సిందే.. అవినీతి మత్తులో జోగుతున్న అధికారులకు కాసులు ఇస్తే చాలు తక్షణమే అసాధ్యమైన పనులు సుసాధ్యం చేసేస్తున్నారు.. ఈ మున్సిపాలిటీలో అధికారులకు డబ్బులు చెల్లిస్తే కానీ పని అంటూ ఏదీ ఉండదు.. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ పదేపదే చెబుతుండడంతో పాటు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మాణం చేశారు… అంతటితో ఆగకుండా గృహ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటి స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి సైతం డబ్బులు చెల్లించే పథకాన్ని తీసుకువచ్చారు… ఇంత గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే ఆ ప్రభుత్వంలోని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు… అమీన్ పూర్ మున్సిపాలిటీ వాణి నగర్ లో ఖాళీ స్థలంలో ఎలాంటి ఇంటి నిర్మాణం లేకుండానే నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమంగా ఇంటి నెంబర్ ని జారీ చేయడం చూస్తుంటే.. ఈ మున్సిపాలిటీలో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతుందో తెలిసిపోతుంది… పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందో లేదో కానీ.. అవినీతికి పాల్పడుతున్న అధికారులు వల్ల ప్రభుత్వం అభాసుపాలవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది..
    హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మున్సిపాలిటీ, వాణినగర్ లో ఇంటి నిర్మాణం జరగకుండానే మున్సిపల్ అధికారులు ఖాళీ జాగాకు ఇంటి నెంబర్ జారీ చేయడం ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతుందని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. ఇంటి నెంబర్ పొందాలంటే తొలుత మున్సిపల్ చట్ట ప్రకారం.. చట్టంలో చూపిన విధంగా అన్ని పత్రాలను ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని, అన్ని పత్రాలు సరిగా ఉన్న తరువాత.. సంబంధిత అధికారి ప్రాథమిక విచారణ జరిపి తదనంతరం ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని చట్టం చెబుతోంది.. నిర్మాణం జరిగిన తర్వాత ఇంటి నెంబర్ కేటాయించాలంటే అధికారులు ఇంటి అనుమతి పత్రాలు, నిర్మించిన ఇంటిని పరిశీలించాల్సి ఉంటుంది.. అనుమతులు ఇచ్చిన ప్రకారం నిర్మాణం చేశారా..? లేదా..? అని ,కోర్టు కేసులు, ప్రభుత్వ స్థలం, హై టెన్షన్ వైర్లు లేవని నిర్ధారణ అయిన తరువాతనే ఇంటి నెంబర్ కేటాయిస్తారు.. కానీ ఇవేమీ పట్టని అమీన్ పూర్ మున్సిపాలిటీ అధికారులు.. కోర్టు కేసులో ఉన్నటువంటి ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ కేటాయించడంతో స్థానికంగా మున్సిపల్ అధికారులపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. డబ్బులు ఇస్తే ఈ మున్సిపాలిటీలో అసాధ్యాన్ని సైతం అధికారులు సుసాధ్యం చేస్తున్నారనే ప్రచారానికి.. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ మంజూరు చేసిన వ్యవహారం బలం చేకూరుస్తుంది. అమీన్ పూర్ లో ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగానే అధికారులు అవినీతికి పాల్పడుతుండడం, మున్సిపల్ చట్టాలను సైతం పక్కన పెట్టి డబ్బులు ఇస్తే ఎలాంటి పనైనా నిస్సిగ్గుగా చేస్తుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీ స్థలాలకు మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు మంజూరు చేశారు..? అనే విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, వాస్తవాలను బహిర్గతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.. అక్రమంగా దొడ్డి దారిన ఇంటి నెంబర్లను మంజూరు చేసి నకిలీ పత్రాలను ఒరిజినల్ గా చిత్రీకరిస్తున్న.. అవినీతి అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.. ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శాఖలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుండడం శోచనీయం..అమీన్ పూర్ మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడుతున్న అవినీతి అధికారులపై మంత్రి కేటీఆర్ చర్యలు చేపడతారా..? అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధ్యమేనా అని ప్రతిపక్ష నాయకులు, ప్రజలు ప్రశ్నిస్తుండడం చూస్తుంటే ఈ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుందని స్పష్టమవుతుంది..అవినీతిని అరికట్టడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాల విమర్శలకు ఇలాంటి ఘటనలు నిదర్శంగా నిలుస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అమీన్ పూర్ మున్సిపాలిటీలో ఎన్ని కాలనీలలో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించారు..? ఈ అక్రమ వ్యవహారం వెనక ఉన్న అధికారులు ఎవరు..? ఇలాంటి వ్యవహారంలో ఎంత డబ్బులు చేతులు మారుతున్నాయి..? అన్న అంశాలకు సంబంధించి మరో కథనం ద్వారా వాస్తవాలను మీ ముందుకు తేనుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘….’ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘…
    కాగా ఇదే విషయంపై అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ కు వివరణ కొరకు ఫోన్ చేయగా స్పందించలేదు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు