Monday, April 15, 2024

పాటల పల్లవి ఆగిపోయింది..

తప్పక చదవండి

పాటల పల్లవి ఆగిపోయింది
మాటల గొంతుక మూగబోయింది
సరాగాల వీణ తంత్రీ తెగిపోయింది
గజ్జె కట్టి దరువు వేసే గొంగడి
పదాలను పేర్చి పాటను కూర్చే గుండె
నేడు శాశ్వత సెలవును తీసుకుంది

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ
కోట్ల హృదయాలను కొల్లగొట్టిన సాయిచంద్
భువి నుండి దివికి పాటల కచేరి చేయడానికి
కదిలిపోయాడు
ఇంద్రలోకంలో మాటల అమృతాన్ని పంచడానికి పయనమై పోయాడు
తెలంగాణ సమరంలో పాటల శిఖరమై ఎదిగి
జనం గుండెల్లో గూడు కట్టుకున్నాడు

- Advertisement -

గోస పడుతున్న గరీబోల్ల బతుకులపై
కూలిపోతున్న పేదల ఎదలపై
రాలిపోతున్న రైతన్న బతుకు చిత్రాల పై
కైతికాలను కైగట్టి కమ్మని పాటై నిలిచాడు
తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లు ఊది
పాటల పూదోటై జనం చెవుల్లో శక్కర పోశాడు

ఇప్పుడు యావత్ తెలంగాణ కన్నీటి దుఃఖ నదిని ఈదుతుంది
నీ జ్ఞాపకాల దొంతరలను నెమరేసుకుంటూ
బతుకులన్నీ భారమై కదులుతున్నయ్
అన్నా ! నీ ఎదుగుదల మణికంఠునికి కండ్లు
కుట్టినయ్
నమ్ముకున్న కాలమే కాలనాగై కాటేసిందన్నా!
అన్నా ! నీకు మరణం లేదు
మా చంటి పాపల బోసి నవ్వుల్లో నీవే
పరిమాళాలను వెదజల్లే కలువల్లో నీవే
మా పచ్చని పైరుల్లో నీవే
కొత్త చరణమై మళ్ళీ తూర్పున ఉదయించన్నా .

  • తాటిపాముల రమేశ్ ( తార ), శివనగర్ ,
    వరంగల్, 7981566031
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు