Friday, May 3, 2024

ఓబీసీ కుల వర్గీకరణ రిపోర్టు తెప్పించుకుని అమలులోకి తేవాలి..

తప్పక చదవండి
  • జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ తో భేటీ
    అయి వివిధ అంశాలపై చర్చించిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్
    డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
  • నాన్ క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి ని రూ. 8 లక్షల నుండి రూ. 15
    లక్షలకు పెంచేలా కేంద్రానికి సూచించండి.
  • విద్యా, ఉద్యోగ అవకాశాలలో “బ్యాక్ లాగ్” విధానాన్ని అమలులోకి తెచ్చేలా
    సిఫారసు చేయండి.
  • కులగణనతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది – కేంద్రానికి సూచించండి.
  • రాష్ట్ర జాబితాలో ఉండి, ఓబీసీ జాబితాలో నమోదు కాని కులాల అంశంలో
    వెంటనే అనుకూలంగా చర్యలు తీసుకోండి.


బీసీ/ఓబీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి సామాజిక, ఆర్థిక కులగణనను వెంటనే కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ ను కలిసి రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో పర్యటించిన ఆయనతో డాక్టర్ వకుళాభరణం బేగంపేట్ లోని “హరితా ప్లాజా” లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ భేటీ సందర్భంగా బీసీ లకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై దాదాపు 20 నిమిషాల సేపు చర్చించారు. కేంద్రం డీవోపీటీ నిబంధనలు స్పష్టంగా 3 ఏళ్ళకు ఒకసారి సమీక్షించి నాన్ క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి పెంపుదల చేయాలని నిర్ధిష్టంగా ఉత్తర్వులు ఉన్నప్పటికి కేంద్రం పెంపుదల చేయబోమని చెప్పడం భావ్యం కాదని, వెంటనే పెంపుదల నిమిత్తం జాతీయ కమిషన్ సిఫారసు చేయాలని డాక్టర్ వకుళాభరణం ఆయనను కోరారు. 30 ఏళ్ళుగా ఓబీసీ లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ అమలులో ఉన్నప్పటికీ అనేక కారణాల చేత అభ్యర్థులు పూర్తి స్థాయిలో దొరకడం లేదని, ఈ నేపథ్యంలో ఉద్యోగ నియమాలలో “బ్యాక్ లాగ్” విధానం కేంద్రం అమలులోకి తెచ్చే విధంగా సిఫారసు చేయాలని ఆయన జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ ను కోరారు. రాష్ట్రంలో బీసీలుగా విద్యా, ఉద్యోగ రంగాలలో లబ్ధి పొందుతున్నప్పటికీ, కేంద్రం సుమారు 40 సామాజిక కులాలను ఓబీసీ జాబితాలో చేర్చని కారణంగా ఉన్నత అవకాశాలు కోల్పోవలసి వస్తుందని, ఈ దృష్ట్యా జాతీయ బీసీ కమిషన్ వెంటనే అనుకూలంగా చర్యలు చేపట్టాలని కోరారు. అందుకు సంబంధించిన పలు పత్రాలను ఆయనకు అందజేశారు. ఓబీసీ జాబితా వర్గీకరణ ఏళ్ళ తరబడిగా జాప్యం జరగడం వలన చాలా నష్టం జరుగుతున్నదని, ఈ నష్ట నివారణ నుండి న్యాయం జరగాలంటే జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను వెంటనే తెప్పించి రాజ్యంగంలో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆయనను డాక్టర్ వకుళాభరణం కోరారు. అన్ని విషయాలపై తప్పకుండా దశల వారిగా జాతీయ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుందని హన్స్ రాజ్ గంగారాం అహీర్ ఈ భేటీలో భాగంగా వివరించినట్లు తెలిసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు