Tuesday, June 25, 2024

అసెంబ్లీ సాక్షిగా..చట్టాన్ని ధిక్కరిస్తున్న ప్రజా ప్రతినిధులు..

తప్పక చదవండి
 • ఎమ్మెల్యేల ఆస్థులు, అప్పులు శాసనసభకి సమర్పించాలి..
 • ఎమ్మెల్యేలుగా గెలిచి నాలుగేండ్లు దాటుతున్నా
  ఇప్పటికీ వివరాలు సమర్పించలేదు..
 • ప్రవర్తనా నియమావళి 364 ప్రకారం ఇది తప్పని సరి..
 • ఇది పూర్తిగా శాసనసభ విధి విధానాలకు విరుద్ధం..
 • తాము సంపాదించిన అక్రమాస్థుల వివరాలు బయటపడతాయని భయం..
 • ప్రజలు నిలదీస్తే జవాబు చెప్పలేని పరిస్థితి..
 • అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అక్రమార్జన..
 • ఎమేల్యేల ఆస్థులు, అప్పులు శాసన సభకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలి..
 • విధి విధానాలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టాలి..
 • తెలంగాణ అసెంబ్లీ సెక్రెటరీకి లేఖ రాసిన న్యాయవాది మహేష్ మామిండ్ల..

ప్రజా ప్రతినిధులంటే వారి చరిత్ర పారదర్శకంగా ఉండాలి.. ప్రజలచేత ఎన్నుకోబడిన వారు స్వచ్ఛమైన పాలలా ఉండాలి.. వారి జీవితం అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి.. అందుకే రాజ్యాంగం వారికి ప్రత్యేకమైన కొన్ని అధికారాలను, విశిష్టమైన జీవనశైలిని కల్పించింది.. ప్రజలచేత ఎన్నుకోబడిన వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.. స్వలాభం కోసం కాకుండా ప్రజాసేవకు తమ జీవితాన్ని అంకితం చేయాల్సి ఉంటుంది.. సేవా తత్పరత కలిగిన వారు మాత్రమే రాజకీయ జీవితాన్ని కోరుకుంటారు.. ఇది చదవడానికి, చరిత్ర పుస్తకాల్లో రాయడానికి, వాటిని వినడానికి అద్భుతంగా అనిపిస్తుంది.. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి వీటన్నిటికీ భిన్నంగా ప్రస్తుత ఎమ్మెల్యేల తీరు ఉండటం అత్యంత శోచనీయం.. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు కేవలం అక్రమ సంపాదన కోసం, స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తుండడం ఆందోళన కలిగించే విషయం.. అసలు విషయానికి వస్తే.. ఎన్నికైన ప్రతి శాసన సభ్యుడు తమకు సంబంధించిన ఆస్థుల వివరాలు, తమకున్న అప్పులు నిజాయితీగా వారికి దేవాలయం లాంటి శాసనసభకు సమర్పించాల్సి ఉంటుంది.. కానీ తాము గెలిచి ఏండ్లు గడుస్తున్నా.. తమ ఆస్థుల, అప్పుల వివరాలు సమర్పించకపోవడం.. శాసనసభ విధివిధానాలు, ప్రవర్తనా నియమావళిలోని 364వ నిబంధనను అతిక్రమించడమే అవుతుంది..

శాసనసభ్యులు అనుసరించాల్సిన విధి విధానాలను క్రోడీకరిస్తూ.. వారు తక్షణమే అనుసరించవలసిన పద్దతిని తెలియజేస్తూ 364వ నిబంధనను శాసనసభ దృష్టికి తీసుకుని వస్తూ.. తగిన చర్యలు గైకొనేలా చొరవ చూపాలని కోరుతూ న్యాయవాది తెలంగాణ శాసనసభ సెక్రెటరీకి లేఖ రాయడం జరిగింది..

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో విధి విధానాలు, వ్యాపార ప్రవర్తన నియమాలలోని 364వ నిబంధనను శాసనసభ దృష్టికి తీసుకురావడానికి జరిగిన ఒక ప్రయత్నం.. కాగా ఈ నియమం ప్రజలచేత ఎన్నుకోబడిన శాసనసభ సభ్యులు తమ ఆస్థులు, అప్పులకు సంబంధించిన ప్రకటన చేయవలసి ఉంటుంది.. ఆ దిశగా తమ డిక్లరేషన్లను శాసనసభ స్పీకర్ కు సమర్పించడం అన్నది తప్పనిసరి.. కాగా రూల్ 364 ప్రకారం, “ప్రతి శాసన సభ్యుడు ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజులలోపు స్పీకర్ కు తన యొక్క ఆస్థులు, అప్పులను తప్పని సరిగా ప్రకటించాలి.. ఆ తర్వాత 31వ తేదీలోపు వారి యొక్క ఆస్థులు, అప్పులలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ప్రకటించాలి. అటువంటి డిక్లరేషన్ పబ్లిక్ డాక్యుమెంట్ గా పరిగణించబడుతుంది.. తమకు సంబంధిన ఆస్థులకు ప్రభుత్వానికి రుసుము చెల్లించి, ప్రజలు తనిఖీ చేసుకోవడానికి ఖచ్చితంగా అందుబాటులో ఉంచాలి. అప్పుడే తాము పారదర్శకంగా ఉన్నట్లు ప్రజలు గుర్తిస్తారు.. అయితే, ఈ పత్రాలు ప్రజలకు అంత సులభంగా అందుబాటులో లేవని, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయడం లేదని తెలుస్తోంది..

అయితే రాజకీయ నాయకుల పనితీరులో పారదర్శకతను తీసుకురావడానికి తాను ప్రత్యేకించి కొంతకాలంగా ఈ విషయంపై ఆర్.టి.ఐ. దరఖాస్తులను దాఖలు అవుతున్నాయి.. అయినప్పటికీ, 364 నిబంధనకు తూట్లు పడుతున్నాయని, రాజ్యాంగం స్ఫూర్తితో అసలు ఆ నిబంధనను అమలు చేయబడలేదని తెలుస్తోంది.. ఈ విషయంలో, లోక్ ప్రహరీ (2018) 4 ఎస్.సి.సి 699 ఆర్డర్ కాపీని కూడా శాసనసభ సెక్రెటరీకి అందింది.. ఇదే విషయంలో అక్రమంగా ఎమ్మెల్యేలు ఆస్థులు కూడబెట్టడంపై అపెక్స్ కోర్టు ఆదేశాలను కూడా గమనించాలి.. కాగా ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అక్రమంగా ఆస్థులు కూడబెట్టడం.. మనీ ల్యాండరింగ్ లాంటి అక్రమ వ్యవహారాల్లో సైతం ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉండటం వంటి అనేక మీడియా కథనాలు.. కొన్ని ఆరోపణలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం కనుక.. కనీసం ఇప్పటికైనా, ఈ కొంచం ప్రభుత్వ పదవీకాలానికైనా రూల్ 364ని అమలు చేయడం అత్యవసరం..

ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 33-ఏ సమాచార హక్కును నిర్దేశిస్తోందని, తెలంగాణ రాష్ట్ర శాసనసభలో విధి విధానాలు, ఎమ్మెల్యేల వ్యాపార ప్రవర్తన యొక్క రూల్ 364 ప్రకారం రూపొందించబడిందన్న విషయం కూడా అసెంబ్లీ సెక్రెటరీకి తెలిసి ఉంటుంది.. కనుక ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 75- ఏ ఆస్థులు, అప్పుల ప్రకటనను ఖచ్చితంగా అమలు చేయాలి.. భారతీయ ప్రజాస్వామ్యం యొక్క ఎన్నికల న్యాయశాస్త్రం స్వచ్ఛమైన, న్యాయమైన ఎన్నికల కోసం ఉద్భవించినందున, అపెక్స్ కోర్ట్ అనేక కేసులలో.. ముఖ్యంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీ ఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, లోక్ ప్రహరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల తీర్పుల అనంతరం.. ఈ చర్యలు అత్యవసరం.. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఆర్ధిక స్థితిగతులు, వారి బాధ్యతలను గుర్తెరిగి, తమకు సంబంధించిన సమాచారాన్ని, దానికి సంబంధించిన పత్రాలు తప్పని సరిగా ప్రజా క్షేత్రంలో బహిరంగంగా ఉంచడం అత్యంత ఆవశ్యం.. ఈ సమాచారం ప్రజలకు తమ ప్రతినిధులను జవాబుదారీగా ఉంచడానికి, శాసనసభ పనితీరులో పారదర్శకతను నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, ప్రజా ప్రతినిధుల ఆస్థులు, అప్పుల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు వుంది..

తెలంగాణ హైకోర్టులో అనేక ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి.. ఇటీవల, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కూడా ఆస్థులు, అప్పులు, వారిపై నమోదైన ఇతర కేసులలో తీర్పులు నిజాయితీగా వెల్లడించని కారణంగా అనర్హత వేటుపడిన విషయం కూడా విదితమే.. కాబట్టి, ఎమ్మెల్యేల ఆస్థులు, అప్పుల డిక్లరేషన్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా.. శాసనసభ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయబడి ఉండటానికి తక్షణ చర్య తీసుకోవాలి.. రూల్ 364కి అనుగుణంగా https://legislature.telangana.gov.in/. అనే వెబ్ సైట్ ఉంది.. ఈ వెబ్ సైట్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఎంతో సహాయపడుతుంది..

కాగా గతంలో కూడా 2014లో శాసనసభ్యులు సమర్పించిన డిక్లరేషన్ వివరాలు కావాలని ఆర్.టి.ఐ. ద్వారా అసెంబ్లీని కోరడం జరిగింది.. దానికి అధికారులు సమాధానం ఇస్తూ.. రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ఇప్పట్లో వివరాలు ఇవ్వలేమని తరువాత ఇస్తాం అని చెప్పడం జరిగింది.. కాగా ఎలాంటి సమాచారం అందకపోవడంతో తిరిగి 2017 లో ఆర్.టి.ఐ. ద్వారా సమాచారం కోసం మరోమారు దరఖాస్తు చేసుకుని పూర్తి వివరాల ఫైల్ ను అందించాలని కోరడం జరిగింది.. సుదీర్ఘకాలం తరువాత 10, ఏప్రిల్ 2023లో శాసనసభ అధికారులు జవాబు ఇస్తూ.. త్వరలోనే కోరిన సమాచారం ఇవ్వగలమని చెప్పడం జరిగింది.. అయితే ఈ క్షణం వరకూ ఎలాంటి సమాచారం అందకపోవడంతో, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా.. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశ్యంతో 2 ఆగస్టు 2023 రోజు మరోమారు దరఖాస్తు చేసుకున్నారు.. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ స్పందించాలి.. అసలు సర్కార్ కి చిత్తశుద్ధి ఉందా..? లేదా..? అడిగిన సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ.. కాలం గడుపుతోందా..? అధికార పార్టీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనా వ్యవహారం బట్టబయలు అవుతుందని జంకుతున్నారా..? ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జారుతున్న సందర్భంగా విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి.. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడి అవ్వాలి.. చూద్దాం త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో తెలంగాణ సర్కార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుని, ప్రజలకు జవాబుదారిగా ఉంటుందా..? లేదా..? అన్నది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు