Saturday, July 27, 2024

బీజేపీ అధికారంలోకి వస్తే… సింగరేణి బకాయిలన్నీ చెల్లిస్తాం

తప్పక చదవండి
  • సింగరేణిని ప్రైవేటకరించే ప్రసక్తే లేదు
  • బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి ప్రైవేటీకరిస్తే గల్లాపట్టి గుంజుకొస్తాం
  • బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు కేసీఆర్-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నయ్
  • మంత్రి కేటీఆర్ రేపు అమిత్ షాను కలవబోయేది ఆ డ్రామాలో భాగమే..
  • మోదీ చేసిన పాపమేంది? 80 కోట్ల మందికి 3 ఏళ్లుగా ఉచిత రేషన్ ఇయ్యడమే నేరమా?
  • 3 కోట్ల ఇండ్లు, 10 కోట్లకుపైగా టాయిలెట్లు కట్టించడమే ఘోరమా?
  • కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటి?
  • సింగరేణిపై బహిరంగ చర్చకు సిద్దమా?
  • భూపాలపల్లి బహిరంగ సభలో కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్

హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి బకాయిలన్నీ చెల్లిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని ఉద్ఢాటించారు. బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. అదే జరిగితే కేసీఆర్ గల్లాపట్టి బజారుకీడుస్తామని హెచ్చరించారు. బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు బీఆర్ఎస్-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయన్నారు. అభివ్రుద్ధి పనుల పేరుతో రేపు ఢిల్లీలో కేంద్ర పెద్దలను మంత్రి కేటీఆర్ కలవబోతుండటం కుట్రలో భాగమేనన్నారు. అభివ్రుద్ది పనుల పేరుతో కలిసి బయటకొచ్చాక బీజేపీని బదనాం చేసే కుట్ర చేయబోతున్నారని అన్నారు.

మహా జన సంపర్క్ అభియాన్ లో భాగంగా భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బండి సంజయ్ తోపాటు రిటైర్డ్ డీజీపీ క్రిష్ణప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధులు చందుపట్ల కీర్తిరెడ్డి, రాకేశ్ రెడ్డి, ఉదయ ప్రతాప్, సునీల్ రెడ్డి, పాపయ్య, రాజుగౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు… నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను, విజయాలను ప్రజలకు తెలియజేయడానికే సభ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో బీజేపీ కార్యకర్తలు 35 లక్షల కుటుంబాలను కలిసి తెలంగాణలో బీజేపీ చరిత్ర స్రుష్టించింది. కష్టపడ్డ కార్యకర్తలందరికీ నా అభినందనలు. ప్రజల నుండి వచ్చిన స్పందన మరువలేనిది. మోదీని కేసీఆర్ ఎందుకు తిడుతున్నారు? ఆయన చేసిన పాపమేంది? 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించారు. 10 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చారు. 11 కోట్ల టాయిలెట్లు కట్టించారు. 80 కోట్ల మందికి మూడేళ్లుగా ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించారు. మరి కేసీఆర్ చేసిందేమిటి? రుణమాఫీ చేయలే. నిరుద్యోగ భ్రుతి ఇయ్యలే. ఫ్రీ యూరియా, విత్తనాలియ్యలే. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నడు ఇయ్యలే. పోడు భూములకు పట్టాలిస్తానన్నడు ఇయ్యలే. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు చేయలే. తెలంగాణ ప్రజలు చేసిన పాపమేంది?

- Advertisement -

14 వందల మంది పేదలు త్యాగం చేస్తే కేసీఆర్ రాజ్యమేలుతున్నడు. తెలంగాణ రాకముందు కేసీఆర్ ది బిచ్చపు బతుకు. పైసలు కట్టలేదని ఫైనాన్సోళ్లు కేసీఆర్ బండ్లు గుంజుకుపోయినరు. మరి ఇయాళ వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? నిత్యం ఎవరి కొంప ముంచాలనే ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కేసీఆర్ వన్నీ పచ్చి అబద్దాలు చెబుతున్నడు. బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టి సింగరేణిని ప్రైవేటీకరించబోతున్నారని అబద్దాలాడుతున్నడు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం మాత్రమే. రాష్ట్ర వాటా 51 శాతం. మరి కేంద్రమెలా చేస్తది? ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రే ప్రకటించారు. అయినా బీజేపీ పేరు చెప్పి కేసీఆర్ సింగరేణిని ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తున్నడు. అదే జరిగితే కేసీఆర్ గల్లా పట్టి గుంజుకొస్తాం. సింగరేణి కార్మికులకిచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. ఓపెన్ కాస్టులను రద్దు చేస్తానని చెప్పి… ఇయాళ 17 ఓపెన్ కాస్టులకు అనుమతి తెచ్చుకున్నడు. ఈ జిల్లాలోనే 3 ఓపెన్ కాస్టులున్నయ్. తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ను ప్రైవేట్ పరం చేశారు. సింగరేణి నుండి రూ.25 వేల కోట్ల అప్పు తీసుకున్నరు. ఇయాళ సింగరేణిని దివాళా తీయించారు. జీతాల కోసం బ్యాంకుల వద్ద బాండ్లు కుదవపెట్టి అప్పు తెచ్చుకునే దుస్థితి. కేసీఆర్ బిడ్డను సింగరేణ యూనియన్ కు నాయకురాలిని చేసి ఏటీఎంలాగా వాడుకుంటున్నడు. సింగరేణికి వేల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్న కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఐటీ రీయంబర్స్ మెంట్ ఎందుకు చేయడం లేదు? బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ బకాయిలన్నీ చెల్లిస్తాం. కాంట్రాక్టు పదమే ఉండదని చెప్పిన కేసీఆర్ ఇయాళ సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. ఇవన్నీ బీజేపీ ప్రశ్నిస్తుంటే… ప్రజలను దారి మళ్ళించేందుకు కేసీఆర్ మోదీ తనకు దోస్త్ అంటూ ప్రచారం చేసుకుంటున్నడు. మోదీ కేసీఆర్ లెక్క తాగడు. దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తున్నడు. అవినీతిని సహించడు. మరి నీకు, మోదీకి దోస్తీ ఎక్కడ? బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంటే ఓర్వలేక బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని సిగ్గులేకుండా కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు రాలేదు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఎటు పోతున్నరు? బీఆర్ఎస్ లో కే కదా? గతంలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది బీఆర్ఎస్ లో చేరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే ఏ పార్టీ నుండి గెలిచి ఏ పార్టీలోకి పోయిండో ప్రజలకు తెల్వదా? మీరు కాంగ్రెస్ ను గెలిపిస్తే.. మీకు చేయి ఇచ్చి కారెక్కుతున్నరు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయమని ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఇది తెలిసే కేసీఆర్ కావాలనే బీజేపీని బదనాం చేయడానికి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నయ్. కేసీఆర్ కొడుకు ఢిల్లీ పోయి అమిత్ షాను కలవబోతున్నారట… ఇదంతా డ్రామా. బీజేపీ గ్రాఫ్ ను తగ్గించడానికి ఆడుతున్న నాటకంలో భాగమే. అంతుకుమించి ఏమీ లేదు. బీజేపీని బదనాం చేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న కుట్రలో భాగమే. కేసీఆర్ 9 ఏళ్లలో ఏనాడు అమరవీరులకు నివాళులు అర్పించలేదు. 1400 మంది చనిపోతే 600 మందికి మాత్రమే సాయం చేసి మిగిలిన వాళ్లను గాలికొదిలేసిండు. సిగ్గులేకుండా ఇయాళ అమరవీరులకు, ఉద్యమకారులకు సన్మానాల పేరుతో మరో డ్రామాకు తెరదీసిండు. భూపాలపల్లిలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలే. ఇక్కడున్న జర్నలిస్టులకు గతంలో కేటాయించిన స్థలాలను సైతం గుంజుకున్న చరిత్ర కేసీఆర్ సర్కార్ దే. బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడున్న జర్నలిస్టులతోపాటు తెలంగాణలోని జర్నలిస్టులందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత మేం తీసుకుంటాం. పోలీసులు సైతం కేసీఆర్ మాటలకు మోసపోయి అన్యాయంగా ప్రవర్తించొద్దు. బీజేపీ అధికారంలోకి వస్తే పోలీసులకు న్యాయం చేస్తాం. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. నిలువ నీడలేని పేదలకు ఇండ్లు కట్టిస్తాం. రైతులకు ఫసల్ బీమాను అమలు చేస్తాం. ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేసి ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు