Monday, April 29, 2024

భూమండలానికి నాభి కేంద్రం శ్రీశైల మహాక్షేత్రం..

తప్పక చదవండి

యుగయుగాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీశైల మహాక్షేత్రం.. భూమండలానికి నాభిస్థానంగా ప్రసిద్ధి చెందిందని ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీశైలంలోని అన్న ప్రసాద వితరణ భవన్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో ‘శ్రీశైల క్షేత్ర వైభవం’పై మూడు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీశైల మహాక్షేత్రం అనాది క్షేత్రమని ప్రసిద్ధి అని చెప్పారు. భారతదేశంలో ఎక్కడ ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా మన ఉనికి శ్రీశైల క్షేత్రాన్నే కేంద్రంగా చేసుకుని చెబుతారని అన్నారు. చారిత్రకంగా కూడా శ్రీశైల మహాక్షేత్రం ఎంతో ప్రసిద్ధమైందని తెలిపారు.

పలు రాజ వంశాల పాలనలోనూ శ్రీశైలం సమున్నత స్థాయిని పొందిందని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీశైల ఆలయ ప్రాకార కుడ్యం కూడా ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నదన్నారు. ఈ ప్రాకార కుడ్యంపై పురాణ గాధలకు సంబంధించిన శిల్పాలతోపాటు సామాజిక శిల్పాలు, ప్ర‌కృతిశిల్పాలు కూడా ఉండటం విశేషమన్నారు. శ్రీశైల మహా క్షేత్రానికి సంబంధించిన విషయాలు జనబాహ్యంలో ఉన్నా మరెన్నో విషయాలు భక్తులకు తెలియాల్సి ఉందని కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆయా ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న శ్రీశైల విశేషాలను సామాన్యులకు తెలియజెప్పే ఉద్దేశంతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్షేత్రం గొప్పతనాన్ని భావి తరాలకు తెలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని కొట్టు సత్యనారాయణ తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రంలో అధ్యాత్మిక గ్రంథాలయం, మ్యూజియం ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు.

- Advertisement -

శ్రీశైలం దేవస్థానం ఈఓ ఎస్ లవన్న.. సదస్సు ప్రారంభోపన్యాసం చేస్తూ .. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్లింగం, మహాశక్తి స్వరూపిణి ఉండటం శ్రీశైలం మహాక్షేత్రం విశేషం అని చెప్పారు. దివ్యక్షేత్రంగా పేరొందిన శ్రీశైల క్షేత్రం పవిత్ర తీర్థంగా, గొప్ప అధ్యాత్మిక క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఎందరెందరో యోగి పుంగవులు, సిద్ధ పురుషులు తమ ఆధ్యాత్మిక సాధనకు శ్రీశైలాన్నే కేంద్రంగా చేసుకున్నారని అన్నారు. ఈ క్షేత్రంలో లెక్కకు మించి వెలిసిన సహజ జల ధారలు, గుహలు, గుహాలయాలు ఈ క్షేత్ర ఆధ్యాత్మిక వైభవానికి దోహదం చేస్తాయన్నారు. తొలుత దేవాదాయ శాఖ అర్చన ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి మాట్లాడుతూ.. సదస్సు లక్ష్యాలను వివరించారు. పురాణాలతోపాటు మరెన్నో సంస్క్రుత, తెలుగు, కన్నడ, తమిళ గ్రంథాల్లో శ్రీశైలం విశేషాలను వెల్లడించారన్నారు. శ్రీశైలం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం మహా క్షేత్రం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సంస్క్రుతి పరంగా పలు ప్రత్యేకతలు కలిగి కలిగి ఉందని తెలిపారు. ఈ సదస్సుతో శ్రీశైలంలోని ప్రామాణిక అంశాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్య స్వామి, మేరాజోత్ హనుమంతు నాయక్ తదితరులు మాట్లాడారు. సదస్సులో ప్రసంగించిన వారిని దేవస్థానం ఈఓ లవన్న.. శేషవస్త్రం, ప్రసాదం, శ్రీస్వామి అమ్మవార్ల జ్ఞాపిక‌తో సత్కరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు