ఫ్రాన్స్ లో 17 ఏళ్ల కుర్రాడు నెహల్‌ను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా హింసకు తెరలేపింది. నాలుగో రోజు కూడా నిరసనకారులు రెచ్చిపోయారు. వాహనాలకు, షాపులకు నిప్పుపెట్టారు. నాలుగో రోజు సుమారు 1300 మందికిపైగా ఆందోళనకారుల్ని అరెస్టు చేశారు. మార్సెల్లి, లియాన్, గ్రినోబుల్ పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు హోరెత్తిస్తున్నాయి. పారిస్‌లోని శివారు ప్రాంతాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో మరణించిన నెహల్ భౌతికకాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పారిస్‌లో శివారు ప్రాంతమైన నాన్‌టెర్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హింసను వీడి చర్చలు నిర్వహించాలని ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబప్పె తెలిపారు. శుక్రవారం రాత్రి లియన్ నగరంలో పరిస్థితి అదుపు దాటింది. నిరసనకారులు లూటీలకు పాల్పడ్డారు. అనేక వాహనాలను తగులబెట్టారు. అల్లర్లను అదుపు చేస్తున్న సమయంలో.. 35 మంది ఆఫీసర్లు గాయపడ్డారు. 8 ప్రభుత్వ బిల్డింగ్‌లు, ఓ పోలీసు స్టేషన్ ఈ దాడిలో ధ్వంసం అయ్యాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు, యుద్ధ ట్యాంక్‌లు పహారా కాసాయి. ట్రాఫిక్ చెకింగ్ సమయంలో నెహల్ కారును పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వాగ్వాదం జరిగింది. అప్పుడు ఓ పోలీసు తన వద్ద ఉన్న పిస్తోల్‌తో షూట్ చేశాడు. తూటా దిగడంతో డెలివరీ డ్రైవర్‌గా చేస్తున్న నెహల్ చనిపోయాడు. ఆ మృతిని ఖండిస్తూ తొలుత పారిస్‌లో ఆందోళనలు చెలరేగాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆ అల్లర్లు వ్యాపించాయి. సిటీ హాల్స్, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లపై ఆందోళనకారులు అటాక్ చేశారు. రోజురోజుకూ నిరసనకారులు తమ పోరాటాన్ని ఉదృతం చేశారు. లూటీలకు పాల్పడ్డారు. హింసకు దిగుతూ షాపులను ధ్వంసం చేశారు. పారిస్‌లో జరా, నైక్ షాపులపై అటాక్‌చేశారు. సూపర్‌మార్కెట్లు, చిన్న చిన్న వ్యాపారసంస్థలను టార్గెట్ చేశారు. లూటీలు పెరిగిపోవడంతో శుక్రవారం దేశవ్యాప్తంగా చాలా వరకు షాపులను మూసివేశారు.