Wednesday, May 1, 2024

ఐజీ ఆపై స్థాయి పోలీసు అధికారుల పోస్టింగ్ లు మారేనా..?

తప్పక చదవండి
  • ఎన్నికలు సమీపిస్తున్న వేళ..సీఎం నిర్ణయం తీసుకుంటే మేలు
  • సమర్థవంతులు లూప్ లైన్లలో..ప్రజలు గుర్తించలేనోళ్లు పోస్టింగుల్లో
  • కులాలు, రాజకీయ అవసరాల కోణంలోనే నియామకం చేస్తే సమాజంలో వ్యతిరేకతే
  • ప్రజలతో పోలీసులు కలిసి పనిచేస్తేనే..ప్రభుత్వంపై మరింత నమ్మకం
  • సిఫారసు లేఖల సంస్కృతితో నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలపై అసంతృప్తి
  • అన్ని కోణాల్లో సీఎం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ప్రజల నుంచి డిమాండ్

పోలీసులు అంటే ప్రజల్లో ఒక నమ్మకం కలగాలి. ప్రజలు వారి బాధను చెప్పుకుంటే వినగలిగే పోలీసు బాస్ ఉండాలి. అప్పుడే సర్కార్ పై భరోసా..ఆ పోలీసు అధికారిపై గౌరవం ఉంటుంది. సీఎం సార్ మాకోసమే ఆ అధికారిని నియమించాడో ఏమో అనేలా గర్వంగా చెప్పుకోగలగాలి. అప్పుడే ప్రభుత్వంపై ఎప్పటికి ప్రజల మనసు మారదు. ఇలాంటి వ్యవస్థ రావాలంటే ప్రజల కోసం..ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసు అధికారులు సరైన పోస్టింగ్ లో ఉండాల్సిందే. అలాంటి పరిస్థితి రావాలంటే ఏ రాజకీయ కోణం దాగుండని, నిర్ణయం అమలు కావాలి. దీనికి సీఎం కంకణబద్దుడై ఉంటే సాధ్యం సులభమేననేది నిజం.

ప్రస్తుతం పోలీసుశాఖలో కొందరు అధికారుల తీరుతో ప్రజల్లో నేటికి వ్యతిరేకత పెరిగుతూనే ఉండటం..ఆ ప్రభావం యదాతధంగా ప్రభుత్వంపై పడుతుండటంతో రానున్న ఎన్నికల పరిస్థితుల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.

- Advertisement -

పోలీసుశాఖలో సమర్థవంతులకు సరైన పోస్టింగ్ లు దక్కడం లేదనే విమర్శలు, అంసతృప్తులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజల కోసం, ప్రజల బాధలు వినే అధికారులకు నాన్ ఫోకల్ పోస్టింగులు ఇవ్వడం, సమాజం అంటేనే దురాభిప్రాయం కలిగిన అధికారులకు ఫోకల్ పోస్టింగులు ఇవ్వడంతో, ప్రజలు అలాంటి అధికారుల దగ్గరకి వెళ్లాలంటేనే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదనే స్పష్టమవుతోంది.

లూప్ లైన్లలో సమర్థులైన పోలీసు అధికారులు :
నాయకుడు సరిగ్గా ఉంటే సమాజం బాగుంటుంది. అదే నాయకుడు సరైన మార్గంలో నడుస్తుంటే, కిందిస్థాయి నేతలు కూడా సరైన పద్దతిలో ఉంటారు. అలాగే ఉన్నతాధికారి సరైనోడు ఉండే, కిందిస్థాయి అధికారి కూడా సరిగ్గా పనిచేస్తాడనేది వాస్తవం. కానీ పోలీసుశాఖలో పోలీసు బాస్ లు సమర్థులు లేరనే విమర్శలు రోజురోజుకు వెల్లువెత్తుతున్నాయి. స్వంత ప్రయోజనాలు, అవినీతికి పాల్పడే పోలీసు అధికారులు, ఉన్న సమయంలోనే దోచెద్దాం అనే పోలీసు అధికారులు కీలక పోస్టింగ్ లో ఉండటంతో, కిందిస్థాయి డీసీపీ, ఏసీపీలు, సీఐలు సైతం ఇస్టారాజ్యంగా పనిచేయడం, అవినీతికి పాల్పడటం, బాధితుల కోసం పనిచేయకుండా నిందితులకోసం పనిచేస్తున్నట్లు ఇప్పటికే బహిరంగంగా బాధితులు ఆరోపణలు చేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటన్నంటికి కారణం పోలీసుశాఖలోని ఉన్నతస్థాయి హోదాల్లో ఉన్న అధికారులు సరైన సమర్థులు లేకపోవడం అని చెప్పాలి. వీటి ఫలితంగా పోలీసుశాఖలో కొందరు చేస్తున్న అవినీతి అక్రమాలు, సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆ ప్రభావం కాస్త ప్రభుత్వానికి వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే జనాల నుంచి పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఐజీ, ఆపై స్థాయి అధికారుల్లో అనేక మంది సమర్థులు ఉన్నారని వారంతా ప్రస్తుతం పోలీసుశాఖలోని కీలక పోస్టింగ్ లు ఉండకుండా, నాన్ ఫోకల్ పోస్టింగులు ఉండటం, మరికొందరు పోలీసుశాఖతో సంబంధం లేని హోదాల్లో పనిచేస్తున్నారన్న విషయాన్ని తెరపైకి తెస్తున్నారు. ఫలితంగా ప్రజలు మెచ్చే పోలీసు ఉన్నతాధికారులకు సరైన పోస్టింగులు లేవనే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకవచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు మెచ్చే, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసు ఉన్నతాధికారులకు సరైన పోస్టింగులు ఇస్తే, ప్రజలు నమ్మకంగా జీవనం సాగించే అవకాశం ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.

ఐజీ ఆపై స్థాయి అధికారుల పోస్టింగులు మారేనా?
రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఐపీఎస్ ల పోస్టింగులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా కొన్ని జిల్లాల ఎస్పీలతో పాటు, ఐజీలు, ఆ పై హోదా ఉన్న అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, ప్రజలకోసం పనిచేసే ఐపీఎస్ లు, ఆ పై స్థాయి హోదా ఉన్న వ్యక్తులకు సరైన పోస్టింగులు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పార్టీలకు అనుగుణంగా, రాజకీయ నేతల మన్నలను పొందేలా పనిచేసే వారికి పోస్టింగులు ఇస్తే, ప్రస్తుత ఎన్నికల తరుణంలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, విపక్షాలు సైతం విమర్శించే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం ప్రత్యేక సర్వే చేయించినట్లు కూడా తెలుస్తోంది. ఐపీఎస్ ల వారీగా ఇదివరకు వారు ఎక్కడెక్కడ పనిచేశారు?, వారికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది?, ప్రజలు వారిని ఎలా ఆదరించారు?, డైనమిక్ గా పనిచేసిన గుర్తింపు ఉందా ? ప్రజలకు అందుబాటులో ఉన్నారా?, అనే అంశాలపై సమగ్ర నివేదిక తెప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. వాటి ఆధారంగా సీఎం మనుసులో ఉన్న ఐపీఎస్ లు, ఐజీలు, ఆపై స్థాయి పోలీసు అధికారులు ప్రస్తుతం ఎక్కడెక్కడ, ఏ విభాగంలో ఉన్నారనే విషయంపై కసరత్తు చేసి, ఈ సారి వారికి సమర్థవంతమైన పోస్టింగులు ఇచ్చేలా సానుకూలంగా ఉన్నట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. అతి త్వరలోనే వీరికి సరైన పోస్టింగులు ఇస్తుండటంతో, రాష్ట్రంలో పలు జిల్లాల పోలీసు బాస్ లు మారే అవకాశం ఉంది. అంతేకాదు పోలీసుశాఖకు అనుబందంగా ఉన్న పలు విభాగాలకు సైతం కొత్త పోలీసు బాస్ లు కొలువు దీరనున్నారు. మొత్తంగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పోలీసు శాఖలో సమర్థవంతమైన అధికారులకు పోస్టింగ్ లు ఇస్తే, ప్రభుత్వానికి మంచి పేరు రావడమే కాకుండా, ప్రజలు ధైర్యంగా ఉండే అవకాశం ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు