Friday, May 3, 2024

నెరేడ్మెట్ డైట్ కళాశాల మూసివేసే కుట్ర..!

తప్పక చదవండి
  • ప్రాధమిక విద్యను బలోపేతం చేయడమే డైట్ కళాశాల లక్ష్యం..
  • డైట్ కళాశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు..
  • ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉర్ధూ మాధ్యమంలో బోధన..
  • ప్రతి మాధ్యమంలో 50 సీట్లు.. మొత్తం 300 సీట్లు..
  • జాతీయ విద్యా విధానం 1986లో భాగంగా ఏర్పాటు..
  • కోట్ల విలువచేసే నెరేడ్మెట్ డైట్ కళాశాల భూమి
    అన్యాక్రాంతం చేసే దిశగా చర్యలు..
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టిపెట్టాలని కోరుతున్న విద్యా వేత్తలు..

హైదరాబాద్ నెరేడ్మెట్ లో నెలకొని ఉన్న డైట్ కాలేజీకి ఎంతో చరిత్ర ఉంది.. ఎంతోమంది ఉపాధ్యాయులను అందించిన ఈ కళాశాలకు ఇప్పుడు గ్రహణం పట్టింది.. ప్రాధమిక విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యానికి తూట్లు పడ్డాయి.. కేవలం కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు నెరేడ్మెట్ డైట్ కళాశాల మూతపడే దౌర్భాగ్యం నెలకొంది.. ఈ కళాశాల మూసివేత వెనుక ఏదైనా కుట్ర దాగివుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యా మేధావులు.. తెలంగాణ రాష్ట్రంలో అసలే విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టి పోయింది.. ఈ క్రమంలో ఇప్పుడు నెరేడ్మెట్ డైట్ కళాశాలను కూడా మూసేసి, అటు ప్రాధమిక విద్యను భూస్థాపితం చేయడమే కాకుండా, ఇటు నిరుద్యోగ సమస్యకు ఊపిరిపోసేలా ప్రభుత్వ చర్యలు ఉండటం శోచనీయం..

జాతీయ విద్యా విధానం -1986 (ఎన్ ఈ పి -1986)లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి..ప్రాధమిక విద్యను బలోపేతం చేయడమే డైట్ కాలేజీల ముఖ్య ఉద్దేశం. వృత్తి పూర్వ, వృత్యేతర శిక్షణలు ఈ కళాశాలల్లో ఇవ్వబడతాయి. వృత్తిపూర్వ శిక్షణా విధానంలో భాగంగా 2 సంవత్సరాల డీ.ఇ.ఎల్.ఇ.డీ. జిల్లా విద్యా శిక్షణా సంస్థలలో నిర్వహించబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గల డైట్ కళాశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు. ఉమ్మడి జిల్లా కేంద్రాలలో, ఉర్దూ మాధ్యమంలో 6 జిల్లాలలో కొనసాగుతున్నాయి.. ప్రతి మాధ్యమంలో 50 సీట్ల చొప్పున, రెండు సంవత్సరాల డీ.ఇ.ఎల్.ఇ.డీ. కోర్సులో 300 ప్రవేశాలకు అవకాశం కల్పించారు..

- Advertisement -

ప్రతి డైట్ కళాశాల యందు 1 ప్రిన్సిపాల్, ఏడుగురు సీనియర్ లెక్చరర్స్, 17 మంది లెక్చరర్స్, ఐదుగురు ఉర్దూ లెక్చరర్స్ బోధన సిబ్బందిగా ఉంటారు.. 8 మంది క్లర్క్లులు, ఆఫీసు సూపర్డెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినెట్స్, బోధనేతర సిబ్బంది డైట్ కళాశాలలో విధులను నిర్వహించవలసి ఉంటుంది. కాగా డైట్ కళాశాలలలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలన్న గొప్ప ఉద్దేశంతో ఎన్.సి.టి.యి. ( నేషనల్ కౌన్సిల్ ఫార్ టీచర్స్ ఎడ్యుకేషన్ ) సహకారంతో కొనసాగుతుంటే హైదరాబాద్ జిల్లాలో అలాంటి కళాశాలను నివేదిక సమర్పించకుండా అనుమతులను రద్దు చేసే విధంగా వ్యవహరించడం శోచనీయం.

ప్రతి రాష్ట్రంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థలు జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది. ఆయా జిల్లాలలో నెలకొల్పబడిన జిల్లా విద్యా శిక్షణ సంస్థలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉన్నాయి. వాటిలో హైదరాబాదులోని నెరేడ్ మెట్ ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థ ఒకటి.అన్ని డైట్ కాలేజీల్లో వలనే ఇక్కడ కూడా రెండు సంవత్సరాల కలిపి 300 మంది ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రతి ఏడాది రాష్ట్రాల్లోని డైట్ కళాశాలల నుండి పనితీరు నివేదికలను (PAR) ఎన్.సి.టి.ఈ. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ ల ద్వారా పొందుతుంది. ఇట్టి నివేదికలో సంస్థలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్య, ఉపన్యాసకుల సంఖ్య, ఖాళీ పోస్టుల వివరాలు, భౌతిక వసతులు, భవనాలు మొదలగు సమాచారంతో పాటు విద్యార్థుల ప్రగతి, సాఫల్యతలను నివేదిక రూపంలో అందించాల్సి ఉంటుంది.

కాగా ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నేరేడ్మెట్ కళాశాల నుండి ఇట్టి పనితీరు నివేదికను అందజేయకపోవడం వలన సంస్థ నిర్వాహనకు అనుమతిని నిరాకరిస్తూ ఇన్ సిటిఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని డైట్ కళాశాలల యొక్క పి.ఏ.ఆర్. నివేదికలను సకాలంలో పంపేటట్లు రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన మండలి (ఎస్.సి.ఈ.ఆర్.టి) పర్యవేక్షిస్తుంది. కానీ దాదాపు అన్ని డైట్ కాలేజీలలో ఎక్కువ మొత్తంలో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ తొమ్మిది కళాశాలలో నివేదికలు పంపబడి నేరేడ్మెట్ కళాశాల యొక్క నివేదికను పంపకపోవడానికి గల కారణం తెలియాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డైట్ కళాశాలలకు నివేదిక పంపించిన ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ నేరేడ్మెట్ లోని కళాశాలకు ఎందుకు పంపించలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొనసాగుతున్న డైట్ కళాశాలను నిర్వహించకుండా అనుమతులు రద్దు అయ్యే విధంగా వ్యవహరించడానికి కారణం ఏంటి? ఆ స్థలం ఇతర ప్రభుత్వ సంస్థకు గాని, ప్రైవేట్ వ్యక్తులకు గాని అప్పజెప్పేందుకు కుట్ర ఏదైనా జరుగుతుందా..? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన డైట్ కళాశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అనుమతులను రద్దు కాకుండా తీసుకోవలసిన చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు. లేనిచో భవిష్యత్తులో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు