- పత్తాలేని పరిశీలనాధికారులు..
- దీనికి నిదర్శనమే గంగారంలోనివైకుంఠధామం నిర్మాణం..
- లక్షల రూపాయలు మట్టిపాలు..
- చిన్నపాటి గాలివానలకే పైకప్పు ఎగిరిపోయిన వైనం..
- బిల్లులు అందాయో లేదో కానీ బీటలువారిన గోడలు..
- నాణ్యతలేని కట్టడాలే నాశనానికి కారణమంటున్న గ్రామస్తులు..
- నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు..
చిలిపిచేడ్ : తెలంగాణ ప్రభుత్వం పల్లెల రూపురేఖలు మార్చాలని పల్లెప్రకృతి పథకానికి శ్రీకారం చుట్టి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపడు తుంటే..ఇదే అదునుగా నాసిరకం పనులు చేసి లక్షల రూపాయ లను కాజేసే ముఠాలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి అందినకాడికి కాంట్రాక్టులు దక్కించుకోవడం గర్వకారణం.. పల్లెప్రకృతి పనులు వేగంగా చేసి బిల్లులు కాజేసే పనిలో పడ్డారు కాంట్రాక్టర్లు. అటు బిల్లులు అందాయో లేదో కానీ చిన్నపాటి గాలివానలకు ఆయా కాంట్రాక్టర్ల పనితనం బట్టబయలు అవుతుండటంతో ముక్కున వేలేసుకుంటున్నారు పల్లెవాసులు.అవ్వ ఇంత దారుణమా..? అని అవాక్కయ్యేలా ఉంది గంగారం వైకుంఠధామం నిర్మాణం తీరు.చిలిపిచేడ్ మండలం గంగారం గ్రామంలో పల్లెప్రకృతిలో భాగంగా నిర్మించిన వైకుంఠధామం నాసిరకం నిర్మాణం..
అప్పుడే బయటపడ్డ నాణ్యత లోపాలు..
పల్లెప్రకృతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గంగారం గ్రామానికి వైకుంఠధామం,డంపింగ్ యార్డులు,గ్రామపార్కులు ఏర్పాటు చేసింది.వైకుంఠదామనికి రూ.12.60లక్షలు,డంపింగ్ యార్డుకు రూ.2.50 లక్షలు,గ్రామ పార్కులకు రూ.5.7లక్షల చొప్పున మంజూరు చేసింది ప్రభుత్వం.ఈ పనులను పూర్తిచేసే బాధ్యత గ్రామ సర్పంచుకే అప్పగించింది.అయితే చిలిపిచేడ్ మండలం గంగారంలో వైకుంఠధామం నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వలన గోడలు,మెట్లు ఎక్కడికక్కడ పగుళ్లు పడ్డాయి.ఇటీవల కురిసిన చిన్నపాటి గాలివానలకు వీటి పైకప్పులు ఎగిరిపోయాయి. నిర్మాణాలు చేపట్టి రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే ఇలాంటి పరిస్థితి రావడంపై నాణ్యత లేని కట్టడం వలనే ఇలా జరిగిందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ పల్లెప్రకృతి పనులు చేపట్టిన వారిపై,వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.పై అధికారులు ఈ నిర్మాణ కట్టడాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..