Friday, June 14, 2024

ఆగని నిరసన జ్వాలలు..

తప్పక చదవండి
  • ఉభయసభల్లో చర్చకు విపక్షాల పట్టు
  • మధ్యాహ్నానికి సభలు వాయిదా
  • సభా సమయం వృధా చేస్తున్నారన్న పీయూల్‌ గోయల్‌

మణిపూర్‌ అంశంపై సోమవారం మరోసారి పార్లమెంటులో గందరగోళం నెలకొంది. మణిపూర్‌ అంశం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది. మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాల నిరసనలతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.. మణిపూర్‌పై చర్చ చేపట్టాలంటూ లోక్‌సభలో ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ సభ్యులు నినాదాలు చేపట్టడంతో సభా కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. మణిపూర్‌పై రూల్‌ 176 కింద స్వల్ప కాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు రూల్‌ 276 కింద మణిపూర్‌పై దీర్ఘకాలిక చర్చలు జరపాలని పట్టుబట్టాయి. మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలన్న తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. సభ్యులకు ఇచ్చిన స్వేచ్ఛను ప్రతిపక్ష ఎంపీలు దుర్వినియోగం చేసేలా ప్రవర్తిస్తున్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. వారు ఈ సెషన్‌లో 9 రోజులను వృథా చేశారని పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. గత పది రోజులుగా ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవగానే స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తవగానే మణిపూర్‌ హింసాత్మక ఘటనపై ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశాయి. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ వెల్‌ లోకి దూసుకెళ్లారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి తెలెత్తడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో మణిపూర్‌ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, విపక్షాలు సభలోని రూల్‌ 267 కింద మాత్రమే చర్చకు పట్టుబడటంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ’మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో మణిపూర్‌ అంశాన్ని చర్చించాలని మేం కోరుకుంటున్నాం. కానీ విపక్షాలు అంగీకరించడంలేదు’ అని రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు వారికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మణిపూర్‌ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్‌ తెలిపారు. అయితే ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే సభకు సంబంధించిన 9 ముఖ్యమైన రోజులను వృథా చేశారని ఆయన అన్నారు. ఈ సారి మాత్రం అలా జరగకుండా మణిపూర్‌ అంశంపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. కాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్‌లో శాంతిభద్రతల సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడంంతో ఉభయసభలు పలుమార్లు వాయిదాపడ్డాయి. మరోవైపు మణిపూర్‌ అంశంపై రూల్‌ 267 కింది చర్చలు జరపాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. అలాగే పార్లమెంట్‌ సాధారణ కార్యకలాపాలను నిలిపివేయడానికి నోటీసులు ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు