Monday, May 6, 2024

మణిపూర్ పై సుప్రీం నజర్..

తప్పక చదవండి
  • వీడియో బయటకు వచ్చే వరకు కేంద్రం ఏం చేస్తోంది
  • ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి
  • ఓ తెగకు చెందిన మహిళపై ఇంత దారుణమా
  • మణిపూర్‌ ఘటనపై విచారణలో సుప్రీం సిజె ప్రశ్నలు
  • ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్న సుప్రీం కోర్టు..

మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారో చెప్పాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. మణిపూర్‌ అల్లర్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బాధిత మహిళల తరపున కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించగా.. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ వాదించారు. విచారణ సమయంలోనే ఓ న్యాయవాది బెంగాల్‌, రాజస్థాన్‌లో మహిళలపై జరిగిన దాడులనూ ప్రస్తావించారు. అక్కడ కూడా ఇలాంటి ఘటనలే జరిగాయని గుర్తు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందించారు. అయితే…అక్కడి ఘటనల్ని మణిపూర్‌ హింసతో పోల్చి చూడలేమని వ్యాఖ్యానించారు. ’దేశవ్యాప్తంగా మహిళలపై దారుణాలు జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే వాస్తవం కూడా. కానీ…మనం ఇప్పుడు విచారిస్తున్న కేసు పూర్తిగా విభిన్నం. ఓ తెగకు చెందిన మహిళను అత్యంత దారుణంగా అవమానించారు. అన్ని చోట్లా జరుగుతోంది ఇదే కదా అని తేల్చి చెప్పలేం. అయితే మహిళలందరినీ రక్షించండి లేదంటే… పూర్తిగా వదిలేయండి అని చెబుతున్నారా..? అని సిజెఐ డీవై చంద్రచూడ్‌ ప్రశ్నించారు. అసలు ఈ వీడియో బయటకు వచ్చేంత వరకూ ఏం చేస్తున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు ఉంటారని ధర్మాసనం స్పష్టం చేసింది. మణిపూర్‌ హింసాకాండపై సిట్‌ని ఏర్పాటు చేసి విచారించాలన్న మైతేయిల పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేవలం ఓ వర్గాన్ని దోషిగా చూపించే పిటిషన్‌లను విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ కేసుని సీబీఐ విచారించాలన్న కేంద్రం అభిప్రాయాన్ని బాధితులు అంగీకరించడం లేదని కపిల్‌ సిబాల్‌ కోర్టుకి వెల్లడిరచారు. అదే సమయంలో అసోం రాష్టాన్రికి కేసు బదిలీ చేయాలన్న విషయంలోనూ వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ స్పందించారు. అసోంకి కేసుని బదిలీ చేయాలని తాము చెప్పలేదని, కేవలం వేరే రాష్ట్రం అని మాత్రమే ప్రస్తావించామని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. సీబీఐ విచారణను వ్యతిరేకించిన కపిల్‌ సిబల్‌…అసోంకి కాకుండా వేరే రాష్టాన్రికి కేసు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో ఎంతో మంది కనిపించకుండా పోయారని వెల్లడించారు.. అక్కడ లైంగిక వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. ఇక్కడ శాంతిభద్రతలు నెలకొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కపిల్‌ సిబల్‌ అసహనం వ్యక్తం చేశారు. రిలీఫ్‌ క్యాంప్‌లు కూడా దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. బాధితులు పదేపదే కోర్టుకు రాలేరని, విచారణకు ప్రత్యామ్నాయ మార్గమేదైనా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు. ఈ అల్లర్లతో పాటు నార్కో టెర్రరిజం, గసగసాల సాగుపైనా విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు మైతేయి తరపున పిటిషన్‌ వేసిన న్యాయవాది. అయితే సుప్రీంకోర్టు మాత్రం మరింత కచ్చితమైన అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించాలని, కేవలం ఓ కమ్యూనిటీని తప్పుపట్టడం సరికాదని స్పష్టం చేసింది. మైతేయిల తరపున పిటిషన్‌ వేసిన సీనియర్‌ అడ్వకేట్‌ మాధవి దివాన్‌ని… ఉపసంహరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ పిటిషన్‌లో సీమాంతర ఉగ్రవాదం గురించీ ప్రస్తావించారు. అంతే కాదు. గసగసాల సాగు కారణంగానే ఈ అల్లర్లు మొదలయ్యాయనీ అందులో తెలిపారు. ఇందులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, పిటిషనర్‌లుగా పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు