Saturday, July 27, 2024

పెద్ద చెరువులో పాగా.. కట్టు కాలువ ఖతం..( స్థానిక నాయకుల అండతో బరితెగించిన త్రిపుర కన్ స్ట్రక్షన్స్ ..)

తప్పక చదవండి
  • బాధ్యతలు మరచి తమ ఆత్మగౌరవాన్ని
    తాకట్టుపెడుతున్న లోకల్ లీడర్స్..
  • కాపాడాల్సిన వారే కాసులకు కక్కుర్తి పడి చెరువులను,
    కుంటలను, బఫర్ జోన్లను అప్పగిస్తున్న వైనం..
  • ఏకంగా కట్టు కాలవలో, బఫర్ జోన్ లో 12 విల్లాల నిర్మాణం..
  • ఆ నిర్మాణాలు అక్రమమని నివేదిక ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షన్ అధికారులు..
  • జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు..

రక్షించే వాడే భక్షించినట్లు తమ నియోజకవర్గంలోని చెరువులను కుంటలను కాపాడవలసిన బాధ్యతగల స్థానిక ప్రజా ప్రతినిధులు బడా నిర్మాణ సంస్థలకు సహకరించడం శోచనీయం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చెరువులు, కుంటలు, చెరువుల కట్టు కాలువలు కనుమరుగు అవుతున్నాయి.. నిర్మాణ సంస్థలు వెదజల్లే ఎంగిలి మెతుకులకు అలవాటు పడి, తమ నియోజకవర్గంలో ఉన్న చెరువులను, కుంటలను, బఫర్ జోన్లను కాపాడవలసిన బాధ్యతగల ప్రజా ప్రతినిధులే చట్ట వ్యతిరేకంగా కబ్జాదారులకు అప్పగిస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

హైదరాబాద్, త్రిపుర కన్ స్ట్రక్షన్స్ ల్యాండ్ మార్క్ 2 వెంచర్ నిర్మాణంలో పెద్ద చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని జాయింట్ ఇన్స్పెక్షన్ లో అధికారులు పరిశీలించి పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించడం జరిగింది. స్థానిక నాయకులు నిర్మాణ సంస్థకు అండగా ఉండడంతో ఓపెన్ గా ఉండాల్సిన 10 మీ. పైనే వెడల్పు, రెండు వైపులా 9 మీటర్ల బఫర్ తో ఉన్న కట్టు కాలువను, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు కింద నుండి వేశారు.. రెండు వైపులా ఉన్న బఫర్ స్థలంలో 12 విల్లాలు నిర్మించినట్లు, రెవెన్యూ, ఇరిగేషన్ సర్వేలో గుర్తించారు. 12 విల్లాలు ఉన్నాయని, కట్ట బఫర్ లో రెండు విల్లాలు నిర్మాణం చేశారని.. 10 మీటర్ల బఫర్ జోన్ లో ఉన్న కాంక్రీట్ కాంపౌండ్ వాల్ నిర్మాణం అక్రమం అని తమ నివేదికలో ప్రస్తావించడం జరిగింది.

- Advertisement -

మేడ్చల్ జిల్లా, గండి మైసమ్మ, దుండిగల్ మండలం, బౌరంపేటలో పెద్దచెరుకు ఎస్.టి.ఎల్. 95 – 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగకు బౌరంపేట్ పెద్ద చెరువు వద్ద నిర్వహించారు. అట్టహాసంగా డప్పు చప్పులతో.. ప్రజా ప్రతినిధులు పండుగను ఘనంగా నిర్వహించారు. బౌరంపేట పెద్ద చెరువు కబ్జాలను పట్టించుకోని ప్రజా ప్రతినిధులు చెరువు పండుగల పేరుతో ఉత్సవాలు జరుపుకోవడం అత్యంత బాధాకరం. త్రిపుర ల్యాండ్ మార్క్ 2 పేరుతో పెద్ద చెరువును కబ్జా చేస్తున్నారని స్థానిక ప్రజలు నాయకుల దృష్టికి తీసుకెళ్లినా.. నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు కబ్జా కావడంతో భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని తెలిసినా.. జనం కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులే వారి భవిష్యత్తును అంధకారం చేయడం శోచనీయం. త్రిపుర నిర్మాణ సంస్థ నుండి భారీ ఎత్తున ముడుపులు పొందిన కొందరు నాయకులు, నిర్మాణ సంస్థ కబ్జాల పర్వానికి తెరలేపినా మౌనంగా ఉన్నారంటే స్పష్టంగా ఆ నాయకులు సదరు నిర్మాణ సంస్థకు అమ్ముడుపోయారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వాస్తవాలను గ్రహించి చర్యల కొరకు ఉన్నత అధికారులకు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోవాల్సిన అధికారులకు చర్యలు తీసుకోకుండా.. రాజకీయ నాయకులు వారిపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు సంయుక్తంగా పరిశీలించి పెద్ద చెరువు కబ్జాపై అధికారులు కలెక్టర్ కు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ నిర్మాణ సంస్థ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆక్రమించి నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేనిచో రాబోయే ఎన్నికలలో ప్రజా ప్రతినిధులకు ఓటుతో సమాధానం చెప్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు