- ఉగ్రవాదానికి కొన్ని దేశాలు సహకరిస్తున్నాయని మండిపాటు..
- ఎస్‌సీఓ సదస్సులో షెహబాజ్ షరీఫ్ ముందే హెచ్చరికలు..
- సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్,
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్..
న్యూ ఢిల్లీ, 04 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై తరచూ భారత్ హెచ్చరికలు చేస్తూనే ఉంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ – ఎస్‌సీఓ సమావేశం మంగళవారం వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై జరిగిన చర్చలో పాక్ లక్ష్యంగా ప్రధాని మోదీ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్‌సీవో కమిటీ ఎన్నడూ వెనుకాడకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముందే పాకిస్థాన్‌పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. భౌగోళిక వివాదాలు, ఉద్రిక్తతలు, మహమ్మారులతో పోరాడుతున్న అనేక దేశాలు.. ప్రస్తుతం ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత ప్రధాన సమస్యలుగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇలాంటి వాటిని అన్ని దేశాలు కలిసి ఐక్యంగా ఎదుర్కోవాలని మోదీ పిలుపునిచ్చారు.
ఈ షాంఘై సహకార సంస్థ – ఎస్‌సీవో సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్‌గా మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో పాటు ఇతర ఎస్‌సీఓ సభ్య దేశాల నేతలు పాల్గొన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని వాటి విదేశాంగ విధానంలో భాగంగా మార్చుకుంటున్నాయని.. పాకిస్థాన్‌ను ఉద్దేశించి.. పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం వంటి వాటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారింది. దానిపై ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
షాంఘై సహకార సంస్థ – ఎస్‌సీఓ అనేది కేవలం పొరుగున ఉన్న దేశాల కూటమి మాత్రమే కాదని.. అంతా ఒక కుటుంబమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భద్రత, ఆర్థికాభివృద్ధి, అనుసంధానత, ఐక్యత, సార్వభౌమత్వాన్ని సభ్య దేశాలన్నీ పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. ప్రాదేశిక సమగ్రత, పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఎస్‌సీఓ సదస్సుకు మూల స్తంభాలని తెలిపారు. ఇక ఇదే సదస్సులో ఉక్రెయిన్ యుద్ధం, వాణిజ్యం సహా వివిధ అంశాలపై అన్ని సభ్య దేశాలు చర్చలు జరిపారు.
2001 లో ఈ షాంఘై సహకార సంస్థను ప్రారంభించారు. ఇందులో రష్యా, చైనా, కిర్గిస్థాన్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధ్యక్షులు ఈ సదస్సును మొదలు పెట్టారు. ఈ ఎస్‌సీఓలో భారత్ 2005 లో అబ్జర్వర్‌గా చేరి తర్వాత 2017లో శాశ్వత సభ్య దేశంగా మారింది. ఈ ఏడాదే ఇరాన్ కూడా ఈ కూటమిలో చేరింది.