- గందరగోళం మధ్యన ఉభయ సభలు
- మణిపూర్, ఢిల్లీ ఆర్డినెన్స్‌లపై ఆందోళన
- సభను వాయిదా వేసిన సభాధ్యక్షుడు
- సభ్యుల తీరుకు నిరసనగా సభకు స్పీకర్ ఓంబిర్లా గైర్హాజరు
మణిపూర్ అంశానికితోడు ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. బుధవారం లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు,ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో సభాపతి లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. అయితే లోక్ సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎడతెగకుండా సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పిస్తుండటాన్ని తప్పుబట్టారు. సభా గౌరవానికి అనుగుణంగా సభ్యులు ప్రవర్తించే వరకు తాను సభకు హాజరుకాబోనని మంగళవారం హెచ్చరించారు. ఈ హెచ్చరికకు అనుగుణంగానే ఆయన బుధవారం సభాధ్యక్ష స్థానంలో కనిపించలేదు. మణిపూర్ సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు అవిశ్రాంతంగా పట్టుబట్టారు. దీంతో లోక్ సభ గురువారానికి వాయిదా పడిరది. లోక్ సభ కార్యకలాపాలను బుధవారం బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకి నిర్వహించారు. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని కిరీట్ కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన సభను వాయిదా వేశారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు, 2023ను బుధవారం లోక్ సభ పరిశీలించి, ఆమోదించవలసి ఉంది. కానీ సభ వాయిదా పడటంతో అది సాధ్యం కాలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత నెల 20న ప్రారంభమైనప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయం కలిగించడంపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని అధికార, ప్రతిపక్ష సభ్యులకు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లోక్ సభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతుంది. 10వ తేదీన మోడీ సమాధానం చెబుతారు.
తప్పక చదవండి
-Advertisement-