Tuesday, March 5, 2024

గృహలక్ష్మి దరఖాస్తులకు చివరితేది ఆగష్టు 10

తప్పక చదవండి
 • దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు
 • 25న లబ్ధిదారుల జాబితా
  గృహలక్ష్మి పథకం కింద లబ్ధిపొందాలనుకునేవారు ఈనెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. అందుకోసం కలెక్టరేట్‌, మున్సిపల్, ఎమ్మా్ర్వో కార్యాలయాల్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద ఇళ్లులేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవటానికి ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థికసాయం చేయనున్న సంగతి తెలిసిందే.
  ఇళ్లులేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. అర్హులైన వారు ఈనెల 10వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ సీఎస్ శాంతికుమారి సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలివ్వగా… సాయంత్రం పలు కలెక్టరేట్‌లు గడువు, ఇతర వివరాలతో ప్రకటనలు వెలువరించాయి.
  అర్హులైన వారు అఫ్లికేషన్ ఫారంతో పాటు ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్‌, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, ఆహార భద్రతా కార్డు, బ్యాంకు అకౌంట్ జీరాక్స్ కాఫీలు జత చేయాల్సి ఉంటుంది. ఎమ్మార్వో, మున్సిపల్, కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్లతో పాటు ఈ నెల 10 వరకు వచ్చే దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను 20వ తేదీ వరకు పూర్తిచేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రితో ఆమోదం పొందిన లబ్ధిదారులకు 25వ తేదీ నాటికి పథకం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  ఈ పథకం కింద 100 శాతం రాయితీతో ప్రభుత్వం రూ. 3 లక్షల ఈ ఆర్థిక సాయం అందించనుంది.
  రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున మెుత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందిస్తారు.
  మహిళల పేరు మీదే ఆర్థిక సాయం అందిస్తారు.
  లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి (జన్‌ధన్‌ ఖాతాను వినియోగించవద్దు) .
  కలెక్టర్లు, కమిషనర్లు నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారు.
  ఇంటి బేస్‌ మెంట్‌ లెవెల్‌, రూఫ్‌ లెవెల్‌, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.
  ఇప్పటికే ఆర్‌సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు.
  ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను ప్రకటించారు.
  ఈనెల 10 వరకే అఫ్లికేషన్లు స్వీకరించాలని ప్రభుత్వం చెప్పటంతో అర్హులైన పేద ప్రజలు ఆందోళకు గురవుతున్నారు. ధరఖాస్తు ఫారాలు ఎక్కడ దొరుకుతాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారని.. వాటిని పొందాలంటే మీ సేవలో అప్లై చేసుకోవాలని.. అప్లై చేసుకున్న వారం తర్వాత ఆ పత్రాలు తమ చేతికి వస్తాయని అంటున్నారు. సడెన్‌గా ఇప్పుడు మూడు రోజుల గడువు మాత్రమే ఇవ్వటంతో వాటిని ఎలా పొందటమని వాపోతున్నారు. మరికొన్ని చోట్లు ఎమ్మార్వోలు బదిలీపై వెళ్లారని.. అక్కడ అవసరమైన పత్రాలు అందకపోతే లబ్ధి పొందలేమని ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. గడువు పెంచే విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు