Sunday, April 28, 2024

మాయమవుతున్న మరో చెరువు

తప్పక చదవండి
  • గోపన్ పల్లి, ఈద్గవాని చెరువును భక్షిస్తున్న భూబకాసురులు
  • 5.30 ఎకరాల్లో ఉన్న చెరువును 80 శాతం మట్టితో పూడ్చిన కబ్జాదారులు
  • ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు..
  • రూ.300 కోట్ల విలువైన భూమి అక్రమార్కుల కబంధహస్తాల్లోకి..
  • కబ్జా కోరులకు సహకరించిన అవినీతి అధికారులపై చర్యలు ఎక్కడ..?
  • కబ్జాదారులపై, అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..
  • ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజానీకం..

రాజ్యాన్ని నడిపించే వాడు నిజాయితీగా ఉంటే.. రాజ్యం యావత్తూ నిజాయితీగా నడుస్తుంది.. అధినేతలు అవినీతిలో కూరుకుపోతే వారిని అనుసరించే నాయకులు, విధులు నిర్వహించే అధికారులు సైతం అవినీతి బురదలోనే నడుస్తారు.. ప్రస్తుతం తెలంగాణాలో ఇలాంటి దుర్భర పరిస్థితులే నెలకొన్నాయి.. ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నవారు కొందరైతే.. చెరువులను సైతం చెరబడుతున్న వారు మరికొందరు.. ఏది ఏమైనా అక్రమార్జనే జీవిత లక్ష్యంగా చేసుకుంటున్న కుహనా రాజకీయ నాయకులు, అవినీతికి కొమ్ముకాస్తున్న కొందరు అధికారులు ఉన్నంత కాలం.. సమాజం బాగుపడదు.. సుపరిపాలన అందదు.. కబ్జా కోర్టుల చెరలో చిక్కుకున్న మరో చెరువు గాధ వెలుగు చూసింది.. వివరాలు చూద్దాం..

హైదరాబాద్ : అతి విలువైన భూములు ఉన్న గోపన్ పల్లిలో భూ అక్రమదారుల కన్ను ఈద్గవాని చెరువుపై పడింది.. ఇంకేముంది తమ కబ్జా పర్వానికి శ్రీకారం చుట్టారు.. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు భారీ ఎత్తున సొమ్ము వెదజల్లి చెరువును 80 శాతం మట్టితో పూడ్చి.. కనుమరుగయ్యేలా చేస్తున్నారు.. కాసులు అందుకున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వందల కొద్దీ లారీల్లో మట్టి తెచ్చి యదేచ్చగా 5 ఎకరాల 30 గుంటల విస్తీర్ణం కలిగిన చెరువును అడ్డంగా పూడ్చి వేస్తుంటే, స్థానిక ప్రజలు సంబంధిత రెవెన్యూ , ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మామూళ్ల మత్తులో మునిగితేలుతున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటే.. వారి విధి నిర్వహణ ఎంత సక్రమంగా నిర్వహిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ, నీటిపారుదల అధికారుల ఉదాసీనతతో చెరువు నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నంలో కబ్జాదారులు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం స్థలం విలువ సుమారు రూ.60కోట్ల వరకు పలుకుతోంది. పూడ్చివేతతో రూ.300 కోట్ల ఖరీదైన భూమి ఆక్రమార్కుల బొక్కసం నింపేందుకు సిద్ధంగా ఉంది.

- Advertisement -

చెరువును 80 శాతానికి మించి పూడ్చివేసిన కబ్జాదారులు :
గోపనపల్లి సర్వే నంబరు 71/1, 71/2 లో ఈ తటాకం 5 ఎకరాల 30 గుంటల్లో విస్తరించి ఉంది. 2 ఎకరాల 20 గుంటల్లో శిఖం పట్టా స్థలం ఉంది. నిబంధనలు తుంగలో తొక్కి, శిఖంతో పాటు చెరువులో వందలాది లారీల్లో వారం రోజులుగా మట్టి తెచ్చి డంప్ చేయడం ప్రారంభించారు. ఇలా ఇప్పటికే సుమారు నాలుగున్నర ఎకరాల పైగా చెరువును పూడ్చివేసి చదును చేశారు. కొంత కాలం నుండి చెరువును పూడ్చే కార్యక్రమం జరుగుతున్నా లంచాలు తీసుకున్న పాపానికి నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదు.. ఇది అత్యంత శోచనీయం. గతంలో నీటిపారుదల విభాగం అధికారులు రూ. 85 లక్షలు వెచ్చించి చెరువు అభివృద్ధి, రక్షణ పనులు చేపట్టారు. అదేవిధంగా వాకర్స్ కొరకు నడకదారి ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిధులతో చెరువు అభివృద్ధి చేసినా వాటిని తొలగించి కబ్జాదారులు బహటంగా చెరువును కబ్జా చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు అనేకమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, నీటి పారుదల, రెవెన్యూ విభాగం అధికారులు సంయుక్త పరిశీలన చేశారు. అయినా కూడా ఆ తర్వాత కబ్జాదారులు మరింత బరితెగించి పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారంటే ఆశ్చర్యం తోబాటు ఆందోళన కూడా కలిగిస్తుంది. ఈ విషయంపై జోనల్ కమిషనర్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి ఫిర్యాదు చేశారనే సమాచారం అందుతోంది.. ఇప్పటికైనా ఉన్నత అధికారులు నిర్లక్ష్యం వహించిన నీటిపారుదల శాఖ అధికారులపై, అదేవిధంగా రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, కబ్జాదారులపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఈ అవినీతి కబ్జా వ్యవహారంలో ఏ అధికారి పాత్ర ఏంటి..? ఎవరెవరికి ఎంతెంత వాటాలు అందాయి.. దీని వెనుక ఉన్న బలమైన శక్తి ఏమిటి..? ఎవరి అండతో ఇంతగా రెచ్చిపోతున్నారు..? అసలు కబ్జాదారుల కథేంటి..? వారు ఎవరు..? ప్రభుత్వ ఆశయానికి గండికొడుతూ చెరువుల పునరుద్ధరణ మహత్కార్యానికి తూట్లుపొడుస్తున్నది ఎవరు..? కోట్ల రూపాయల అవినీతి వ్యవహారంపై పూర్తి వివరాలతో.. తగిన ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు