- గ్రూప్-2 వాయిదా కోరుతూ దీక్షకు పిలుపు
- అఖిలిపక్షం పిలుపుతో పోలీసుల అప్రమత్తం
హైదరాబాద్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, బిఎస్పీ నేత ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గ్రూప్2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ శనివారం గన్ పార్క్ వద్ద దీక్షకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లకుండా హైదరాబాద్ తార్నాకలోని కోదండరాం ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గ్రూప్ 2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ తప్పిదాలను నిరుద్యోగుల మీద నెట్టడం సరికాదని అన్నారు. ఒకేసారి మూడు రకాల పోటీ పరీక్షలు ఉండటం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పారు. తర్వాత మౌన దీక్షకు కూర్చున్నారు. అంతకుముందు ఓయూ విద్యార్థులను కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్
2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ … శనివారం గన్ పార్క్ వద్ద ప్రవీణ్ కుమార్ సత్యాగ్రహ దీక్షను తలపెట్టిన నేపథ్యంలో … పోలీసులు ముందుగా ప్రవీణ్ కుమార్‌ను కలిసి దీక్ష వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనను పోలీసులు ఇంట్లోనే అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఇంట్లోకి అనుమతించడం లేదు. దీంతో ఇంట్లోనే తన దీక్షను కొనసాగిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని అన్నారు.