Friday, March 29, 2024

ఆగిన రహదారి పనులు.. ప్రజలకు తప్పని అవస్థలు..

తప్పక చదవండి
  • గత సంవత్సరమే మంజూరైన నిధులు..
  • ఆరు నెలల క్రితం ప్రారంభమైన పనులు..
  • గుత్తేదారు నిర్లక్ష్యంతో నేటికీ పూర్తికాని వైనం..

జల్‌పల్లి, 02 జూన్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :
గత శతాబ్ధం కాలం నుంచి జల్‌పల్లి పురపాలక సంఘం పహాడీషరీఫ్‌ గ్రామంలోని ప్రధాన రహదారి మరమ్మతుకు నోచుకోక గుంతల మయంగా అధ్వానంగా మారడంతో నిర్మాణ పనులను ఎప్పుడెప్పుడు ప్రారభింస్తారా అని ఎదురు చూస్తున్న స్థానిక ప్రజలకు గత సంవత్సరం జనవరి నెలలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి శ్రీశైలం అంతర్గత రహదారి నుండి పహాడీషరీఫ్‌ గ్రామంలోని 12, 13, 14, 15 వార్డుకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి పరచడం కోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) కు చేసిన విజ్ఞప్తి మేరకు ఆ సంస్థ రూ.3.10 కోట్ల నిధులను మంజూరు చేసిందని స్థానిక కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయడంతో పహాడీషరీఫ్‌ గ్రామ ప్రజలు, వాహనదారులు తమ చిరకాల కల నెరవేరుతుందని, గుంతలు, గతుకుల రోడ్డుతో తమకు మోక్షం లభిస్తుందని సంతోషించారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ, సర్వే పనులు పూర్తీ చేసి గత ఆరు నెలల క్రితం రహదారి పనులను మొదలుపెట్టారు. గ్రామంలోని ఇందు కంపెనీ నుండి పహాడీషరీఫ్‌ బస్టాండ్‌ వరకు రోడ్డు వెడల్పులో భాగంగా ఇరువైపులా మార్కింగ్‌ వేసి చదును చేస్తూ కంకర పరచడం ప్రారంభించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు మాత్రం సంబంధిత మున్సిపాలిటీ అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా తాబేలు నడకలా సాగుతున్నాయి. దీనికి తోడు వారం, పది రోజుల నుండి అర్దాంతరంగా రహదారి పనులు నిలిచి పోవడంతో సుమారు అర కిలోమీటర్ వరకు రోడ్డుపై పరిచిన కంకరతో రహదారి అధ్వానంగా తయారైంది.

కంకర తేలిన రోడ్డుతో ఇబ్బంది పడుతున్న వాహనచోదకులు :
ప్రభుత్వ నిధులు నుండి కోట్ల రూపాయలు వెచ్చించి రహదారి అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నా.. కొన్ని ప్రాంతాలలో రహదారి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడంలేదు. గ్రామాల మధ్య తక్కువ వ్యవధిలో సులువుగా రాకపోకలు సాగించాలన్న ఉద్దేశంతో రహదారుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. కానీ జల్‌పల్లి పురపాలక సంఘంలో కొంత మంది ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్‌లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్ద, చిన్న వాహనాలతో ఎప్పుడు రద్దీగా ఉండే పహాడీషరీఫ్‌ గ్రామంలోని రోడ్డుపై గత ఆరు నెలల నుండి చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనుల కొరకు కంకర, డస్ట్‌ వేసి అసంపూర్తిగా వదిలి వేయడంతో దుమ్ము ధూళితో నిర్వాసితులకు తీవ్ర ఇబ్బందులతో పాటు రహదారిపై స్థానిక ప్రజలు, వృదులు, మహిళలు, చిన్నారులు నడవలేక అవస్థలు పడుతున్నారు. కంకర తేలడంతో ద్విచక్ర వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు నెలలు కావస్తున్నా నేటికీ రహదారి పనులు పూర్తీ స్థాయిలో అభివృద్ధి జరుగక పోవడంపై సంబందిత మున్సిపాలిటీ అదికారులు ఎవరు పట్టించుకోరా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిరంతరం 12, 13,14,15 వార్డుకు చెందిన కౌన్సిలర్లు, స్థానిక నేతలు అదే దారిలో పయనిస్తుండడం గమనార్హం. పరిస్థితులపై అవగాహన ఉన్నప్పటికీ ప్రధాన రహదారిపై శ్రద్దలేని విధంగా వ్యవహరిస్తున్న పాలకులపై, అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి
పి. సబితా ఇంద్రారెడ్డి, జల్‌పల్లి పురపాలక సంఘం కమిషనర్‌ ఎన్‌. వసంత రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు స్పందించి.పూర్తీ స్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు అయ్యేలా చర్యలు చేపట్టాలని పహాడీషరీఫ్‌ పరిసరాలలోని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు