- అధ్యక్ష మార్పు వార్తలు చూసి చూసి అలవాటైంది
- ఆ వార్తలను కార్యకర్తలెవరూ పట్టించుకోవడం లేదు
- బీజేపీని బలహీనం చేసేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర
- ఈటల రాజేందర్ కు భద్రత కల్పించాల్సిందే….
- అనుమానితులను అరెస్ట్ చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలి
- ఈనెల 8న 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంఘటనా మంత్రుల సమావేశం
- సికింద్రాబాద్ చేరుకున్న ‘‘విస్తారక్ ‘’లకు స్వాగతం పలికిన బండి
‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది. ఎక్కడైనా నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఏడాది నుండి నన్ను మారుస్తారని మీరు టీవీల్లో చూపిస్తూనే ఉన్నారు… ఆ నిప్పు లేదు.. పొగ లేదు.. ఇదంతా కేసీఆర్ లాంటి మూర్ఖుడు చేస్తున్న కుట్ర. సొంత పార్టీ సంగతిని పక్కన పెట్టి పక్క పార్టీల్లో పొగపెట్టాలని చూస్తున్నరు. మా కార్యకర్తలెవరూ వీటిని పట్టించుకోవడం లేదు’’.
పోలింగ్ బూత్ ల వారీగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అల్పకాలిక విస్తారక్ లను నియమించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి 650 మంది విస్తారక్ లు బుధవారం తెలంగాణకు వచ్చారు. వీరికి సికింద్రాబాద్ తోపాటు మంచిర్యాల, ఖాజీపేట స్టేషన్లలో స్వాగతం పలికి అన్ని మండలాలకు పంపిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పూర్తితో వీరంతా తెలంగాణలోని మండలాల వారీగా పర్యటించి పోలింగ్ బూత్ ల వారీగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమవుతారు.
కేసీఆర్ లాంటి మూర్ఖుడు సొంత పార్టీని పక్కన పెట్టి పక్క పార్టీల్లో పొగపెట్టాలని చూస్తున్నరు. డబ్బు, అధికార మదంతో విర్రవీగుతూ ఇతర పార్టీలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే నన్ను మారుస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మేం అవన్నీ పట్టించుకోం. జేపీ నడ్డా ఆదేశానుసారం పనిచేస్తామన్నారు. అటు హుజురాబాద్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ హత్యకు కుట్ర పన్నారంటూ ఆయన సతీమణి జమున చేసిన వ్యాఖ్యలపై స్పందించారు బండి సంజయ్. ఈటల భద్రతపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో తనపైనా, రాజా సింగ్, ధర్మపురి అర్వింద్ లపై దాడులు చేసి హతమార్చేందుకు యత్నించారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాపై దాడులు చేసి, కుట్రపన్నిన వ్యక్తులను వదిలి మాపై కేసులు పెట్టి మమ్మల్ని జైళ్లలోకి పంపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపారీ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంకా బయట తిరుగుతున్నాడని, మీడియాతో మాట్లాడుతున్నాడని సంజయ్ వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే మోసానికి ప్రతీక అని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రతిరోజు ఎవరిని మోసం చేద్దామా? ఏ కులం ఓట్లు కొల్లగొడదామా? అనే ఆలోచనే తప్ప ప్రజలకు మంచి చేయాలనే తపనే లేదన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓట్లను చీల్చేందుకు పీవీ జపం చేసిన కేసీఆర్.. ఆ ఎన్నికల్లో గెలిచాక మళ్లీ పీవీ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరుకావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పీవీని అవమానిస్తే… కేసీఆర్ మాత్రం ఇంకా పీవీని అవమానిస్తూనే ఉన్నాడని పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహరావు 102వ జయంతి సందర్భంగా ఈరోజు నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ కు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ తమిళనాడు సహాయ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ కోశాధికారి శాంతికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తిలతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.