Tuesday, May 21, 2024

నాడు అయ్యింది.. నేడు ఎందుకు కావడం లేదు..?

తప్పక చదవండి
  • ఓ అజ్ఞాతవాసి సూచన మేరక ఆగిన రిజిస్ట్రేషన్లు..!
  • పెంజర్ల భూములపై రెవెన్యూ అధికారుల వింత ధోరణి..
  • ఉదయం నుంచి ఎదురుచూస్తున్న రైతులు..
  • ఎటూ తేల్చకుండా వెళ్లిపోయిన తహసిల్దార్‌..
    కొత్తూరు : ఓ రైతు తన అవసరాల నిమిత్తం భూమిని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో కొనుగోలుదారుడు అమ్మకం దారుడికి మధ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ కు సిద్ధమయ్యారు. కానీ తహసిల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిరాకరించారు. కారణం ఏంటని ప్రశ్నిస్తే..? సంబంధిత సర్వే నెంబర్‌ పై కొన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉందని.. ఆ ఫిర్యాదు ప్రతి అందిన తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటానని ఆమె బదులిచ్చారు. దీంతో కంగుతిన్న రైతులు, ఎవరో అజ్ఞాతవాసి ఎలాంటి ఆధారం లేకుండా నోటి మాటగా చెబితే రిజిస్ట్రేషన్లు ఆపవచ్చా అని ప్రశ్నిస్తుండగా తహసిల్దార్‌ తనకు ఇతర పనులు ఉన్నాయని కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇది కొత్తూరు తహసిల్దార్‌ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలోని 255 సర్వే నెంబర్‌ పై గతంలో కొన్ని అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అయినా అప్పటి రెవెన్యూ అధికారులు అంతా సక్రమంగానే ఉన్నాయని, ఒక్కసారి స్లాట్‌ బుక్‌ అయితే ఆపడానికి వీలులేదంటూ రాత్రి 9 గంటల సమయంలో రిజిస్ట్రేషన్‌ కు సిద్ధమయ్యారు. అప్పట్లో ఈ సంఘటన పెద్ద దుమారం రేపింది. ప్రస్తుతం ఇదే సర్వే నెంబర్‌ పై భూములను అమ్ముకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులు రిజిస్ట్రేషన్‌ కి వెళితే ఎవరో అజ్ఞాత వ్యక్తి గౌరవ న్యాయస్థానం నుంచి ఏదో కాపీ తెస్తున్నారని అప్పటివరకు రిజిస్ట్రేషన్‌ చేయకూడదని కోరారని చెబుతూ తహసిల్దార్‌ రిజిస్ట్రేషన్‌ నిరాకరించినట్లు తెలిసింది. నిజానికి సంబంధిత సర్వే నెంబర్‌ పై అభ్యంతరాలు ఉంటే గౌరవ న్యాయస్థానం నుంచి లేఖ తహసిల్దార్‌ కు అందిన తర్వాతనే ఆమె పై విధంగా స్పందించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ అజ్ఞాతవాసి ఎవరు..? అతని వెలిబుచ్చిన అభ్యంతరం ఏంటి..? అనేదానిపైన సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సిద్ధపడిన గత అధికారులు.. ఇప్పుడు కొత్తగా వచ్చిన అధికారులు రిజిస్ట్రేషన్‌ జరిపేందుకు మెలికపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. నాడు సక్రమమైంది.. నేడు అక్రమం ఎలా అవుతుందని రైతులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై తహసిల్దారును మీడియా ప్రతినిధులు వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే :
రెవెన్యూ శాఖ నిబంధనల ప్రకారం ఒక్కసారి భూమి రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ అయ్యిందంటే తప్పనిసరిగా అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. ధరణి రిజిస్ట్రేషన్‌ లో ఎలాంటి ఇబ్బందులు లేని పక్షంలో మాత్రమే స్లాట్‌ బుక్‌ అవుతుంది. కానీ రెవెన్యూ అధికారులు పెంజెర్లకు సంబంధించిన భూమి ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయకుండా వెళ్లిపోయారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ముమ్మాటికీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
మొబైల్‌ లిఫ్ట్‌ చేయని తహసీల్దార్‌ :
పెంజెర్ల గ్రామానికి సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్‌ విషయమై స్థానిక తహసీల్దార్‌ జానకి ని మొబైల్‌ ఫోన్‌ వివరణ కొరడాని ప్రయత్నించగా ఆమె మొబైల్‌ లిఫ్ట్‌ చేయకపోవడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు