Friday, May 17, 2024

ఆసియా కప్‌లో భారత్‌ పాక్‌ ఢీ

తప్పక చదవండి
  • పక్షంరోజుల్లో మూడు సార్లు తలపడే ఛాన్స్‌
    ముంబై : క్రికెట్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయంటే చాలు అభిమానులంతా తమ పనులు మానుకోని మ్యాచ్‌కు అతుక్కుపోతారు. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడూ జరిగినా.. రికార్డులన్నీ బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తాయి. పైగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగవు. ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్‌ వంటి వాటిలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడతాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి జరిగే భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి అభిమానులందరికీ ట్రిపుల్‌ ధమాకా ఆఫర్‌ తగిలినట్లుగా భారత్‌, పాకిస్థాన్‌ జట్లు 15 రోజుల్లోనే ఏకంగా 3 సార్లు తలపడే ఛాన్స్‌ వచ్చింది. ఆగష్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియాకప్‌ 2023కి బుధవారం షెడ్యూల్‌ విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు గ్రూప్‌ దశ పోటీలు జరగనుండగా.. సెప్టెంబర్‌ 6 నుంచి 15 వరకు సూపర్‌ 4 పోటీలు జరగనున్నాయి. ఇక సెప్టంబర్‌ 17న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. ప్రస్తుతం భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దీంతో గ్రూపు దశ పోటీల్లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సెప్టెంబర్‌ 2న మ్యాచ్‌ జరగనుంది. శ్రీలంకలోని కాండీ మైదానం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. రెండు జట్లు సూపర్‌ 4 దశకు చేరుకుంటే మరోసారి తలపడతాయి. సెప్టెంబర్‌ 10న కొలంబో వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. రెండు జట్లు కూడా సూపర్‌ 4 పోటీల్లో టాప్‌ 2లో నిలిస్తే ఫైనల్‌లో అడుగుపెడతాయి. దీంతో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ముచ్చటగా మూడో సారి తలపడతాయి. ఫైనల్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 17న కొలంబో వేదికగా జరగనుంది. మొత్తంగా భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఫైనల్‌ వరకు చేరుకుంటే 15 రోజుల వ్యవధిలోనే 3 సార్లు తలపడతాయి.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు